బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత సమస్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కర్ణాటక బీజేపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి బసంగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్ అని సమాచారం. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. పాటిల్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఇంటి పోరు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మూడు స్థానాల్లో శిగ్గావ్, సండూరు, చెన్నపట్నలలో హస్తం పార్టీ నేతలు గెలుపొందారు. మూడు చోట్లా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో కొత్త వార్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment