లఖీమ్‌పూర్‌ఖేరిలో మాట్లాడుతున్న ప్రియాంక
సీతాపూర్ (యూపీ): వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో జరిగిన రైతు ఆందోళన.. తదనంతరం చెలరేగిన హింస రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోమవారం విపక్ష రాజకీయ నాయకులు, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లఖీమ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా యూపీ సర్కార్ చర్యలకు దిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖీమ్‌పూర్ ఖేరికి బయల్దేరగా మార్గం మధ్యలో సీతాపూర్ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ పీఏసీ గెస్ట్ హౌస్‌లో ప్రియాంక నిరాహార దీక్షకు దిగారు. తొలుత లక్నోలోనే ఆమెని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ ఆమె ఎలాగోలా రైతుల దగ్గరకు చేరాలని బయల్దేరగా సోమవారం తెల్లవారుజామునే అదుపులోనికి తీసుకున్నారు. తమ కార్లను అడ్డగించి తాళాలు తీసుకొని నిర్భంధించారని ప్రియాంక మీడియాకు చెప్పారు. పోలీసులు తనని అదుపులోనికి తీసుకొని ఉంచిన అతిథి గృహంలో ప్రియాంక చీపురుతో గది ఊడుస్తున్న వీడియోను యూపీ కాంగ్రెస్ నేత వికాస్ శ్రీవాస్తవ విడుదల చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో రైతులే గెలుస్తారని వ్యాఖ్యానించారు. ‘‘ప్రియాంక నాకు తెలుసు నువ్వు వెనుకడుగు వెయ్యవు. ప్రభుత్వం నీ ధైర్యం చూసి భయపడుతోంది’’అని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు లఖీమ్‌పూర్ ఖేరికి పర్యటనకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ , ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాంధ్వా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్‌లకు యూపీ సర్కార్ అనుమతి నిరాకరించింది.
యూపీ, హరియాణా సరిహద్దుల్లో రాంధ్వా, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల విమానాలేవీ లక్నోలో ల్యాండ్ కానివ్వొద్దంటూ యూపీ సర్కార్ లక్నో ఎయిర్‌పోర్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు.
యూపీలో హంతక రాజ్యం: మమత
లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో నిరంకుశ పాలన, ఉత్తర ప్రదేశ్‌లో రామరాజ్యం బదులు హంతక రాజ్యం నడుస్తోందన్నారు. ‘‘దేశంలో ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పాలన. రైతులను దారుణంగా చంపేస్తున్నారు. నిజాలను బయటకు రాకుండా చేస్తున్నారు. అందుకే లఖిం పూర్‌ఖేరిలో 144వ సెక్షన్ అమలు చేస్తు న్నారు. దేశ ప్రజలే బీజేపీపై 144వ సెక్షన్ విధించే రోజు త్వరలో రానుంది’’అని సీఎం మమతాబెనర్జీ సోమవారం భవానీపూర్‌లో మీడియాతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment