
బెంగుళూరు : ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో అడ్డంకిగా ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయని, అందులో ఒకటి డబ్బు పంపిణీ, మరోకటి తప్పుడు వార్తాలు అని ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను డబ్బుతో కొనడం, తప్పుడు వార్తలతో వారిని మభ్యపెట్టడం, ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించి కుల, మతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వవహించడం ద్వారా సరైన ఎన్నికల నిర్వహణకు అవి తలనొప్పిగా మారాయని అన్నారు. ఇప్పటికే కర్ణాటకలో రూ. 128 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2013 ఎన్నికల్లో రూ.14 కోట్లుగా ఉన్న అక్రమం విలువ ఇప్పుడు దాదాపు 10 రెట్లు పెరిగిందని అన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎన్నికల విశిష్ట, ప్రతిష్ట కాపాడడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు.