OP Rawat
-
నోట్లరద్దుతో సీన్‌రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్‌మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, సిబ్బంది సన్నద్ధత పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి పాల్గొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి.రావత్ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ను అభినందించారు. అవసరమయినప్పుడు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతోపాటు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, జరిగేలా చూడాల న్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, మత్తుపదార్థాలు రవాణా కాకుండా చూడాలని, ఓటర్ల అక్రమ తరలింపుపై నిఘా ఉంచాలని రావత్ ఆదేశించారు. ఇదే అంశంపై రజత్‌కుమార్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఇప్పటికే పటిష్టమైన నిఘా ఉంచామని, తీవ్రవాదుల కార్యకలాపాలు, మద్యం, డబ్బు తదితరాల రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ఈ విషయంలో పొరుగు రాష్ట్రాల అధికారుల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. -
పింక్ బ్యాలెట్ కొనసాగుతుంది : సీఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పింక్ బ్యాలెట్ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ స్పష్టం చేశారు. సాంకేతికత ద్వారా డూప్లికేట్ ఓటర్లను తొలగించడమనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జిల్లాల టీమ్‌లతో సమీక్ష చేశామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఆరోపణలు- ప్రత్యారోపణల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ఉండాలని, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32574 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 222 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టిన తర్వాత అనుమానాలు ఉంటే వీవీప్యాట్లలో ఓట్లను టాలీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 211 పెయిడ్ న్యూస్ కేసులు.. వివిధ రాజకీయ పార్టీలతో ఓపీ రావత్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికార దుర్వినియోగం, ఉద్యోగుల కేసుల మీద ఇచ్చిన జీవో, టెలిఫోన్ ట్యాపింగ్, మత విద్వేషాలు, మంత్రుల పర్యటనలు వంటి పలు అంశాల మీద ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ మీద వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ మీద కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతీ పార్టీపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో నాయకులు వాడుతున్న భాష మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా డబ్బు ఖర్చు విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిన అభ్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియాలో పెయిడ్ న్యూస్ వేస్తున్నారని, పార్టీ సొంత పేపర్, ఛానెల్స్ ద్వారా విద్వేషపు ప్రచారం చేస్తున్నారంటూ వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని ఓపీ రావత్ తెలిపారు. ఈ క్రమంలో 211 పెయిడ్ న్యూస్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితాను సరిదిద్దండి!
సాక్షి, హైదరాబాద్: తప్పులతడకగా మారిన ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందునాటికి తప్పులను సరిదిద్దాలని అధికారులకు సూచించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ నేతృత్వంలోని బృందం రెండోరోజు మంగళవారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడి ఓ హోటల్లో 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్ల తీరుపై స్థూలంగా సంతృప్తి వ్యక్తం చేసింది. వికలాంగ, వయో వృద్ధ, మారుమూల ప్రాంతాల, మురికివాడల ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, రోజూ పర్యవేక్షించాలని పేర్కొంది. లెక్కలు లేని నగదు జప్తుపై దృష్టి సారించాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులని, ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. సమీక్షలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, చంద్రభూషణ్‌కుమార్, దిలీప్‌శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్ భయిల్ శర్మ, ఎస్కె రుడోలాతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లాలవారీగా పరిశీలన కేంద్ర ఎన్నికల బృందం జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాట్లను సమీక్షించింది. ప్రధానంగా ఓటర్ల నమోదులో వచ్చిన సాంకేతిక లోపాలు, ఈఆర్వో నెట్ వెబ్సైట్ మొరాయించడం, కొత్తగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్‌లు పని చేయకపోవడం, సరైన సమన్వయం లేకపోవడంపై జిల్లాల అధికారులు కేంద్ర ఈసీ బృందానికి నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సీఈవో రజత్‌కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్లపై అవగాహన సదస్సులు పూర్తి చేశారా? అన్ని జిల్లాలకు సరిపడ సంఖ్యలో వీవీ ప్యాట్లు వచ్చాయా? వాటికి ప్రాథమిక స్థాయి పరీక్షలు పూర్తి చేశారా ? వాటిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారా ? అనే విషయాలను కేంద్ర బృందం ఆరా తీసింది. ఏర్పాట్లను సమీక్షించేందుకు మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తామని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తం సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం బృందం సూచించింది. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలో పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండాముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. డబ్బు, మద్యం సరఫరాలపై నిఘా పెట్టి నిరోధించాలని ఆదేశించింది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల పనులను వేగవంతం చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 7 న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలోఅధికారులు నిమగ్నమై ఉండాలని సూచించింది. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటొద్దు అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలకు మించరాదని, ప్రచారంలో అభ్యర్థి తరపున చేసే ప్రతీ ఖర్చుకు లెక్కలు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆదేశించింది. అభ్యర్థుల ఖర్చుల లెక్కలు రోజువారీగా సమర్పించాలని, మీడియాలో ఇచ్చే ప్రకటనలపై కూడా నిఘా ఏర్పాటు చేసి దానిపై కూడా లెక్కలు వేయాలని సూచించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి మీడియా టారిఫ్‌లను తెప్పించుకుని, వాటిని సరిపోల్చి లెక్కలను పకడ్బందీగా చూడాలని కోరింది. రాజకీయ పార్టీల ఎన్నికలు మేనిఫెస్టోను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించింది. -
ఎన్నికల కమిషన్‌కు మరో మచ్చ!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలను నిర్వహించడం ఓ ముఖ్యమైన ఘట్టం. ఎవరి ఒత్తిడులు లొంగకుండా ఈ ఘట్టాన్ని సమర్థంగా నిర్వహించే అధికారాలను రాజ్యంగంలోని 324వ అధికరణం ఎన్నికల కమిషన్‌ను కట్టబెట్టింది. అంటే ఎన్నికల కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తిగల సంఘం. ఎలాంటి అనుమానాలకు, పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకుండా సహేతుకంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా ఎన్నికల కమిషన్‌కు ఉంది. కానీ ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అనుమానాస్పదమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్డ్‌ను శనివారం నాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్, ఆ రోజున విలేకరుల సమావేశాన్ని షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు అన్ని మీడియా సంస్థలకు ముందుగానే సమాచారాన్ని అందించింది. ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని 3.30 గంటలకు వాయిదా వేసింది. విలేకరుల సమావేశం గురించి మీడియాకు పది గంటలకు తెలియజేశామని, మీడియా అంతా రావడం కోసం సమావేశాన్ని మూడున్నర గంటలకు వాయిదా వేయాల్సి వచ్చిందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఎంత అర్థరహితమో ఇట్టే తెలిసిపోతుంది. మీడియా మిత్రులు రావడానికి రెండున్నర గంటల సమయం సరిపోదా? సరిపోదనుకుంటే ఓ అరగంటో, గంటో వాయిదా వేయాలిగానీ మూడు గంటలు వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. అందుకే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సౌకర్యార్థమే విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసిన ట్లు విమర్శించింది. ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. ప్రసంగిచారు కూడా.అదే సభలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రసంగిస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్ వరాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినట్లయితే అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అందుకని మోదీ ప్రసంగం తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలా ఎన్నికల కమిషన్ తన షెడ్యూల్‌ను మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు వివాదాస్పదం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఎన్నికల కమిషన్ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. కొన్ని వారాల తేడాతో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు, వాటి ఎన్నికల షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించడం సంప్రదాయం. గతేడాది అక్టోబర్ 12వ తేదీన హిమాల్ ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, అక్టోబర్ 25వ తేదీన గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాదాపు ఈ రెండు వారాల్లో మోదీ గుజరాత్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు పలు ఎన్నికల వాగ్దానాలు చేశారు. మొన్న శనివారం నాడు కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు, కర్ణాటకలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్, తమిళనాడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలలో తమిళనాడుకు తుపాన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని వాటి షెడ్యుల్‌ను ప్రకటించలేదని రావత్ వివరణ ఇచ్చుకున్నారు. తుపాన్లు వచ్చే సమయంలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలను నిర్వహించడం పెద్ద కష్టమా? రానున్న తుపాన్ల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేసిన సందర్భలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నర్ణయమైనా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు. అది దాని అధికారం. తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా, నిర్వివాదాస్పదంగా ఉండేల చూసుకోవడం ముఖ్యమైన బాధ్యతన్నది విస్మరించరాదు. -
తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు!
-
బ్రేకింగ్: తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. అయితే, తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. రాజస్థాన్‌తోపాటే అనూహ్యంగా ఆయన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా రావత్ ప్రకటించారు. అయితే, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం, ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించినప్పటికీ.. కోర్టు తీర్పు ప్రభావం షెడ్యూల్‌పై ఉండే అవకాశముందని భావిస్తున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతోనే తెలంగాణ ఎన్నికల తేదీని చివరి షెడ్యూల్ పెట్టామని, దీనివల్ల కోర్టు తీర్పునకు అనుగుణంగా షెడ్యూల్‌ను మార్చే అవకాశముంటుందని రావత్ చెప్పారు. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.. నవంబర్ 12న నోటిఫికేషన్ వెలువడనుంది.. నామినేషన్లు దాఖలు చివరి తేదీ : నవంబర్ 19 నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22 పోలింగ్: డిసెంబర్ 7 కౌంటింగ్: డిసెంబర్ 11 ఓ కేసులో పెండింగ్‌లో ఉంది.. తెలంగాణలో ఎన్నికల జాబితాకు సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, ఓటర్ల తుది జాబితాను ఖరారు కాగానే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రావత్ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీలోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కొంత సమయం పట్టవచ్చునని ఆయన చెప్పారు. -
రాజస్తాన్ ఎన్నికల్లో వీవీప్యాట్లు: ఈసీ
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా మొత్తం 200 నియోజకవర్గాల్లోనూ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్–ఓటు రశీదు యంత్రం)లను వినియోగిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా 51,796 పోలింగ్ బూత్‌లలో ఈ మెషీన్లను వాడతామని రావత్ చెప్పారు. నకిలీ వీవీప్యాట్లను గుర్తించగలిగేలా ఎం3 రకం ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఒక్క పోలింగ్ బూత్‌ను అయినా పూర్తిగా మహిళా సిబ్బందే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో ఏదైనా అసాధారణ, అసాంఘిక చర్యలు జరిగినట్లు తెలియగానే ఛిVఐఎఐఔ యాప్ ద్వారా పౌరులు ఫిర్యాదుచేయవచ్చని రావత్ పేర్కొన్నారు. -
ఎన్నికల కోడ్ అతిక్రమణలపై ‘సీ–విజిల్’
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను రూపొందించింది. త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజో రాం రాష్ట్రాల ఓటర్లకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఓటర్లను శక్తిమంతుల్ని చేయడమే తమ లక్ష్యమన్నారు. సీ–విజిల్ యాప్ సాయం తో సాధారణ ఓటర్లు కూడా తమ ప్రాంతం లోని ఉల్లంఘనల ఫొటోలు తీసి ఎన్నికల అధికారికి పంపవచ్చు. ఫిర్యాదుదారు ఏ ప్రాంతం నుంచి ఆ ఫొటోలను పంపారో తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు కూడా ఉంది. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడి వేధింపులకు గురయ్యే ఫిర్యాదుదారు తమ వివరాలను రహస్యంగా ఉంచాలనుకుంటే అందుకోసం యాప్‌లో ప్రత్యేక ఏర్పాటు ఉంది. -
నల్లధనం అడ్డుకట్టకు ఈ చట్టాలు చాలవు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు. -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌తో సమావేశం అయ్యారు. వీరి భేటీ సుదీర్ఘంగా ఐదున్నర గంటలపాటు కొనసాగింది. అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం తెలంగాణకు రానున్న నేపథ్యంలో.. వారి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్దత అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించానని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాపై సెప్టెంబర్ 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది. అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పింది. -
4 రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు జరగొచ్చు
-
వీలైతే డిసెంబర్‌లోపే ఎన్నికలు
సాక్షి, ఢిల్లీ ప్రతినిధి: తెలంగాణ శాసనసభ మార్చి 5లోగా సమావేశమయ్యేందుకు వీలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించడంపై సంసిద్ధత స్థాయినిబట్టి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో వెల్లడించారు. సంసిద్ధతకు సమయం అవసరమనుకుంటే 2019 జనవరి 1 ప్రాతిపదికన రూపొందించే ఓటరు జాబితా ఆధారంగా జనవరి నుంచి మార్చిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంసిద్ధతస్థాయి సంతృప్తికరంగా ఉంటే 2018 జనవరి 1 ప్రాతిపదికన రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేకంగా స్వల్పకాలంలో ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వీటి ఆధారంగా డిసెంబర్‌లోపే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఏడు మండలాల విలీనం అంశంపై కేంద్ర హోంశాఖ ఇచ్చే నోటిఫికేషన్ ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలు... సాక్షి: తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. మరి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు సంసిద్ధంగా ఉంది? సీఈసీ: తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్లు నిన్న నోటిఫికేషన్ వెలువడిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మేం తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో సంసిద్ధత స్థాయిపై సీఈవోను నివేదిక కోరాం. నివేదిక రాగానే మూల్యాంకనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి బేరీజు వేస్తాం. ఆ తరువాతే తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై షెడ్యూల్ జారీ చేస్తాం. సాక్షి: ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది? కాలపరిమితి ఏమైనా ఉందా? సీఈసీ: దీనిపై సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. అసెంబ్లీ కాలపరిమితికన్నా ముందే రద్దయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, అందుబాటులో ఉన్న తొలి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆరు నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల మార్చి 5లోగా తెలంగాణ అసెంబ్లీ సమావేశమవ్వాలి. సాక్షి: త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? సీఈసీ: అది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జూలైలోనే సంసిద్ధత కసరత్తు మొదలైంది. అందువల్ల తెలంగాణలో సంసిద్ధత స్థాయిని మేం మూల్యాంకనం చేయాల్సి ఉంది. అప్పుడే మేం ఒక నిర్ణయానికి రాగలం. సాక్షి: సంసిద్ధతకు ఈ సమయం సరిపోదా? సీఈసీ: దాని కోసమే ఈ మూల్యాంకనం. సంసిద్ధతకు మూడు నెలలు అవసరం అవుతుందా లేక ఒక నెలా అన్నది చూడాలి. సాక్షి: మీరు 2018 జనవరి 1 జాబితాతో ఎన్నికలకు వెళ్తారా లేక స్పెషల్ రివిజన్ చేపడతారా? సీఈసీ: ఒకవేళ సంసిద్ధతకు చాలా సమయం పడుతుందని భావిస్తే సమ్మరీ రివిజన్–2019 కొనసాగుతుంది. ఆ ఓటరు జాబితాల ఆధారంగా 2019లో ఎన్నికలు నిర్వహిస్తాం. కానీ ఒకవేళ మేం ఎన్నికల సంసిద్ధత స్థాయిపై సంతృప్తి చెందితే 2018 జనవరి 1 సమ్మరీ రివిజన్ ఆధారంగా ముందుకెళ్తాం. ఆ తేదీ నాటికి ఓటు హక్కు కలిగి ఓటరుగా నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తూ స్వల్పకాల ప్రత్యేక రివిజన్ చేపడతాం. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేస్తాం. సాక్షి: ఈసారి వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంటాయా? సీఈసీ: వందకు వందశాతం అందుబాటులో ఉంచుతామని ఇదివరకే అఖిలపక్ష సమావేశంలో చెప్పాం. దాన్ని అమలు చేస్తాం. మరికొన్ని రోజుల్లోనే వీవీ ప్యాట్లను తెలంగాణకు అందుబాటులోకి తెస్తాం. ఆ యంత్రాల ఉత్పత్తి కొనసాగుతోంది. సాక్షి: తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. అక్కడి ఓటర్ల పరిస్థితి ఏమిటి? వారు ఎటువైపు ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది? సీఈసీ: మేం దానిపై సమాచారం అడిగాం. ఆరు నెలలుగా హోంశాఖ వద్ద అది పెండింగ్‌లో ఉంది. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారమవుతుందనుకుంటున్నాం. హోంశాఖ ఇచ్చే నోటిఫికేషన్ ఆధారంగా ఓటరు జాబితా సవరించాల్సి ఉంటుంది. సాక్షి: ఈ ఏడు మండలాలను ఏపీలో కలపడం వల్ల తెలంగాణలోని మూడు నియోజకవర్గాల ఎస్టీ రిజర్వేషన్లో మార్పు ఉంటుందా? సీఈసీ: ఆ అంశాలన్నింటినీ కేంద్ర హోంశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ఆధారంగా నిర్ణయిస్తాం. సాక్షి: రాజకీయ పార్టీలకు ఈ సమయంలో మీరిచ్చే సూచన ఏమిటి? సీఈసీ: ఏ అభిప్రాయమైనా చెప్పే ముందు అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీలకు నా విజ్ఞప్తి. సాక్షి: తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిపే పరిస్థితి ఉందా? సీఈసీ: అందుకు కమిషన్ అన్ని విధాలుగా వనరులను సమకూర్చుకుంటుంది. సాక్షి: ఇప్పటివరకు సంసిద్ధత స్థాయిపై అంచనాకు వచ్చారా? సీఈసీ: తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతపై ఇప్పటివరకు మా వద్ద ఉన్న సమాచారాన్ని నేటి సమావేశంలో మూల్యాంకనం చేస్తున్నాం. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మాతో సమావేశమవుతారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక బృందం మంగళవారం తెలంగాణలో పర్యటించి సంసిద్ధతను ధ్రువీకరించుకుంటుంది. సాక్షి: షెడ్యూల్ విడుదలకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? సీఈసీ: ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, అర్హతగల వారందరికీ ఓటు హక్కు కల్పించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్లు సమకూర్చుకోవడం, వాహనాలు, సిబ్బంది, సాయుధ బలగాలు... ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికల కమిషన్ సాధ్యమైనంత త్వరగా, ఆరు నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అలాగే సంసిద్ధత, ఇతర కారణాలు చెప్పి ఎన్నికల నిర్వహణను జాప్యం చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించరాదని కూడా చెప్పింది. ఇవన్నీ బేరీజు వేసుకుని షెడ్యూల్ జారీ చేస్తాం. మార్చి 5 వరకు మాకు గడువు ఉంది. అందువల్ల అవసరమనుకుంటే కొంత సమయం తీసుకుంటాం. సంసిద్ధతస్థాయి బాగుంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకంటే ముందు కూడా జరగొచ్చు. సాక్షి: అక్టోబర్, నవంబర్లలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, తాను సీఈసీతో మాట్లాడానని సీఎం ప్రకటించారు. రాజకీయ పార్టీలు దీన్ని తప్పుబడుతున్నాయి. దీనిపై మీరేమంటారు? ముఖ్యమంత్రి మీతో మాట్లాడారా? సీఈసీ: ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిషన్ పరిధిలోకి చొచ్చుకురావడం తప్పు. షెడ్యూల్ నిర్ణయించడం, జారీ చేయడం అనే ప్రత్యేక అధికారం కేవలం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంది. రాజకీయపక్షాలే కాదు.. మేం కూడా అదే అభిప్రాయంతో ఉన్నాం. ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మమ్మల్ని కలిశారు. ఊహాజనిత ప్రశ్న అడిగారు. కమిషన్ ఊహాజనిత ప్రశ్నలపై కామెంట్ చేయదని చెప్పాం. -
ఇప్పుడే ఏమీ చెప్పలేము : ఓపీ రావత్
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు జరపాలని, 6 నెలలపాటూ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతోపాటూ తెలంగాణ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని రావత్ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు 4 రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జోష్యంతో ఈసీకి సంబంధంలేదన్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ భేటీ అయ్యారు. ఎన్నికల సన్నద్ధత పరిశీలన కోసం ఈనెల 11న హైదరాబాద్ కు ఎన్నికల సంఘం బృందాన్ని పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పరిస్థితులను తెలుసుకునేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సింహ నేతృత్వంలోనీ బృందం హైదరాబాద్ లో పర్యటించి నివేదిక తయారు చేయనుంది. -
ముందస్తు ఎన్నికలు ఇంకా ముందే?
-
ముందస్తు ఎన్నికలపై కమిషన్ చర్చించాలి: ఓపీ రావత్
-
ఈవీఎంలు వద్దు..మళ్లీ బ్యాలెట్లే కావాలి!
-
మళ్లీ బ్యాలెట్‌కే వెళ్దాం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలతోపాటు వాటికి అనుసంధానించే వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రాల)ల్లో లోపాలపై అభ్యంతరాలు తెలిపాయి. అలాగే ఓటరు జాబితాలో నకిలీల్ని నివారించేందుకు ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఈసీకి సూచించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో సోమవారం ఈసీ సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష భేటీలో బీజేపీ మినహా మిగతా ఆరు జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు మళ్లీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానంతోనే దేశంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నొక్కిచెప్పాయి. ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందేలా సమాధానం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్ పద్ధతికి మళ్లడమంటే పోలింగ్ బూత్‌ల ఆక్రమణల్ని స్వాగతించినట్లేనని సీఈసీ ఓపీ రావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొన్ని పార్టీలు మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కోరడం మంచిది కాదు. అదే సమయంలో ఈవీఎంలతో కొన్ని సమస్యలున్నాయని, వీవీపాట్ల స్లిప్‌ల లెక్క విషయంలో లోపాలున్నాయని మా దృష్టికి తీసుకొచ్చాయి. మేం వాటిపై దృష్టిపెడతాం’ అని ఆయన చెప్పారు. 70% పార్టీలది బ్యాలెట్ బాటే: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాల్ని వినడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో నిజానికి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్‌ల్లో సాంకేతిక లోపాలు అజెండా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటినే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవీఎంల్ని ట్యాంప రింగ్ చేస్తున్నారని, పేపర్ బ్యాలెట్లకు మళ్లాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ఆద్మీ, జనతాదళ్(ఎస్), సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘నాల్గింట మూడొంతు పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్, సాంకేతిక లోపాల్ని ప్రస్తావించాయి. ఈ విషయంలో బీజేపీ ఒంటరైంది. 70 శాతం రాజకీయ పార్టీలు పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని ఈసీని కోరాయి’ అని చెప్పారు. ‘ఒకవేళ పేపర్ బ్యాలెట్‌కు ఈసీ మొగ్గు చూపనిపక్షంలో.. ఓటింగ్ విశ్వసనీయత కోసం కనీసం 30 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాల్ని ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. మొత్తం 41 పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులకు పరిమితి విధించడాన్ని భేటీలో బీజేపీ వ్యతిరేకించింది. దానికి బదులు మరింత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై తాము సానుకూలంగా ఉన్నామని తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించాలి ఎన్నికల్లో అక్రమాల్ని నిరోధించేందుకు జాబితాలోని ఓటర్లను వారి ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు ఈసీని కోరాయి. ‘ఓటర్లతో ఆధార్‌ను అనుసంధానించాలని రాజకీయ పార్టీలు ఈసీకి సూచించాయి. 10 పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి’ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్షరక్రమంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తే.. నకిలీల్ని తొలగించేందుకు అవకాశముంటుందని సమావేశంలో బీజేపీ సూచించింది. కాగా ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బ్రేక్ పడింది. 1982లో తొలి ఈవీఎం ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయాలంటూ గతేడాది జూన్‌లో పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఆ సవాలు స్వీకరించాయి. చివరికి ఆ రెండూ కూడా ఈవీఎంల హ్యాకింగ్ సవాలుకు గైర్హాజరయ్యాయి. 1982లో కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంల్ని ఉపయోగించారు. వాటి వాడకంపై అప్పటికి ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈవీఎంల్ని వినియోగించేందుకు వీలుగా 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించినా.. 1998 వరకూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్య రేటు 0.7 శాతంగా ఉంటోంది. -
‘జమిలి’కి చాన్సే లేదు: సీఈసీ రావత్
ఔరంగాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా న్యాయపరమైన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందుకే పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటరు ధ్రువీకరణ పత్రాలు (వీవీపీఏటీ) యంత్రాలు 100% సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల కోసం 17.5 లక్షల వీవీపీఏటీలు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 10 లక్షల యంత్రాలు వచ్చేశాయన్నారు. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. సహజంగానే సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల ముందునుంచే ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని ఈసారి కూడా 2018 ఫిబ్రవరి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
జమిలి ఎన్నికలపై తేల్చేసిన రావత్..
సాక్షి, ముంబై : న్యాయపరమైన ప్రక్రియ చేపట్టకుండా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. గురువారం ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇచ్చారు. జమిలి ఎన్నికలపై బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌కు లేఖ రాయడం, లా కమిషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరణ ప్రాధాన్యత సంతరించకుంది. దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలతో నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దేశమంతటా ఎప్పుడూ ఎన్నికల వాతావరణం నెలకొనే పరిస్థితికి చెక్ పెట్టవచ్చని అమిత్ షా చెబుతున్నారు. జమిలి ఎన్నికలు కేవలం ప్రతిపాదన కాదని, గతంలో విజయవంతంగా ఈ ప్రయోగాన్ని అమలు చేశారని, తిరిగి దీన్ని అమలుపరచవచ్చని లా కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌కు గతవారం అమిత్ షా రాసిన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వీలైతే నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని గతంలో రావత్ పేర్కొన్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం, సాధనా సంపత్తి లేవని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. -
‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్ చివరి నాటికి, వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి. ఈ నెలలోనే జమిలిపై నివేదిక లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్ ఇప్పటికే చెప్పింది. -
ఒకేసారి ఎన్నికలు కష్టం
న్యూఢిల్లీ: ఒకేసారి ఎన్నికల దిశగా కేంద్రం, అధికార బీజేపీ సంకేతాలిస్తున్న నేపథ్యంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదని, అంతేకాకుండా, అందుకు రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనివార్యమని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నలకు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బదులిచ్చారు. ‘ఒకేసారి ఎన్నికలంటే కొన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. మరికొన్ని అసంబ్లీల పదవీకాలాన్ని కుదించాలి. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు ఈవీఎంలు, వీవీప్యాట్లు తదితర సామగ్రిని సమకూర్చుకోవడం అతిపెద్ద అవరోధంగా మారుతుంది. అదనపు పోలీసు సిబ్బంది, పోలింగ్ యంత్రాంగం భారీగా అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు’ అని రావత్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలకు తాము సానుకూలమేనంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వల్ప కాల వ్యవధిలో ఈవీఎంలు, వీవీప్యాట్లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని వివరించారు. ‘ఒకే దేశం..ఒకే ఎన్నిక’కు చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం 2015లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది’ అని తెలిపారు. ‘రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియగానే ఎన్నికలు నిర్వహించే బాధ్యతలను యథా ప్రకారంగా ఎన్నికల సంఘం నిర్వర్తిస్తుంది. ప్రస్తుతానికి 2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు సమకూర్చుకునే పనిలో ఉన్నామ’న్నారు. ‘2019 లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన 13.95 లక్షల ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లు ఈ సెప్టెంబర్ 30 నాటికి అందుబాటులోకి వస్తాయి. అలాగే, 16.15 లక్షల వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి మా వద్దకు వస్తాయి’ అని గతంలో ఒక సందర్భంలో రావత్ వివరించారు. 2019లో ఒకేసారి లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. ఈసీకి 24 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయి. ఒకేసారి ఎన్నికల విషయమై మే 16న లా కమిషన్‌తో జరిపిన చర్చల సందర్భంగా ‘ఒకేసారి ఎన్నికలంటే అదనంగా కొనుగోలు చేయాల్సిన 12 లక్షల ఈవీఎంల కోసం రూ. 4,500 కోట్లు అవసరమవుతాయ’ని ఈసీ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై ఈ ఆగస్ట్ చివరిలోగా లా కమిషన్ నివేదిక రూపొందించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా(2019లో), మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ల్లో( 2019 చివర్లో), బీహార్‌లో 2020లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ సంవత్సరం జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి మొత్తం 11 రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో కేంద్రం, బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే సాధ్యం కాదు లోక్‌సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు స్పందించాయి. ఎన్డీఏ భాగస్వామ్య జేడీయూ పార్టీకి చెందిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ మంచి ఆలోచనే అయినప్పటికీ వచ్చే సాధారణ ఎన్నికల్లో దానిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. లోక్‌సభను రద్దు చేయండి: కాంగ్రెస్ ఏకకాలంలో ఎన్నికలపై అమిత్ షా సానుకూలంగా స్పందించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది. లోక్‌సభను ముందుగానే రద్దు చేసి, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి మోదీకి సవాల్ విసిరింది. ‘ఇందుకు మేం సిద్దం. అలా చేస్తే కాంగ్రెస్ స్వాగతిస్తుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేసి, 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అసాధ్యమని ఆయన తెలిపారు. అమెరికా, రష్యాతోపాటే పెట్టండి: శివసేన బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనపై ఎద్దేవా చేసింది. వారు ‘బీజేపీ)లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఇంకా అమెరికా, రష్యాలతో కలిపి కూడా ఏకకాలంలో ఎన్నికలు పెట్టవచ్చు. బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఒకే జాతి–ఒకే ఎన్నిక విధానం వల్ల దేశానికి ఏం లాభం?’ అని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఖండించిన బీజేపీ చట్టప్రకారం, ఏకాభిప్రాయం మేరకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని అధికార బీజేపీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఖండించింది. -
అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డుల్ని త్వరలో జారీచేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయకర్తలను నియమించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఓటర్కార్డుల్నే కాకుండా ఓటర్ స్లిప్పులను కూడా దివ్యాంగులు వాడుకునేలా రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడంపై బుధవారం నాడిక్కడ జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రావత్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై దివ్యాంగులకు అవగాహన కల్పిచేందుకు త్వరలోనే ఓ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆడియో, వీడియోలతో పాటు సైగ భాషల రూపంలో వీరికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. -
బ్యాలెట్ ప్రశ్నేలేదు
కోల్‌కతా: ఈవీఎంలు, వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రం)ల ద్వారానే అన్ని ఎన్నికలు జరుగుతాయనీ, బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చే ప్రశ్నే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంల పనితీరు, సమగ్రత విషయంలో అనుమానాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగం, చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు అవసరమైన సామగ్రిని భారీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల సంఘం(ఈసీ) మొబైల్ యాప్ ద్వారా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మొబైల్ యాప్‌నకు 780 వరకు ఫిర్యాదులు వీడియోల రూపంలో అందాయి. యాప్ సాయంతో పౌరులూ సాక్ష్యాధారాలను ఈసీకి నేరుగా పంపొచ్చు. అన్ని ఎన్నికల్లో యాప్‌ను వాడకంలోకి తెస్తాం. ‘రికార్డుల్లో మాత్రమే ఉండి, కార్యకలాపాలు జరపని దాదాపు 1000 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేశాం. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పూర్తి పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందుగా ఎలాంటి ప్రకటన చేసే అధికారం ఈసీకి లేదు’ అని రావత్ వివరించారు. -
కర్ణాటకలో ఆ రెండే ఈసీకి తలనొప్పి
బెంగుళూరు : ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో అడ్డంకిగా ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయని, అందులో ఒకటి డబ్బు పంపిణీ, మరోకటి తప్పుడు వార్తాలు అని ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను డబ్బుతో కొనడం, తప్పుడు వార్తలతో వారిని మభ్యపెట్టడం, ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించి కుల, మతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వవహించడం ద్వారా సరైన ఎన్నికల నిర్వహణకు అవి తలనొప్పిగా మారాయని అన్నారు. ఇప్పటికే కర్ణాటకలో రూ. 128 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2013 ఎన్నికల్లో రూ.14 కోట్లుగా ఉన్న అక్రమం విలువ ఇప్పుడు దాదాపు 10 రెట్లు పెరిగిందని అన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎన్నికల విశిష్ట, ప్రతిష్ట కాపాడడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు.