Karnataka Assembly Election 2018
-
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వాళ్లు దూరం... ఎందుకు ?
ముంబై/భువనేశ్వర్ : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేవెగౌడ పంపిన ఆహ్వానాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ సున్నితంగా తిరస్కరించారని ఆ పార్టీ ఎంపీ తెలిపారు. పాల్ఘార్ లోక్‌సభ స్థానానికి 28న జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ బిజీగా ఉన్నందునే బెంగళూరు వెళ్లలేకపోయారన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కార్యక్రమానికి హాజరు కాలేదని బీజేడీ పార్టీ తెలిపింది. రాష్ట్రానికే పరిమితమయిన బీజేడీకి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించింది. అయినా, గత 18 ఏళ్లలో జరిగిన ఏ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ సీఎం నవీన్ హాజరు కాలేదని పార్టీ పేర్కొంది. -
మోదీ పిడికిట్లో ఎమ్మెల్యేలు..!
సాక్షి, బెంగళూరు : ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. బలనిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజులు సమయం ఇచ్చారు. కానీ రేపో-ఎల్లుండో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. మెజారిటీ నిరూపించుకుంటామని సీఎం యడ్యూరప్ప అంటున్నారు. బలపరీక్షలో బీజేపీ గెలువడం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా.. బీజేపీకి అంతసీన్ లేదని, యడ్యూరప్ప ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చట అవుతుందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పేర్కొంటున్నారు. తమకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీంతో బలనిరూపణ సందర్భంగా ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరగబోయే బలపరీక్ష చుట్టూ ఆసక్తి నెలకొంది. హెచ్డీ కుమారస్వామి బలపరీక్ష, ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ పిడికిలిలో బందీ అయ్యాడని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ తెలిపారు. విధానసౌధ వద్ద కాంగ్రెస్-జేడీఎస్ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ అయిన ముగ్గురు హైదరాబాద్ కర్ణాటక ఎమ్మెల్యేల్లో ఆనంద్‌సింగ్ ఒకరు. ఆయనతోపాటు నాగేంద్ర, రాజశేఖర పాటిల్ బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష భేటీకి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే బీజేపీకి ఆకర్షితుడయ్యాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయయ్య మాట్లాడుతూ.. మొత్తం 118మంది ఎమ్మెల్యేలు (కాంగ్రెస్-జేడీఎస్ కలుపుకొని) తమ వద్ద ఉన్నారని, తమకు తగినంత మెజారిటీ లేదనే ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలంతా వందశాతం తమ వెంటే ఉన్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం స్వల్పకాలంలోనే కూలిపోతోందని అన్నారు. మెజారిటీ తమకే ఉందని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ మా ఎమ్మెల్యేలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు! ఇక ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో మోదీ ప్రభుత్వ తీరుపై జేడీఎస్ నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని విమర్శించారు. ‘వారు ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీలో నాకు వ్యతిరేకంగా కేసు ఉంది. ఆ కేసును తిరగదోడి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. క్షమించండి.. నా ప్రయోజనాలు నేను కాపాడుకోవాలి’అని ఆనంద్ సింగ్ చెప్పినట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకు చెప్పారు. ఇదీ బీజేపీ నేతల తీరు’ అని కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ బీజేపీ గూటికి చేరినట్టు భావిస్తున్నారు. -
కర్ణాటకలో పొలిటికల్ హైటెన్షన్
-
కర్ణాటక గవర్నర్‌పై సుప్రీంకు రాంజెఠ్మలానీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక వ్యవహారంలో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పేరొందిన న్యాయకోవిదుడైన సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు తాజాగా ముందుకొచ్చారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ ఆ పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. అయితే, గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకునే వరకు కర్ణాటక ప్రభుత్వం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాం జెఠ్మలానీ సైతం గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆప్‌కు ఆశాభంగం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కి అన్ని రాష్ట్రాల్లో నిరాశే మిగిలుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పోటీ చేసిన 29 స్థానాల్లో ఆప్ ఆభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. తమ పార్టీకి కన్నడ ప్రజల్లో మంచి ఆదరణ లభించిదని, దానిని ఓటింగ్‌గా మార్చుకోవడంలో తమ అభ్యర్ధులు విఫలమయ్యరని కర్ణాటక ఆప్ కన్వీనర్ పృథ్వీరెడ్డి తెలిపారు. శ్రావన్‌నగర్ నుంచి పోటీ చేసిన పృథ్వీ కేవలం 1861 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. శాంతి నగర్ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి రేణుక విశ్వనాథన్ ఒక్కరే నోటాకి పడిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు సాధించిన ఓటింగ్ శాతం కేవలం 0.2 మాత్రమే. 2017 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో ఆప్ విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆప్ పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసింది. ముఖ్యంగా పంజాబ్‌లో పాగా వేయాలనుకున్న అరవింద్ కేజ్రివాల్‌కి పంజాబ్ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలనుకున్న ఆప్ కేవలం 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తరువాత జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలను సాధించలేకపోయింది. గోవా, నాగాలాండ్, మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క రాష్ట్రంలో కూడా ఖాతా తెరవలేకపోయింది. -
కర్ణాటకంలో ‘నోటుకు ఓటు’ దాసోహం
సాక్షి, న్యూఢిల్లీ : వాడిగా, ‘వేడి’గా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంతిమ అంకం ప్రారంభమైంది. చల్లగా నోట్లు చేతులు మారుతున్నాయి. ఓట్లు కొనేవారికి, అమ్మేవారికి మధ్య అనూహ్య ఆత్మీయ బంధం అలుముకుంటోంది. ‘జన్‌ధన్’ ఖాతా కలిగిన ప్రతి ఓటరు అకౌంట్లోకి వెయ్యి రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజున అంటే, మే 15వ తేదీన మరో వెయ్యి రూపాయలు ఆ ఖాతాలకు వచ్చి చేరుతాయట. ఈ లెక్కన కర్ణాటకలో ఓటుకు రెండు వేల రూపాయలు పలుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల కమిషన్ కనుగప్పి ఓట్ల వ్యాపారం బాగానే కొనసాగుతోంది. నేడు ఒక రాష్ట్రమంటూ కాకుండా ‘ఓటుకు నోటు’ సంప్రదాయం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అది పార్లమెంట్ ఎన్నికలయినా, అసెంబ్లీ ఎన్నికలయినా సంప్రదాయం కొనసాగాల్సిందే. 2008లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లను కొనుక్కునే సంప్రదాయం మొదటిసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. నోటు తీసుకొని ఓటు వేసిన వారి సంఖ్య 2008లో ఏడు శాతం ఉంటే అది 2014 ఎన్నికల నాటికి 15 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు వారి శాతం మరింత పెరిగే ఉంటుంది. దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ ప్రభావంగానే ఈ నోటుకు ఓటు సంస్కతి కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల్లో, ఓటర్లలో నైతికతను పెంచడం వల్ల ఈ దుస్సంప్రదాయాన్ని శాశ్వతంగా అరికట్టవచ్చని ఎవరైనా భావించవచ్చు. ఆ నైతికత ఎలా రావాలన్నది కూడా ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగం, పేదరికం..... దేశంలోని నిరుద్యోగం, పేదరికం, నైపుణ్య, అనైపుణ్య రంగాల్లో కనీస వేతనాలు ఎంత? కనీస వేతనాలపై బతికే కార్మిక లోకమెంత? మధ్యతరగతి వారు ఎంత? తదితర అంశాలపై ఆధారపడి ఓటుకు నోటు సంప్రదాయం కొనసాగుతుంది. సాధారణంగా ధనిక రాష్ట్రాలకన్నా పేద రాష్ట్రాల్లో ఓటుకు రేటు ఎక్కువ పలుకుతుంది. ‘నువ్వా, నేనా’ అన్నట్లు పోటీ ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భాల్లో కూడా రేటు పెరుగుతుంది. కర్ణాటకలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు మూడు వందల రూపాయలు పలగ్గా ఇప్పుడది రెండువేల రూపాయలకు చేరుకుంది. కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా, ఉత్కంఠంగా మారడమే. గత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం కర్ణాటకలో కనీస వేతనం 12,270 రూపాయలు. ఆ మొత్తంలో ఒక్క రోజు ఓటు వేస్తే 17 శాతం డబ్బులు ముడుతాయి. కర్ణాటకలో నిరుద్యోగం 2.6 శాతమే ఉన్నప్పటికీ రోజు కూలీ దొరకుతుందన్న గ్యారెంటీలేని జీవితాలు ఎన్నో. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా రోజుకు 236 రూపాయలే దొరకుతాయి. అది కూడా వందరోజులు మాత్రమే గ్యారంటీ. అలాంటి పరిస్థితుల్లో నోట్ల ప్రలోభానికి కాదు, నోట్ల ఒత్తిడికి ఎంత మందో గురవుతారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారుతుంటోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో గుండు గుత్తాగా 150 ఓట్లకు లక్ష రూపాయలు పలికింది. అంటే ఒక్కో ఓటుకు 666.66 రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని ఆ ఎన్నికల్లో సీతాపూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షెవాలీ మిశ్రా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలికిన మూడు వందల రూపాయలతో పోలిస్తే 666 రూపాయలు రెండింతలకన్నా ఎక్కువ. యూపీలో ఇప్పుడు కనీస వేతనం నెలకు 7,613 రూపాయలే. అంటే, కర్ణాటకకంటే 4,657 రూపాయలు తక్కువ. యూపీలో నిరుద్యోగం శాతం కూడా 5.5. కర్ణాటకకన్నా 2.9 శాతం ఎక్కువ. పంజాబ్‌లో 2009లో ఓటు రేటు ప్రత్యక్ష సాక్షిగా మాజీ జర్నలిస్ట్ మన్‌ప్రీత్ రంధావ రాసిని వ్యాసం కూడా ఇక్కడ గమనార్హమే. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్, బటిండా నియోజకవర్గంలోని మన్సా పోలింగ్ కేంద్రానికి ఆయన ఓటు వేయడానికి వెళ్లారు. ఆయన వద్దకు ఓ అకాలీదళ్ కార్యకర్త వచ్చి ఓటువేస్తే ‘యూ విల్బీ పెయిడ్’ అని చెప్పారట. అప్పుడు అకాలీదళ్ తరఫున హరిసిమ్రాట్ కౌర్ బాదల్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున రణిందర్ సింగ్ పోటీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కుమారుడే రణిందర్ సింగ్. ఓటు వేసిన తర్వాత అకాలీదళ్ కార్యకర్త చెప్పిన ఓ అతిపెద్ద భవనం వద్దకు వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు, ఓటువేసినట్లు సిరా మరక చూపి ఓటర్లు డబ్బులు తీసుకోవాలట. అక్కడ మనిషికి 200 రూపాయలు ఇచ్చారట. ఆ విషయాన్ని ఆయన అప్పుడు పనిచేస్తున్న ‘హిందుస్థాన్ టైమ్స్’లో రాసినా అధికారులెవరూ ఆ భవనంపై దాడి చేయలేదట. ఎలాంటి చర్యా తీసుకోలేదట. ఆమ్ ఆద్మీ పోరాటం అవినీతికి వ్యతిరేకంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటుకు నోటు సంప్రదాయంపై పరోక్ష యుద్ధం చేసింది. ‘ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ కేజ్రివాల్ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటువేసే వారు అవినీతి పరులని అలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోవడం అవినీతి కిందకు రాదని, పైగా వారికి బుద్ధి చెప్పిట్లు అతుందన్నది అప్పుడు ఆయన వాదన. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పిలుపు ఏ మేరకు ప్రభావం చూపించిందోగానీ, 2015 ఎన్నికల్లో అద్భుత ప్రభావాన్ని చూపించింది. 70 అసెంబ్లీ సీట్లకుగాను ఆయన పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అనుసరించి బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కొన్ని పార్టీలు గురద్వార్లకు, ఆలయాలకు ఓటర్లను తీసుకెళ్లి అక్కడే డబ్బులు పంచి ఒట్టు వేయించుకున్నారు. గుళ్లూ గోపురాల వద్దకు రావడానికి ఇష్టపడని ఓటర్ల వద్దకు నాయకులే వెళ్లి పవిత్ర గ్రంధాల మీద, దేవుళ్ల పటాలపై ఒట్లు వేయించుకున్నారు. ఓటుకు నోటు ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కువ వరకు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు, మధ్యతరగతిలో ఓ మోస్తారు మంది ఓటుకు నోటు ఒత్తిడికి గురవుతున్నారు. ‘ఇక మా జీవితాలు ఇంతే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మా బతుకులు మారవు. మా కూడుకు మేము కష్టపడాల్సిందే’ అన్న నిర్లిప్తత పెరిగిన పేదలు, ‘ ఏ రాజకీయ పార్టీ, ఎవరొచ్చినా పెద్దగా మారేదేముందీ! ఎలాగైనా మన బతుకుల్ని మనం బాగుచేసుకోవచ్చు. మనకుండే నెట్వర్క్ మనకు ఉండనే ఉంటుంది’ అని భావించే మధ్యతరగతి మనుషులు ‘నోటకు ఓటు’ వేస్తున్నారు. -
కర్ణాటకలో చివరి రోజు హోరెత్తిన ప్రచారం
-
24 కోట్ల విలువైన మద్యం పట్టివేత
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం భారీగా పట్టుబడుతొంది. మంగళవారం ఒక్క రోజే దాదాపు రూ.24 కోట్ల విలువైన మద్యాన్ని ఐటీ, పోలీసు శాఖలు సీజ్ చేశాయి. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో గెలవడానకి అభ్యర్థులు, పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యం భారీగా పంచుతున్నారు. డబ్బు, మద్యమే కాకుండా బంగారం, వెండి కూడా పోలీసుల దాడిలో పట్టుబడింది. దాదాపు 43 కోట్ల విలువైన బంగారం, వెండిని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 77 కోట్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, బంగారం, వెండి భారీగా లభిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 166 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం, వెండిని సీజ్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాగన్న గెలవాలని పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతున్నాయి. -
కర్ణాటక బరిలో నేరస్థులు, కోటీశ్వరులు..!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,560 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం అంటే, 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారు ఉన్నారని, పది శాతం మందిలో అంటే, 254 మందిపై మరీ తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారిలో నలుగురిపై హత్య కేసులు, 25 మందిపై హత్యాయత్నం కేసులు, 23 మందిపై మహిళలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం 224 మంది పోటీ చేస్తుండగా, వారిలో 26 శాతం, అంటే 58 మంది క్రిమినల్ కేసులున్నవారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున 220 మంది పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం మంది అంటే, 32 మంది క్రిమినల్ కేసులున్నవారు ఉన్నారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 15 శాతం లేదా 29 మంది క్రిమినల్ కేసులున్న వారే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో ఒక్కరే ఒకరిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. 1,090 మంది స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 70 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు లాంటివి తీవ్రమైన క్రిమినల్ కేసులు. ఎక్కువ క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పోటీ పడుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలను ‘రెడ్ అలర్ట్’ నియోజకవర్గాలుగా ఏడీఆర్ సంస్థ గుర్తించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 35 శాతం మంది కరోడ్‌పతులు. వారిలో కాంగ్రెస్ పార్టీ తరఫున 94 శాతం మంది, బీజేపీ తరఫున 93 శాతం మంది పోటీ చేస్తుండగా, జేడీఎస్ తరఫున 77 శాతం మంది పోటీ చేస్తున్నారు. జేడీయూ తరఫున 52 శాతం, ఆప్ తరఫున 33 శాతం మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సరాసరి సగటు ఆస్తులు 38 కోట్ల రూపాయలు కాగా, బీజేపీ అభ్యర్థి సగటు ఆస్తులు 17.86 కోట్ల రూపాయలు. -
యడ్డీ గద్దెనెక్కేనా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే.. కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి అని ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నా కూడా అనుమానాలు తొలగడం లేదు. దీనివెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మార్చి 27న అమిత్‌షా చేసిన పలు వ్యాఖ్యలు, బీజేపీ అభ్యర్థుల జాబితాలో యడ్యూరప్ప కుమారుడికి, పలువురు సన్నిహితులకు అవకాశం దక్కకపోవడం, పార్టీలో ప్రత్యర్థులైన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులిద్దరికీ అవకాశం దక్కడం వంటి పరిణామాలు యడ్డీకి పదవిపై అనుమానాలకు బలమిస్తున్నాయి. 75 ఏళ్లు దాటాయి.. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించాలనే దిశగా మోదీ, అమిత్‌షా చర్యలు చేపట్టారు. అందులోభాగంగానే అగ్రనేతలు ఎల్.కే.అడ్వాణీ, ఎం.ఎం.జోషీ తదితరులకు కేంద్రంలో పదవులు ఇవ్వలేదు. గుజరాత్ బీజేపీ సీఎం ఆనందీబెన్ పటేల్‌ను 75 ఏళ్లు నిండిన వెంటనే రాజీనామా చేయించి, గవర్నర్‌గా పంపారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 75వ పుట్టినరోజు జరుపుకొన్న యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ప్రకటించడం విరుద్ధంగా కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ గెలిచి సీఎం పదవి ఇచ్చినా.. కొన్నాళ్లకే తనను పక్కనపెట్టవచ్చనే భయం యడ్యూరప్పకు కూడా పట్టుకుందని అంటున్నారు. నోరుజారిన అమిత్‌షా మార్చి ఆఖరులో కర్ణాటకలోని దావనగెరెలో జరిగిన బహిరంగసభలో అమిత్‌షా కాంగ్రెస్ సిద్దరామయ్య సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. కానీ పొరపాటున తమ అభ్యర్థి పేరు పలికారు. ‘అత్యంత అవినీతికర ప్రభుత్వాల మధ్య పోటీ పెడితే.. యడ్యూరప్ప సర్కారు నంబర్ వన్ అవుతుంది’అన్నారు. పక్కనే ఉన్న మరో బీజేపీ నేత ఈ పొరపాటును చెప్పగానే.. సిద్దరామయ్య ప్రభుత్వమంటూ తప్పు దిద్దుకున్నారు. ఇదేకాదు వరుసగా రెండు మూడుసార్లు బీజేపీ నేతలు ఇలా నోరు జారడం గమనార్హం. ‘గాలి’ సోదరులతో తంటాలు.. యడ్యూరప్ప సీఎంగా ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యర్థులుగా మారిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు, వారి ఆత్మీయుడు బి.శ్రీరాములు, ఆయన మేనల్లుడు సురేశ్‌బాబుకు అసెంబ్లీ టికెట్లు అందాయి. కానీ యడ్యూరప్ప చిన్న కొడుకు విజయేంద్రకు టికెట్ ఇవ్వకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలను తప్పుపడుతున్న నేపథ్యంలో.. యడ్యూరప్ప కుమారుడికి టికెట్ ఇవ్వలేకపోయామని కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి పి.మురళీధర్‌రావు సమర్థించుకుంటున్నారు. కానీ తనకు ప్రత్యర్థులుగా మారిన గాలి సోదరులకు టికెట్లు ఇప్పించింది అమిత్‌షాయేనని యడ్యూరప్ప బాహాటంగానే విమర్శలు చేసి, తన అసమ్మతిని పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో బీజేపీ విజయం సాధించాక.. తనకు సీఎం పదవి దక్కుతుందో, లేదోనని యడ్యూరప్ప తనతో సాన్నిహిత్యమున్న ఓ కన్నడ కేంద్ర మంత్రి వద్ద వ్యాఖ్యానించారని కూడా ప్రచారం జరుగుతోంది. వేదిక పంచుకోని మోదీ.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొంటున్న సభల్లో ఎక్కడా యడ్యూరప్ప కనిపించకపోవడంతోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి, ముఖ్యంగా యడ్యూరప్పకు రాజకీయ శత్రువైన మాజీ ప్రధాని దేవెగౌడపై ఇటీవలి సభలో మోదీ ప్రశంసల వర్షం కురిపించడం కూడా యడ్యూరప్పను నొచ్చుకునేలా చేసింది. ఇక యడ్యూరప్పకు అత్యంత విధేయురాలైన మాజీ మంత్రి, ఉడుపి–చికమగళూరు ఎంపీ శోభా కరంద్లాజేకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమూ ఆయనకు బాధ కలిగించిందని చెబుతున్నారు. అయితే బీజేపీకి కంచుకోటగా ఉన్న లింగాయతులకు ప్రత్యేక మత హోదా సిఫార్సుతో సిద్దరామయ్య తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లింగాయతుల ఓట్లు చెదిరిపోకుండా.. అదే వర్గానికి చెందిన యడ్యూరప్పను బీజేపీ నేతలు సీఎం అభ్యర్థిగా పదేపదే చెబుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే యడ్యూరప్ప మనసులో ఎన్ని అనుమానాలు, అసంతృప్తులు ఉన్నా.. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే ఆయనకే ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం ఒక ఎత్తయితే, యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసి దీర్ఘకాలం పదవిలో కొనసాగడం అంతే ఎత్తని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కర్ణాటకలో ఆ రెండే ఈసీకి తలనొప్పి
బెంగుళూరు : ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో అడ్డంకిగా ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయని, అందులో ఒకటి డబ్బు పంపిణీ, మరోకటి తప్పుడు వార్తాలు అని ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను డబ్బుతో కొనడం, తప్పుడు వార్తలతో వారిని మభ్యపెట్టడం, ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించి కుల, మతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వవహించడం ద్వారా సరైన ఎన్నికల నిర్వహణకు అవి తలనొప్పిగా మారాయని అన్నారు. ఇప్పటికే కర్ణాటకలో రూ. 128 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2013 ఎన్నికల్లో రూ.14 కోట్లుగా ఉన్న అక్రమం విలువ ఇప్పుడు దాదాపు 10 రెట్లు పెరిగిందని అన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎన్నికల విశిష్ట, ప్రతిష్ట కాపాడడానికి ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. -
‘కింగ్‌మేకర్ కాదు.. కింగ్ అవుతా’
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో తాను కింగ్‌మేకర్ కానని ప్రజలు ఆశీర్వదిస్తే కింగ్ అవుతానని జేడీ(ఎస్) అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. మే 12న రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని వివిధ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఓ వార్త ఛానల్‌తో ముచ్చటించిన కుమారస్వామి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవుతుందని వస్తున్న కామెంట్స్‌పై కుమారస్వామి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకముందని, 113 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 97-105 సీట్లు సునాయసంగా సాధించగలమని, మిగిలిన సీట్ల కోసం శాయశక్తుల కష్టపడుతున్నామని పేర్కొన్నారు. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలకు మద్దతిస్తారా అన్న ప్రశ్నకు... హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని, జేడీ(ఎస్) మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పొయారని, జేడీఎస్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు నమ్మకమైన పరిపాలన కోసం, సమస్యల పరిష్కారం కోసం తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘ గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్నాం. ప్రస్తుత ఎన్నికలు తమ పార్టీకి ఎంతో కీలకమైనవి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించాయి. సొంత ప్రయోజనాల కోసం తాము అధికారంలోకి రావాలనుకోవడం లేదు, కన్నడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అధికారంలోకి రావాలని భావిస్తున్నాం.’ అని అన్నారు. -
224 స్థానాలు.. 225 మేనిఫెస్టోలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జేడీఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్న పార్టీలు.. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవఙ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ.. 224 నియోజక వర్గాలు.. 225 మేనిఫెస్టోలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. అదే స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రాష్ట్రమంతటికీ ఒకటి, ఒక్కో నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి వామన్ ఆచార్య తెలిపారు. ఇందుకోసం 500 మంది నిపుణుల అభిప్రాయం స్వీకరించినట్లు సమాచారం. సుమారు 3 లక్షల మందిపై ఆఫ్‌లైన్, ఆన్లైన్లో సర్వే నిర్వహించామని పార్టీ నేత డాక్టర్ అశ్వథ్‌నారాయణ్ తెలిపారు. జిల్లా స్థాయి నాయకులు తమ తమ నియోజక వర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళూరులో రాహుల్ గాంధీ.. మంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తున్నమంగళూరులో ఎటువంటి హామీలతో రాహుల్ ఓటర్లను ఆకర్షిస్తారో చూడాల్సిందే. శ్యామ్ పిట్రోడా, పృథ్వీరాజ్ చౌహాన్, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఈ నెల 28 తర్వాత రాష్ట్రమంతటికీ కలిపి ఒకటి, బెంగళూరు, బెలగామ్, గుల్బర్గా, మైసూర్ ప్రాంతాలకు ఒకటి చొప్పున మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారు. 2013 ఎన్నికల్లో చేసిన 165 వాగ్దానాలే తమ విజయానికి కారణమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కూడా అదే పంథాను అనుసరించేందుకు సిద్ధమైంది. బెంగళూరు సిటీ కోసం ప్రత్యేకంగా సీనియర్ నేత వీరప్ప మొయిలీ నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. అభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయ రంగంలో మార్పులు ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని మొయిలీ తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జేడీఎస్.. జేడీఎస్ కూడా వారం రోజుల్లోగా తమ ప్రణాళికను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్య నేతృత్వంలో రూపొందనున్న మేనిఫెస్టోలో.. వ్యవసాయం, పరిశ్రమలు, నీటి వనరులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. -
కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం
-
సీఎం సన్నిహితుడిపై ఐటీ దాడులు.. కలకలం
బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడుల వ్యవహారం తీవ్రకలకలానికి దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అనుంగుడు, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి మహదేవప్పకు చెందిన ఇళ్లపై సోమవారం ఐటీ అధికారులు దాడులు చేసిందని, బెంగళూరు, మైసూరుల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయని, పెద్దమొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సీఎం సిద్ధరామయ్య (బాదామి స్థానం నుంచి) నామినేషన్ దాఖలు చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఈ వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ.. కేంద్ర సంస్థలను రంగంలోకి దింపి, కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీ శాఖ వివరణ: కాగా, సోమవారం కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం నిజమే అయినా, మంత్రి మహదేవప్ప ఇంట్లో సోదాలు మాత్రం నిజంకాదని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. ‘‘అక్రమ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి నలుగురైదుగురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించాం. ఆ జాబితాలో మహదేవప్ప లేనేలేరు. ‘మంత్రి ఇట్లో ఐటీ దాడులు’ జరిగాయంటూ ప్రచారంలో ఉన్నవన్నీ తప్పుడు వార్తలే. వాటిని నమ్మొద్దు’’ అని ఐటీ అధికారులు మీడియాకు వివరించారు. -
రసకందాయంలో కర్ణాటక ఎన్నికలు...!
కన్నడ నాట ఎన్నికలు రసకందాయంలో పడుతున్నాయి. మంగళవారంతో నామినేషన్ల దాఖలు ముగియనున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చాముండేశ్వరీ స్థానంలో గట్టిపోటీ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రెండోచోట బాదామి నుంచి పోటీకి కూడా సిద్ధమవుతున్నారు, పార్టీ ఆదేశిస్తే అక్కడి నుంచే సిద్ధరామయ్యపై పోటీకి తాను సిద్ధమంటూ బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కూడా ప్రకటించేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ తుది జాబితాలో కూడా చోటుదక్కని సిట్టింగ్‌లు, ఇతర ఆశావాహులు ఇతరపార్టీల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్ నిరాకరణతో రెండోసారి ఎమ్మెల్యే కావాలన్న కల నెరవేర్చుకునేందుకు పలువురు పక్కచూపులు చూస్తున్నారు. వారిని బీజేపీ, జేడీ(ఎస్) కూడా రెండుచేతులా సాదరంగా ఆహ్వానించేస్తున్నాయి. ఇదిలా ఉంటే నెలక్రితమే కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఏడుగురు జేడీ(ఎస్) తిరుగుబాటు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ‘గెలుపు గుర్రాల’ కోసం వేచిచూస్తున్న జేడీ(ఎస్),బీజేపీ పలుస్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ ఎన్నికలో కింగ్‌మేకర్‌గా మారాలనుకుంటున్న జేడీ(ఎస్) ఇప్పటికే 11 మంది అసంతృప్తులను చేర్చుకుంది. ఈ విధంగా వచ్చిన పావగడ ఎమ్మెల్యే జీవీ బలరాంకు యెడ్యూరప్ప టికెట్ ఖరారు చేయడంతో పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఫిరాయింపులు, టికెట్ల నిరాకరణల నేపథ్యంలో కాంగ్రెస్,బీజేపీ కేడర్ ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే దీనిని ఏమాత్రం పట్టించుకోని యెడ్యూరప్ప ‘గెలిచే అవకాశాలున్న ఇతర పార్టీల వారికి’ తమ ఆహ్వానమంటూ ప్రకటించేశారు. ప్రధాన పార్టీలు టికెట్టు నిరాకరించినా ఇండిపెండెంట్లుగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నవారూ ఉన్నారు. ఇప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే (2008లో బీజే పీకి మెజారిటీ కొరవడినపుడు ఆపార్టీలో చేరిన ఆరుగురు స్వతంత్రులకు మంత్రి పదవులు దక్కాయి) కీలకపాత్ర పోషించవచ్చునని వారు ఆశిస్తున్నారు. మరో రెండురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుండగా 380 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. త్రిముఖ పోటీ ? ఈ నెల 24వ తేదీతో అభ్యర్థుల నామినేషన్ల గడువు, 27న ఉపసంహరణల పర్వం ముగియనుంది. అప్పుడే ఆయా నియోజకవర్గాల్లో పోటిపడే ప్రధానపార్టీల అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత రానుంది. ఇప్పటికైతే చాలా నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్–బీజేపీ–జేడీ(ఎస్) ల మధ్య త్రిముఖ పోరు తప్పదనే ఊహాగానాలు సాగుతున్నాయి. కులం,మతం,ప్రాంతీయ, రాజకీయ తదితర సమీకరణల ఆధారంగా ఓటర్ల మొగ్గు ఎవరివైపు ఉంటుందనేది తేలనుంది. అందువల్లే అభ్యర్థుల ఎంపిక, ఆయా అంశాల ప్రాతిపదికన ప్రచారవ్యూహం, పోలింగ్‌బూత్‌ల మేనేజ్మెంట్ కీలకంగా మారునున్నాయి. బీజేపీ–జేడీ(ఎస్)ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న సిద్ధరామయ్య ఆరోపణలను, బీజేపీ–బీ టీమ్‌గా జేడీ(ఎస్) మారిపోయిందన్న రాహుల్‌గాంధీ విమర్శలను ఈ పార్టీలు కొట్టిపాడేస్తున్నాయి. తమ బలం అంతగా లేని చోట్ల జేడీ(ఎస్)కు మేలు చేకూర్చేలా బీజేపీ బలహీనమైన అభ్యర్థులను పెట్టొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా కాంగ్రెస్‌పార్టీ పట్ల జేడీ(ఎస్) ఆగ్రహంతో ఉంది. దీనిని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉంది. తేల్చనున్న కులాలు, మతాల సమీకరణలు... కర్ణాటకలోని 6.5 కోట్ల జనాభాలో 60 శాతానికిపైగా మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కావడంతో తమ సంక్షేమపథకాలు, కన్నడ సెంటిమెంట్, ప్రత్యేకమతంగా లింగాయత్ గుర్తింపు ప్రయత్నాలు తమను గెలుపు తీరాన్ని చేరుస్తాయనే ఆశాభావంతో సిద్ధరామయ్య ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తమ విజయానికి ఆయువుపట్టుగా మారుతుందని బీజేపీ, జేడీ(ఎస్)లు ఆశిస్తున్నాయి. మొత్తం 224 సీట్లలో 173 జనరల్ కేటగిరివి ఉంటే ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 సీట్లు రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా సమీకరణలు ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపు తేల్చనున్నాయి.. దాదాపు 19 శాతమున్న లింగాయత్‌లు వంద వరకు స్థానాల్లో, 17శాతం వరకున్న ఎస్సీలు 40 సీట్లకు పైగా, 14 శాతం వరకున్న వొక్కళిగలు 40–50 చోట్ల, పధ్నాలుగున్నర శాతమున్న ముస్లింలు, క్రిస్టియన్లు 30–40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చుననేది పార్టీల అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బీజేపీ,కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు