Shocking Video Footage Of Afghan Kabul Outside Aiport Goes Viral - Sakshi
Sakshi News home page

Kabul Airport Video: కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు

Aug 22 2021 8:40 AM | Updated on Aug 22 2021 4:02 PM

Kabul Outside Airport Video Viral On Social Media - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్‌ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్‌ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్‌ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్‌ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న  తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.  

ఆ వీడియో భయానకం 

కాబూల్‌ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్‌ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి.

చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 

169 మంది అమెరికన్ల ఎయిర్‌లిఫ్ట్‌  
అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్‌ విమానాశ్రయం వెలుపల బారన్‌ హోటల్‌లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్‌ చేసి మరీ తీసుకువెళ్లారు.   

విమానాశ్రయం దగ్గరకు రావొద్దు  
అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్‌ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement