
వారణాసి ర్యాలీలో ప్రజలకు ప్రియాంక అభివాదం
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«ధీ డిమాండ్ చేశారు. మిశ్రా రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఎవరూ తమని నిరోధించలేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా కిసాన్ న్యాయ్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీనుద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.
బాధిత కుటుంబాలకు యూపీలో న్యాయం జరగదన్నారు. బాధిత కుటుంబాలు న్యాయం కోరుకుంటున్నాయే తప్ప డబ్బు కాదన్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలెవరికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లే తీరిక దొరకలేదన్నారు. ‘‘సోన్‌భద్ర మారణకాండలో ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఉన్నావ్, హత్రాస్ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో న్యాయం జరగలేదు. ఈ కేసులోనూ అదే జరుగుతోంది. లఖీమ్‌పూర్ ప్రజలకి కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది’’ అని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తమతో చర్చించడానికి యూపీ ప్రభుత్వం క్రిమినల్స్‌ని పం పిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రియాంక వెల్లడించారు.
మతం రంగు పులమొద్దు: వరుణ్ గాంధీ
లఖీమ్‌పూర్ ఉదంతాన్ని హిందువులు, సిక్కుల మధ్య గొడవగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రమాదకర పరిణామాలను దారి తీస్తాయని, మానిపోయిన పాత గాయాలను మళ్లీ రేపుతాయంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. స్థానిక ఆధిపత్య శక్తుల వల్లే పేద రైతులు బలయ్యారని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేసే రైతులను ఉద్దేశించి ‘ఖలిస్తానీ’ అని మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశ ఐక్యతను పణంగా పెట్టొద్దని వరుణ్ గాంధీ కోరారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలకు ఆయన మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment