Patil
-
కర్ణాటక బీజేపీలో పొలిటికల్ ట్విస్ట్.. టార్గెట్ యడియూరప్ప!
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత సమస్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.కర్ణాటక బీజేపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి బసంగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్ అని సమాచారం. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పాటిల్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఇంటి పోరు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మూడు స్థానాల్లో శిగ్గావ్, సండూరు, చెన్నపట్నలలో హస్తం పార్టీ నేతలు గెలుపొందారు. మూడు చోట్లా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో కొత్త వార్ నడుస్తోంది. -
డయాఫ్రమ్ వాల్‌కు మళ్లీ నిధులు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి మళ్లీ నిధులు ఇవ్వాలని కోరారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. పునరావాసం.. పరిహారం తదితర అంశాలపైనా చర్చించారు.రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతరత్రా అంశాలపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీతోపాటు 2020 వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వ తప్పిదమే అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు జలశక్తి మంత్రితో భేటీ అయ్యారన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చ జరిగిందని, నిర్మాణ బాధ్యతను 2022లో ముందుకొచ్చిన ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. స్పిల్‌వేకు రక్షణగాఉండే గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని చెప్పారు. సీడబ్ల్యూసీ డిజైన్ల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నేడు ప్రధానితో బాబు భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా లతోనూ భేటీ కానున్నారు. -
‘పోలవరం’ వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ సర్కారు చేసిన ఖర్చు విషయంలో సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం బోగస్ అని తేలిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గురువారం పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. గత మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యయం తెలియజేయాల్సిందిగా టీడీపీ ఎంపీలు కృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. గత మూడేళ్లలో (2020–21, 2022–23, 2023–24) సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై రూ.8,044.31 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి చెప్పారు. ఇందులో రూ.4,227.52 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసిందని.. రూ.3,816.79 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయాల్సి ఉందన్నారు. అయితే, చంద్రబాబునాయుడు గత నెల 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,167 కోట్లే వ్యయం చేసిందని అవాస్తవాలను వల్లెవేశారు. బాబు అబద్ధాలను పటాపంచలు చేస్తూ టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి వాస్తవ అంకెలను వివరించారు. కేంద్ర నిధులు మళ్లించినట్లు కూడా చంద్రబాబు తన శ్వేతపత్రం ద్వారా చెప్పగా కేంద్రమంత్రి ఎక్కడా నిధుల మళ్లింపు ఊసెత్తలేదు. ఇక గత మూడేళ్లలో హెడ్వర్క్తో పాటు కాంక్రీట్ పనులు, కుడికాలువకు లైనింగ్ పనులు, ఎడమ కాలువ ఎర్త్‌వర్క్ లైనింగ్‌తో పాటు స్ట్రక్చర్ పనులు, భూసేకరణ, సహాయ పునరావాసానికి వ్యయం చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టంచేశారు. -
రెబల్ ఎంపీ మద్దతు.. వందకు చేరిన కాంగ్రెస్ బలం!
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.People of Maharashtra defeated the politics of treachery, arrogance and division. It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024 దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్‌ను అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది. మరోవైపు.. బిహార్‌లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. -
ఆ లేఖ నాదే, నేనే రాశా
కర్ణాటక: ఎమ్మెల్యేలకు మంత్రులు అస్సలు విలువ ఇవ్వడం లేదు, తక్షణం సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ పెద్దలకు లేఖ రాస్తారు. దానిపై వివాదం ఏర్పడితే.. అబ్బే ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో నకిలీ లేఖను సృష్టించారు, బీజేపీ వారికి ఇదే పని అని ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజుకు మాట మార్చి.. ఆ లేఖ నాదే..అగౌరవాన్ని సహించేది లేదు అని హుంకరిస్తారు. కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఏమన్నారంటే లేఖ రాయడంపై క్షమాపణ కోరేది లేదని బీ.ఆర్.పాటిల్ తాజాగా ప్రకటించారు. ఆదివారం కల్బుర్గిలో మాట్లాడిన పాటిల్, ఎవరు క్షమాపణ కోరారో నాకు తెలియదు. సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కోరడం మా హక్కు. కొందరు మంత్రుల ప్రవర్తన అనేకమందికి అసంతృప్తికి కారణమైంది. ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజీనామా చేస్తాను అని పాటిల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో తాను ఎలాంటి క్షమాపణ కోరలేదని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అందరి ముందు చెప్పలేనన్నారు. లేఖ రాయడం నా హక్కు, నేనే రాశాను.అయితే క్షమాపణ కోరలేదు. ప్రియాంక్ ఖర్గేతో అన్ని విషయాలనూ చర్చించాను అని చెప్పారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
ములుగు: పోలీసులు మావోయిస్టు పార్టీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డంప్ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బడె చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్, మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఆదేశాల మేరకు దళం సభ్యులు, మిలీషియా సభ్యులు కాల్వపల్లి అటవీ ప్రాంతంలో డంప్‌ను దాచినట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అడవిలో మూడు అడుగుల లోతులో తవ్వకాలు జరపగా నీలిరంగు డ్రమ్ము దొరికినట్లు తెలిపారు. అందులో 25 జిలెటెన్‌స్టిక్స్, 25 డిటోనేటర్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వివరించారు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టు పార్టీ ప్రయత్నం చేస్తోందని ఎస్పీ అన్నారు. -
దేశంలోనే రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ
ముంబై: దేశంలో రెండో ఎత్తైన జెండా మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ స్థానిక పోలీస్ గార్డెన్లో సోమవారం 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేఎస్‌బీపీ ట్రస్టు ఈ జెండాను ఏర్పాటు చేసింది. ట్రస్టు అధ్యక్షుడు పిత్రే మాట్లాడుతూ 90 అడుగుల పొడవు, 60అడుగుల వెడల్పున్న జెండా ఏర్పాటుకు రూ.1.1 కోట్ల ఖర్చయిందన్నారు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద(360 అడుగులు) ఉంది. -
నువ్వు లేవు.. నీ సాక్ష్యం ఉంది
సల్మాన్ ‘హిట్ అండ్ రన్ ’ కేసులో ప్రపంచానికి తెలియని ‘బాడీగార్డ్’ కన్నీటి గాథ ముంబై: కళ్ల ముందే ఘోరం జరిపోయింది.. కారు చక్రాల కింద ఓ అభాగ్యుడు కన్నుమూశాడు.. అదే సమయంలో ఓ ఖాకీ చొక్కా మాటున ‘న్యాయం’ కళ్లు తెరిచింది! అన్యాయాన్ని బోనెక్కించేందుకు వడివడిగా అడుగులేసింది.. ధర్మదేవత ముందు నిలబ డి సాక్ష్యం చెప్పింది!! ఆ నిప్పులాంటి సాక్ష్యమే నేడు బాలీవుడ్ దిగ్గజం సల్మాన్‌ఖాన్‌ను కారాగారం దాకా తీసుకువెళ్లింది. మరి ఆ సాక్ష్యమిచ్చిన సాక్షి ఏమయ్యాడు? సల్మాన్ కండలకు ఏమాత్రం తీసిపోని ఆయన దేహదారుఢ్యం ఎందుకు బక్కచిక్కి ఎముకల గూడులా మారిపోయింది? ఎవరూ పట్టించుకోని స్థితిలో చిక్కిశల్యమై ఓ అనాథలా ఆసుపత్రిలో.. 30 ఏళ్ల ప్రాయంలోనే ఎందుకు కన్నుమూశాడు..? సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి, ఓ వెలుగు వెలుగుతున్న సెలబ్రిటీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే దీనంతటికీ కారణమా!? 13 ఏళ్ల తర్వాత సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసు కొలిక్కి వచ్చినా.. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఆయన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మృతి వెనుక మాత్రం జవాబులేని ప్రశ్నలెన్నో..! ఆ రోజు ఏం జరిగింది? ముంబైలోని సతారాకు చెందిన పాటిల్‌కు 25 ఏళ్లు. లేతప్రాయంలోనే ‘ఖాకీ’రంగుపై తన భవిష్యత్తును అల్లుకున్నాడు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు. కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు. చివరికి సల్మాన్‌ను కాపాడేందుకు కారును తానే నడిపానని డ్రైవర్ అశోక్‌సింగ్ చెప్పినా కోర్టు విశ్వసించకపోవడానికి కారణం నాడు పాటిల్ ఇచ్చిన సాక్ష్యమే. తలకిందులైన జీవితం ఈ సాక్ష్యం తర్వాత పాటిల్ జీవితం తలకిందులైంది. హైప్రొఫైల్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నందున ఎస్‌వోఎస్ కమాండో ఉద్యోగం నుంచి తప్పించారు. ఆయనపై వివిధ వైపుల నుంచే గాకుండా పోలీసు శాఖ నుంచి సైతం తట్టుకోలేని ఒత్తిళ్లు వచ్చాయని పాటిల్ సన్నిహితులు చెబుతుంటారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఆయన కుంగిపోయాడని, సొంత పోలీసు విభాగమే మానసిక స్థైర్యం ఇవ్వకపోవడంతో ఒంటరయ్యాడని పేర్కొంటారు. చివరికి పాటిల్‌కు కానిస్టేబుల్ విధులూ భారమయ్యాయి. తరచూ గైర్హాజరయ్యాడు. చివరికి ఒత్తిళ్లు తట్టుకోలేక ముంబైకి దూరంగా వెళ్లిపోయాడు. ఆయన సోదరుడు మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు. ఇంతలో కోర్టులో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది. ఆ సమయానికి పాటిల్ లేకపోవడంతో న్యాయమూర్తి అరెస్ట్ వారంట్లు జారీ చేశారు. మహాబలేశ్వర్‌లో 2006 మార్చిలో పాటిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆర్థర్ రోడ్డు జైలుకు పంపారు. కమాండోగా శిక్షణ పొందిన ఓ పోలీసు జైల్లో ఖైదీలా మారిపోయాడు. పోలీసు విభాగం అతడిని డిస్మిస్ చేసింది. వచ్చే జీతం ఆగిపోయింది. కొన్నాళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఎంతో బలిష్టంగా ఉండే పాటిల్‌కు క్షయ సోకింది. 30 కిలోల అస్థి పంజరంలా తయారయ్యాడు. తలపై వెంట్రుకలన్నీ ఊడిపోయి ఎవరూ గుర్తుపట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఆయన భార్య విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత పాటిల్ మళ్లీ అదృశ్యమయ్యాడు. 2007లో ముంబైలోని శివిడీ రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ రూ.50 సంపాదించుకుని సెవ్రీలోని టీబీ హాస్పిటల్‌కు చేరాడు. కనీసం మాట్లడలేని, నడవలేని స్థితిలో పాటిల్ ఆసుపత్రిలో చేరాడు. వ్యాధి ముదరడంతో అదే ఆసుపత్రిలో 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. కన్నుమూసేందుకు కొద్దిరోజుల ముందు.. ‘ఆ ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసింది’ అని పాటిల్ కొందరు మీడియా ప్రతినిధులకు చె ప్పినట్టు తెలిసింది. పాటిల్ మరణించి సుమారు ఎనిమిదేళ్లు కావస్తున్నా.. ఆయన కోర్టులో ఇచ్చిన సాక్ష్యం మాత్రం ఇంకా బతికే ఉంది! కష్టాలపాలవుతానని తెలిసినా తుదకంటా న్యాయం వైపు నిలబడిన పాటిల్.. మధ్యలో మాట మార్చి ఉంటే బహుశా జీవితం మరోలా ఉండేదేమో!! -
... ఆ పదవికి నేనూ అర్హుడినే
రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్ష స్థానాన్ని చేపట్టడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి కేపీసీసీ అధ్యక్ష పదవిని చేపడతానన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ వర్గం వారికి కేపీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలోనే తనతోపాటు అప్పాజీ నాడగౌడ, ఎం.బీ పాటిల్, ప్రకాశ్ హుక్కేరి తదితర పేర్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు కేటాయించిన ఐఐటీ స్థాపనకు అన్ని జిల్లాల నుంచి డిమాండ్ ఉందన్నారు. అయితే ఐఐటీ స్థాపనకు కనిష్టంగా 400 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. అందువల్ల అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కర్ణాటకకు పోటీ అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో కర్ణాటక దరిదాపుల్లో కూడా లేవని తెలిపారు. అందువల్ల కర్ణాటక నుంచి ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెలుతున్నాయన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో బాగల్‌కోటే జిల్లాకు మాత్రమే నూతన ఐటీ పార్కు కేటాయించే అవకాశం ఉందన్నారు. బెంగళూరు తప్ప రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతంలోనైనా కంపెనీ స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడుదారులకు ఉచితంగా భూమిని మంజూరు చేయనున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో కర్ణాటక నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను నాలుగులక్షల కోట్ల రుపాయలకు చేర్చే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.1.80 లక్షల కోట్లుగా ఉందని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. -
పదవి నాకొద్దు
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం రేసులో తాను లేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. తనకు కేపీసీసీ అధ్యక్ష స్థానంపై ఎలాంటి ఆశ లేదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సైతం తెలియజేశానని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను నిర్విస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖను వీడి ఇతర శాఖకు వెళ్లాలనే ఆలోచన తనకు లేదన్నారు. ప్రస్తుతం తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖతో సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు. కర్ణాటక భూ భాగానికి చెందిన మేకదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించామని తెలిపారు. రానున్న పదినెలల్లోపు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తయారవుతుందని ఎం.బీ పాటిల్ తెలిపారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం వల్ల తమిళనాడుకు కర్ణాటక నుంచి ఇవ్వాల్సిన కావేరీ జలాల్లో ఎటువంటి కోత పడదని స్పష్టం చేశారు. అయినా అక్కడి ప్రభుత్వం ఈ విషయమై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎం.బీ పాటిల్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. -
అనుమతి తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇకమీదట బోరు బావులను తవ్వాలంటే విధిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా విఫలమైన బోర్లను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా పూడ్చి వేయాలని గడువు విధించామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఈ బోర్లను మూసి వేసే పనులు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13,509 నిరుపయోగ బోరు బావులుండగా, ఇప్పటికే 12,385 బావులను పూడ్చి వేశారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విఫలమైన బోర్లను అలాగే వదిలేసి ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 18004258666కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. సమాచారం అందినవెంటనే స్థానిక అధికారులు అలాంటి బోర్లను మూసి వేయిస్తారని తెలిపారు. ఇకమీదట బోర్లు విఫలమైతే, అప్పటికప్పుడు బోరు బండ్ల యజమానులే వాటిని పూడ్చి వేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా కేపీఎస్సీ-11 ఎంపిక జాబితాను తిరస్కరించాలని మంత్రి వర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. దీనిపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ రాజకీయాలకు పాల్పడకూడదని ఆయన హితవు పలికారు. మూడు స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న బెల్గాం జిల్లా చిక్కోడిలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 70 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
పడిన చోటే..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘అయ్యా...నా బిడ్డ ఎలాగూ బతకడు. వాడిని అక్కడే సమాధి చేయడానికి అనుమతించండి. తవ్వేసిన నా భూమిని... గతంలో ఉన్నట్లు యథా స్థితిలో తిరిగి నాకు అప్పగించండి’...ఇది బాగలకోటె జిల్లా సూళగేరిలో గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న తండ్రి హనుమంతప్ప జిల్లా కలెక్టర్ మేఘన్ననవర్కు చేసిన విన్నపం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. మరో వైపు 160 అడుగుల లోతు నుంచి సజీవంగా తీసుకు రాలేని తిమ్మన్నను, నిర్జీవంగానైనా తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనేక విఘ్నాలు ఎదురవుతున్నాయి. దీంతో అతను మట్టిలో కలసిపోవడం దాదాపు ఖాయమని వినవస్తోంది. తిమ్మన్న బోరు బావిలో పడిపోయినప్పటి నుంచి అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా తవ్విన సమాంతర గుంతలో లోతుకు వెళ్లే కొద్దీ ఉన్నఫళంగా కూలిపోతుందేమోననే భీతి సిబ్బందిని వెంటాడుతోంది. పొలంలో లోతున మట్టి స్వభావం బంక మట్టిని పోలి ఉంది. ఇలాంటి బురద మట్టితో అపాయమని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీగా జాగ్రత్త చర్యలు చేపట్టి, శవాన్ని వెలికి తీయాలంటే కనీసం ఎనిమిది రోజులు పడుతుందని అంచనా. కుమారుడు బోరు బావిలో పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై బాగలకోటె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది, సూలగిరికి తిరిగి వచ్చిన హనుమంతప్ప, గురువారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కాగా పొలంలో మట్టి స్వభావాన్ని పరీక్షించడానికి ఆ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తిని పిలిపించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్ఆర్. పాటిల్ తెలిపారు. ఆయన మట్టి పరీక్షలను పూర్తి చేసిన అనంతరం జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు, సూళగేరి గ్రామ పెద్దలతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా తిమ్మన్న శవాన్ని వెలికి తీయడానికి సాగుతున్న పనులను ప్రభుత్వం ఆపివేయలేదు. అయితే బాలుడి తండ్రి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
ఆరిన దీపం?
తిరిగి రాని లోకాలకు తిమ్మన్న బోరు బావి నుంచి దుర్వాసన మృతదేహం వెలికితీతకు సాగుతున్న పనులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి పాటిల్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రార్థనలు ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. అతని ఆయుష్షు అంతేనని తేల్చేశాడు. బాగలకోటె జిల్లా సూళికేరి వద్ద గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న అటు నుంచి అటే...తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రాణాలతో అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యలు...ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీయడానికి కొనసాగుతున్నాయి. మధ్య మధ్యలో అవాంతరాలతో 88 గంటల పాటు ఏకబిగిన సహాయక చర్యలు సాగాయి. ‘బాలుడు బోరు బావిలో పడిపోయి ఎనభై గంటలకు పైగా గడిచిపోయాయి. కనుక అతను చనిపోయి ఉండవచ్చు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోంది’ అని జిల్లా సర్జన్ అనంత రెడ్డి బుధవారం రాత్రి బాగా పొద్దు పోయాక సంఘటనా స్థలం వద్ద ప్రకటించారు. అంతే...చాలా సేపు అక్కడ అయోమయం నెలకొంది. రోబో ద్వారా బాలుని వెలికి తీయడానికి మధురై నుంచి వచ్చిన మణికంఠన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత వైదుృల బందం అక్కడికి చేరుకుంది. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో బాలుడు బతికి ఉండడృని బందం నిర్ధారించింది. శోక సంద్రంలో కుటుంబం తిమ్మన్న మరణించి ఉంటాడని వైద్యులు తేల్చడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు బిడ్డను పోగొట్టుకుని, అటు భర్త ఆస్పత్రి పాలవడాన్ని తలుచుకుని తిమ్మన్న తల్లి సంగవ్వ బోరున విలపించింది. నాలుగు రోజులుగా ఆమె నిద్రాహారాలు మానుకుని బిడ్డ కోసం విలపిస్తూ కూర్చుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తీవ్ర అస్వస్థతకు లోనైన తిమ్మన్న తండ్రి హనుమంతప్ప ఆస్పత్రిలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మృతదేహం వెలికితీతకు ప్రయత్నాలు తిమ్మన్న మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోబో ద్వారా వెలికి తీయాలంటే ముందుగా బోరు బావిలో పడిన మట్టిని తొలగించాల్సి ఉంది. శవంపై ఒకటిన్నర అడుగుల మట్టి ఉండవచ్చని అంచనా. రెండు వాక్యూమ్ సక్కర్ల ద్వారా మట్టిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మట్టిని తొలగిస్తేనే రోబో ద్వారా మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుంది. సమాంతరంగా తవ్వుతున్న సొరంగ మార్గం ద్వారా బయటకు తీయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశాలున్నాయి. హనుమంతప్పను ఆదుకుంటాం తిమ్మన్నను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాల్లో అతని తండ్రికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణృభివద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. గురువారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పొలంలో తవ్విన సొరంగ మార్గాలను ప్రభుత్వమే పూడ్చి వేస్తుందని చెప్పారు. కాగా తిమ్మన్న కుటుంబానికి ప్రభుత్వం ఇదివరకే రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యేలు తలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. -
ఇంకా అక్కడే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బాగలకోటె జిల్లా సూళికేరిలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు తిమ్మన్నను వెలికి తీయడానికి మంగళవారం మూడో రోజూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగాయి. 160 అడుగుల లోతులో పడిపోయిన ఆ బాలుని వెలికి తీయాలంటే సమాంతరంగా తవ్వుతున్న గుంత పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. బాలునిపై పడిన మట్టిని తొలగించడానికి బాగలకోటె మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వ్యాక్యూమ్ సక్కర్‌ను తెప్పించారు. మరో వైపు సహాయక చర్యలను నిలిపి వేయాల్సిందిగా బాలుని తండ్రి హనుమంత హట్టి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. సహాయక చర్యల వల్ల ఉన్న భూమి కూడా నాశనమై పోతోందని వాపోయాడు. భూమి పోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నాడు. అయితే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్ఆర్. పాటిల్ దీనికి సమ్మతించలేదు. ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నాడని, అతను చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరో వైపు బోరు బావుల్లో పడిపోయిన వారిని సురక్షితంగా వెలికి తీయడానికి రూపొందించిన రోబోతో మధురై నుంచి మణికంఠన్ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నాడు. -
ఠాణే సీటులో ‘పాటిల్’ ఓటర్లే కీలకం
సాక్షి, ముంబై: ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో ఇంటి పేరు పాటిల్ ఉన్న ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులలో మాత్రం ఒక్క పాటిల్ కూడా లేరు. ఈ నియోజకవర్గంలో సుమారు 20 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 53,487 మంది ఓటర్లు ఇంటి పేరు పాటిల్ ఉన్నవారున్నారు. రెండో స్థానంలో యాదవ్ ఓటర్లు ఉన్నారు. యాదవ్‌ల సంఖ్య 50,487 మంది ఉండగా, తృతీయ స్థానంలో ఇంటిపేరు శేఖ్ ఉన్న ఓటర్లు 45,407 మంది ఉన్నారు. కాగాద డీఎఫ్ కూటమి అభ్యర్థిగా సంజీవ్ నాయక్ (ఎన్సీపీ), మహా కూటమి అభ్యర్థిగా రాజన్ విచారే (శివసేన), ఎమ్మెన్నెస్ నుంచి అభిజిత్ పాన్సే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజీవ్ సాని బరిలో ఉన్నారు. 38 శాతం యువత...: ఈ నియోజకవర్గ ఓటర్లలో సుమారు 38 శాతం మంది ఓటర్లు యువతే ఉన్నారు. 18 నుంచి 37 ఏళ్ల వయస్సు గల ఓటర్లు ఏకంగా ఎనిమిది లక్షల మందికిపైగా ఉన్నారు. ఈ సారి గెలుపు ఓటముల్లో యువత ఓటు కీలకం కానుందని ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పటి నుంచే వారి జపం చేస్తున్నారు. కాగా ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రాంతం పరిధిగా పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఠాణేలోని సీపీ తలావ్, లోకమాన్యనగర్, పోన్న్ ్రనంబర్ రెండు తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటితోపాటు నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో తెలుగువారు ఉన్నారు. -
ఆప్ గూటికి షెత్కారీ సంఘటన నేత పాటిల్
ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని పటిష్టపరిచే దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. ఆప్ నాయకులు మయాంక్ గాంధీ, అంజలి దమానియా సమక్షంలో తన అనుచరులతో కలిసి షెత్కారీ సంఘటన నాయకుడు రఘునాథన్ పాటిల్ మంగళవారం ఆ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు నుంచి తాము ఆప్ సభ్యులమని, రేపటి నుంచి తమ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003లో వచ్చిన ఈ చట్టం ఇప్పటివరకు సమర్థంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. షెత్కారీ సంఘటన మహారాష్ట్ర విభాగం ఉనికిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యల కోసం గతంలో కాషాయకూటమికి తాము ఎన్నోసార్లు మద్దతిచ్చామని, అయితే ఆ సమస్యలను పరిష్కరించడంలో వాళ్లు పోరాటంలో చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రధాన ప్రతిపక్షమైన కాషాయకూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా సంఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా ప్రచారం ఉంటుందని, అందుకే ప్రజా ఉద్యమాల్లో నుంచి వచ్చిన ఆప్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్వాభిమాన్ షెత్కారీ సంఘటన్ ఎంపీ రాజు శెట్టి ఇటీవల కాషాయకూటమిలో చేరడంతో పాటిల్ ఆప్ తీర్థాన్ని పుచ్చుకోవడం గమనార్హం. అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు హెల్ప్‌లైన్ లంచగొండి అధికారుల ఆగడాలను అరికట్టేందుకు నాసిక్ ఆప్ విభాగం హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. లంచాలు ఇవ్వలేక తీవ్ర నిరాశలో ఉన్న నగరవాసులకు 60 మంది సభ్యులు గల బృందం సహకరిస్తుందని ప్రకటించింది. ఈ బృందంలో న్యాయవాదులు, ఆర్టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. రేషన్ కార్డు జారీ చేసే విషయంలో, మరో ఇతర పనికోసమైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే అందుబాటులోకి రానున్న తమ హెల్ప్‌లైన్ 9823026131, 9823209131 నంబర్లలలో సంప్రదించాలని ఆప్ కన్వీనర్ జితేంద్ర భవే తెలిపారు. ఈ కాల్‌ను మాట్లాడిన వ్యక్తులు సదరు బృందాన్ని అప్రమత్తం చేసి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఆప్‌లో 30వేల మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. 15వేల మంది ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకున్నారని వివరించారు. -
గ్రామాలకు శుద్ధి నీరు
= రాష్ట్రంలో రెండు వేల నీటి శుద్ధీకరణ కేంద్రాలు = పంచాయతీకో కేంద్రం : మంత్రి పాటిల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంలో భాగంగా పంచాయతీకి ఒకటి చొప్పున వెయ్యి నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామని, ఇప్పుడా సంఖ్యను రెండు వేలకు పెంచాలని యోచిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాృవద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ వెల్లడించారు. ్రృకతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో నీరు, పరిశుభ్రతలపై పడే దుష్పరిణామాల గురించి ఇక్కడి వికాస సౌధలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. ఫ్లోరైడ్, ఇతర కారణాల వల్ల నీరు కలుషితమవుతోందని, దీనిని నివారించడానికి పంచాయతీకో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ్రృకతి వైపరీత్యాల వల్ల నీటి కొరత ఏర్పడడంతో పాటు ఉన్న నీరూ కలుషితమవుతోందన్నారు. పౌష్టికాహార లోపానికి కలుషిత నీరు కూడా కారణమన్నారు. మరుగు దొడ్లతో పాటు స్నానపు గదులను కూడా నిర్మించడంపై తమ ప్రభుత్వందృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. -
'హోంమంత్రి పాటిల్ రాజీనామాకు ఇది సమయం కాదు'
ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదన్నారు. విస్తీర్ణంలోనూ, జనాభాపరంగానూ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచార ఘటన దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రేప్ ఉదంతం చోటు చేసుకున్న అనంతంర నిందితుల కోసం పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు.