‘మీటూ’.. మరింత ముందుకు | Celebrities talk about metoo movement | Sakshi
Sakshi News home page

‘మీటూ’.. మరింత ముందుకు

Published Wed, Oct 17 2018 12:20 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Celebrities talk about metoo movement - Sakshi

‘మీటూ’ ఉద్యమ విస్తృతి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైగింక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్‌ దర్శకులు సాజిద్‌ ఖాన్, వికాస్‌ బాల్, సుభాష్‌ కపూర్, నటుడు నానా పటేకర్‌తో పాటు  మరికొందరు వృత్తి పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వైస్‌ ప్రెసిండెంట్, క్రియేటివ్‌ హెడ్‌ ఆశిష్‌ పాటిల్‌ చేరారు. ‘ఆశిష్‌ పాటిల్‌ తనను లైగింకంగా వేధించాడు’ అని ఓ మహిళ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. బాధితురాలు తమకు సరైన పద్ధతిలో ఫిర్యాదు చేస్తే ఆయనపై తగిన చర్యలు   తీసుకుంటామని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రతినిధులు అన్నారు. ఆశిష్‌కు అడ్మినిస్ట్రేటివ్‌ సెలవును ప్రకటించారు. ఆ తర్వాత అతన్ని వి«ధుల నుంచి పూర్తి్తగా తొలగిస్తున్నట్లు మంగ ళవారం ట్వీటర్‌ వేదికగా పేర్కొన్నారు. 

క్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రముఖుడు అనిర్భాన్‌ దాస్‌ బ్లాహ్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని విధుల నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు ఓ నోట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘దాస్‌ బ్లాహ్‌ను వైదొలగాలని కోరాం. మా ఉద్యోగులకు సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం మా కర్తవ్యం. ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం’’ అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సౌత్‌లోనూ ‘మీటూ’ ఉద్యమ గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నటి సంగీతా బాద్, ఆర్‌.జే. నేత్ర మాట్లాడుతూ ‘తామూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం’’ అన్నారు. కథానాయికలు కృతీకర్బందా, శృతీ హరిహరన్, సంయుక్తా హెగ్డేలతో పాటు మరికొందరు కథానాయికలు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలిపారు.  

ఆ హక్కు ఎవరికి ఉంది?!
మరోవైపు నటి భావనపై లైంగిక దాడి విషయంలో నటుడు దిలీప్‌ సభ్యత్వంపై వేటు వేయకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (అమ్మ)లో కొనసాగిస్తుండటంపై ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌(డబ్ల్యూ.సీ.సీ) సభ్యులు తప్పుబట్టారు. బాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించబోమని చెప్పిన అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్‌ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంపై ‘అమ్మ’ కార్యదర్శి సిద్ధిఖీ స్పందిస్తూ...‘‘డబ్ల్యూ.సి.సి సభ్యులు అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్‌లను ఉదాహరణలుగా చెప్పారు. కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తిని ఒక వృత్తి నుంచి నిషేధించమనే హక్కు ఎవరికి ఉంది? ఇది ఎంత వరకు సమంజసమైంది. నిందితులుగా తమ పేర్లు జాబితాలో ఉంటే అప్పుడు కూడా అక్షయ్, ఆమిర్‌ తాము నటిస్తున్న సినిమాల గురించి ఇలానే చేస్తారా?’’ అని షూటుగా విమర్శించారు.

ఇదొక ఆరంభం
‘మీటూ’ ఉద్యమంపై తాజాగా నటి సుస్మితా సేన్‌ స్పందించారు. ‘‘ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు షాకింగ్‌లా ఉంటాయి. కానీ, మనం అమాయకులం ఏమీ కాదు. ఇదొక ఆరంభం. ‘మీటూ’ ఉద్యమంలో మాట్లాడిన  బాధిత మహిళల మాటలను వినాలి. నమ్మాలి. వ్యాప్తి చేయాలి’’ అన్నారు.

దుర్వినియోగం కాకూడదు
రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘దేదే ప్యార్‌ దే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు లవ్‌ రంజన్‌పై లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రకుల్‌ను అడగ్గా...‘బాధిత మహిళల మాటలను ప్రజలు వింటున్నారు. కొంతమంది శిక్షించ బడుతున్నారు కూడా. రాబోయే కాలంలో వర్క్‌ ప్లేస్‌ మరింత సౌకర్యంగా ఉండాలంటే ‘మీటూ’ ఉద్యమం మిస్‌ యూజ్‌ కాకూడదు’’ అని పేర్కొన్నారు రకుల్‌.  కాగా ‘‘లైంగిక వేధింపుల గురించి ఎప్పటికీ చెప్పకపోవడం కన్నా కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు చెప్పడం ఉత్తమమే’’ అని సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ పేర్కొన్నారు.  ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తాజాగా మరికొందరిపైనా ఆరోపణలు వస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement