బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.
దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.
తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.
కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment