హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ మృతి వీడియోతో పాలస్తీనా కట్టలు తెగిన ఆగ్రహం
హమాస్ సభ్యులను భయ కంపితులను చేయజూసిన ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది.
ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి.
సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది.
రక్షణ వలయం లేదు.. కవచం లేదు
గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి.
మద్దతుదారుల కంటతడి
మృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్
ఇదీ జరిగింది
సిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్‌ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్‌ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment