కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే.. కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి అని ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నా కూడా అనుమానాలు తొలగడం లేదు. దీనివెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మార్చి 27న అమిత్‌షా చేసిన పలు వ్యాఖ్యలు, బీజేపీ అభ్యర్థుల జాబితాలో యడ్యూరప్ప కుమారుడికి, పలువురు సన్నిహితులకు అవకాశం దక్కకపోవడం, పార్టీలో ప్రత్యర్థులైన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులిద్దరికీ అవకాశం దక్కడం వంటి పరిణామాలు యడ్డీకి పదవిపై అనుమానాలకు బలమిస్తున్నాయి.
75 ఏళ్లు దాటాయి..
బీజేపీలో 75 ఏళ్లు దాటినవారిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించాలనే దిశగా మోదీ, అమిత్‌షా చర్యలు చేపట్టారు. అందులోభాగంగానే అగ్రనేతలు ఎల్.కే.అడ్వాణీ, ఎం.ఎం.జోషీ తదితరులకు కేంద్రంలో పదవులు ఇవ్వలేదు. గుజరాత్ బీజేపీ సీఎం ఆనందీబెన్ పటేల్‌ను 75 ఏళ్లు నిండిన వెంటనే రాజీనామా చేయించి, గవర్నర్‌గా పంపారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 75వ పుట్టినరోజు జరుపుకొన్న యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ప్రకటించడం విరుద్ధంగా కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ గెలిచి సీఎం పదవి ఇచ్చినా.. కొన్నాళ్లకే తనను పక్కనపెట్టవచ్చనే భయం యడ్యూరప్పకు కూడా పట్టుకుందని అంటున్నారు.
నోరుజారిన అమిత్‌షా
మార్చి ఆఖరులో కర్ణాటకలోని దావనగెరెలో జరిగిన బహిరంగసభలో అమిత్‌షా కాంగ్రెస్ సిద్దరామయ్య సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. కానీ పొరపాటున తమ అభ్యర్థి పేరు పలికారు. ‘అత్యంత అవినీతికర ప్రభుత్వాల మధ్య పోటీ పెడితే.. యడ్యూరప్ప సర్కారు నంబర్ వన్ అవుతుంది’అన్నారు. పక్కనే ఉన్న మరో బీజేపీ నేత ఈ పొరపాటును చెప్పగానే.. సిద్దరామయ్య ప్రభుత్వమంటూ తప్పు దిద్దుకున్నారు. ఇదేకాదు వరుసగా రెండు మూడుసార్లు బీజేపీ నేతలు ఇలా నోరు జారడం గమనార్హం.
‘గాలి’ సోదరులతో తంటాలు..
యడ్యూరప్ప సీఎంగా ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యర్థులుగా మారిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు, వారి ఆత్మీయుడు బి.శ్రీరాములు, ఆయన మేనల్లుడు సురేశ్‌బాబుకు అసెంబ్లీ టికెట్లు అందాయి. కానీ యడ్యూరప్ప చిన్న కొడుకు విజయేంద్రకు టికెట్ ఇవ్వకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలను తప్పుపడుతున్న నేపథ్యంలో.. యడ్యూరప్ప కుమారుడికి టికెట్ ఇవ్వలేకపోయామని కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు సమర్థించుకుంటున్నారు. కానీ తనకు ప్రత్యర్థులుగా మారిన గాలి సోదరులకు టికెట్లు ఇప్పించింది అమిత్‌షాయేనని యడ్యూరప్ప బాహాటంగానే విమర్శలు చేసి, తన అసమ్మతిని పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో బీజేపీ విజయం సాధించాక.. తనకు సీఎం పదవి దక్కుతుందో, లేదోనని యడ్యూరప్ప తనతో సాన్నిహిత్యమున్న ఓ కన్నడ కేంద్ర మంత్రి వద్ద వ్యాఖ్యానించారని కూడా ప్రచారం జరుగుతోంది.
వేదిక పంచుకోని మోదీ..
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొంటున్న సభల్లో ఎక్కడా యడ్యూరప్ప కనిపించకపోవడంతోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి, ముఖ్యంగా యడ్యూరప్పకు రాజకీయ శత్రువైన మాజీ ప్రధాని దేవెగౌడపై ఇటీవలి సభలో మోదీ ప్రశంసల వర్షం కురిపించడం కూడా యడ్యూరప్పను నొచ్చుకునేలా చేసింది. ఇక యడ్యూరప్పకు అత్యంత విధేయురాలైన మాజీ మంత్రి, ఉడుపి–చికమగళూరు ఎంపీ శోభా కరంద్లాజేకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమూ ఆయనకు బాధ కలిగించిందని చెబుతున్నారు. అయితే బీజేపీకి కంచుకోటగా ఉన్న లింగాయతులకు ప్రత్యేక మత హోదా సిఫార్సుతో సిద్దరామయ్య తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లింగాయతుల ఓట్లు చెదిరిపోకుండా.. అదే వర్గానికి చెందిన యడ్యూరప్పను బీజేపీ నేతలు సీఎం అభ్యర్థిగా పదేపదే చెబుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే యడ్యూరప్ప మనసులో ఎన్ని అనుమానాలు, అసంతృప్తులు ఉన్నా.. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే ఆయనకే ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం ఒక ఎత్తయితే, యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసి దీర్ఘకాలం పదవిలో కొనసాగడం అంతే ఎత్తని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment