బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో తాను కింగ్‌మేకర్ కానని ప్రజలు ఆశీర్వదిస్తే కింగ్ అవుతానని జేడీ(ఎస్) అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. మే 12న రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని వివిధ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఓ వార్త ఛానల్‌తో ముచ్చటించిన కుమారస్వామి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవుతుందని వస్తున్న కామెంట్స్‌పై కుమారస్వామి స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకముందని, 113 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 97-105 సీట్లు సునాయసంగా సాధించగలమని, మిగిలిన సీట్ల కోసం శాయశక్తుల కష్టపడుతున్నామని పేర్కొన్నారు. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలకు మద్దతిస్తారా అన్న ప్రశ్నకు... హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని, జేడీ(ఎస్) మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పొయారని, జేడీఎస్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
రాష్ట్ర ప్రజలకు నమ్మకమైన పరిపాలన కోసం, సమస్యల పరిష్కారం కోసం తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘ గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్నాం. ప్రస్తుత ఎన్నికలు తమ పార్టీకి ఎంతో కీలకమైనవి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించాయి. సొంత ప్రయోజనాల కోసం తాము అధికారంలోకి రావాలనుకోవడం లేదు, కన్నడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అధికారంలోకి రావాలని భావిస్తున్నాం.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment