న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment