(వెంకటేష్ నాగిళ్ల- సాక్షిటీవీ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి): లఖింపూర్ ఖేరి ఘటన తమ కొంప ముంచేలా ఉందని బిజెపి నేతలు వాపోతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గుదిబండగా మారే అవకాశాలున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశమంతటిని కదిలించింది.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనయుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించేంతవరకు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైతుల విషయంలో దారుణంగా వ్యవహరించిన తండ్రి, కొడుకులిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది.
(చదవండి: బడితెపూజ∙తప్పదు!)
ఈ వైఖరిపై బిజెపిలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వ్యక్తిని కాపాడే క్రమంలో పార్టీ పరువు బజారుకీడ్చారని పలువురు నేతలు మండిపడుతున్నారు. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూపిలో యోగి ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అరోపణలు ఎదుర్కొంటోంది. వివేక్ దూబే ఎన్ కౌంటర్ సహా గతంలో బ్రాహ్మణులకు దక్కిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వుంది.
(చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు)
దీన్ని అధిగమించేందుకే రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించి బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు మంత్రివర్గంలో చేర్చుకుంది. అలాగే కేంద్రంలో అజయ్ మిశ్రాకు సహయమంత్రి పదవి ఇచ్చి కీలకమైన హోంశాఖను అప్పజెప్పారు. అయితే అజయ్ మిశ్రా తన దుందుడుకు వ్యవహరంతో రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాంతో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులపై కాన్వాయ్‌ను నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆయన పార్టీకి లేని తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనపై వెంటనే వేటు వేస్తే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల కోపం చల్లార్చేందుకు తీసుకున్న చర్యలు నిష్ఫలమవుతాయి.
అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేంతవరకు యోగి ప్రభుత్వం వెయిట్ చేసింది. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేయించడం లేక మరోటా అనేది తేల్చే అవకాశముంది. ఏది ఏమైనా ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తే, వారే మరో అతిపెద్ద సమస్యను బిజెపికి సృష్టించారు. దాని ఫలితంగా ఎన్నికల్లో బిజెపి నష్టపోయే పరిస్థితి తలెత్తింది.
(చదవండి: అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment