ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదన్నారు. విస్తీర్ణంలోనూ, జనాభాపరంగానూ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచార ఘటన దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రేప్ ఉదంతం చోటు చేసుకున్న అనంతంర నిందితుల కోసం పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు.
'హోంమంత్రి పాటిల్ రాజీనామాకు ఇది సమయం కాదు'
Published Fri, Aug 23 2013 6:46 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM