మరో ఇద్దరు మృగాళ్ల అరెస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని దక్షిణ ముంబైలోని మదన్‌పురా ప్రాంతంలో శనివారం వేకువజామున పట్టుకున్నారు. నిందితుడి పేరు విజయ్ జాదవ్(22) అని, విచారణలో ఇతడు నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సిరాజ్ రెహ్మాన్(25)ను ముంబ్రా పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. త్వరలోనే మిగతా ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ చెప్పారు. ‘‘పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మిగతావారి వివరాలు కూడా తెలిశాయి. వీరు ముంబైకి కొద్దిదూరంలోనే ఉన్నారు.
వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం’’ అని ఆయన చెప్పారు. ముంబైలోని శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు వ్యక్తులు మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరు దొరికారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు 20 బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
నిందితులకు 30 వరకు పోలీసు కస్టడీ
రేప్ కేసు నిందితులు మహమ్మద్ అబ్దుల్, విజయ్ జాదవ్‌లను పోలీసులు శనివారం దాదర్‌లోని బోయివాడా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారు. కోర్టు నిందితులిద్దరికీ ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీ విధించింది. విచారణ సందర్భంగా నేరాన్ని ఒప్పుకున్న మహమ్మద్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయలేదు. న్యాయమూర్తి ముందు కూడా ఆవలింతలు తీస్తూ నిర్లక్ష్యంగా కనిపించాడు.
కోలుకుంటున్న బాధితురాలు
సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు జస్‌లోక్ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారంతోపోలిస్తే ఆమె కాస్త కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ తెలిపారు.
‘మా వాడు మైనర్’
ఈ కేసులోఅరెస్టయిన మొదటి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ మైనర్ అని అతడి బంధువులు పేర్కొన్నారు. మహమ్మద్ 1997, ఫిబ్రవరి 26న జన్మించినట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అతడి అమ్మమ్మ సర్ణబాయ్ శనివారం పోలీసులకు అందించింది. అయితే పోలీసులు ఆమె వాదనను కొట్టిపడేస్తున్నారు. నిందితుడిని రక్షించేందుకే వారు ఈ ప్రయత్నం చేస్తున్నారని, మహమ్మద్‌కు 19 ఏళ్లు ఉన్నాయని చెబుతున్నారు.
దోషులను కఠినంగా శిక్షించాల్సిందే..
మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అఘాయిత్యానికి పాల్పడిన కీచకులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివారికి ఉరిశిక్షే సరైందని, అప్పుడే ఇలాంటి నేరాలు ఆగుతాయని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఆందోళన
న్యూఢిల్లీ: ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్‌పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న విమర్శల వేడి శనివారం లోక్‌సభను తాకింది. కఠిన చట్టాలను రూపొందిస్తున్నా ఇలాంటి సంఘటనలు కొనసాగుతుండటంపై వివిధ పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జీరో అవర్ సందర్భంగా బీజేపీ సభ్యుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ.. ముంబై గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక కోరాలని, సభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జయప్రద మాట్లాడుతూ.. నిర్భయ ఘటన తర్వాత ఎంపీలందరూ ఏకమై క్రిమినల్ లాను సవరించి చట్టం తెచ్చారని, అయినా మహిళలపై నేరాలు కొనసాగుతున్నాయంటూ విచారం వ్యక్తంచేశారు.
జీవితం ముగిసినట్లు కాదు: బాధితురాలు
‘‘అత్యాచారం జరిగినంత మాత్రాన జీవితం అంతమైనట్లు కాదు. దోషులందరికీ అత్యంత కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నా. అలాగే వీలైనంత వెంటనే తిరిగి డ్యూటీలో చేరాలని ఉంది’’. ఇదీ ముంబైలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళా ఫొటో జర్నలిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఘటనపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలకు ఇచ్చిన సందేశం. తనను పరామర్శించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభావాల్కర్‌తో ఆమె ఈ మాటలు అన్నారు.
బీరు బాటిల్‌తో బెదిరించి...
మహిళా ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. పగిలిన బీరు బాటిల్ చేతిలో పట్టుకొని చంపుతామంటూ బెదిరించి పశువుల్లా ప్రవర్తించినట్లు తెలిసింది. పోలీసులు, ఆమె సహోద్యోగి అందించిన వివరాల ప్రకారం.. తాము పని చేస్తున్న ఇంగ్లిష్ మేగజైన్‌కు ముంబైలో మిల్లుల పరిస్థితిపై కథనం ఇచ్చేందుకు వారు నిర్మానుష్య ప్రాంతంలోని శక్తిమిల్ వద్దకు వెళ్లారు. ఫొటోలు తీస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి ఇక్కడ ఫొటోలు తీయరాదని చెప్పి వెళ్లారు. కాసేపటికి మరో వ్యక్తితో మొత్తం ముగ్గురు వచ్చి వారిని బెదిరించారు. సహచరుడి చేతులను బెల్టుతో కట్టివేసి చెట్లు, నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు తోడయ్యారు. తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తల్లి నుంచి ఆమెకు ఫోనొచ్చింది. క్షేమంగానే ఉన్నానని చెప్పాలని, లేదంటే బీరు బాటిల్‌తో చంపేస్తామని బెదిరించారు. ఆమె భయపడుతూ అలాగే చెప్పి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన తల్లి మరోసారి ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయొద్దని బెదిరించారు. పాశవికంగా ప్రవర్తించిన తర్వాత ఆ కామాంధులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనన్న అనుమానంతో యువతితోపాటు ఆమె సహచరుడిని సమీపంలోని రైల్వేస్టేషన్ దాకా అనుసరించారు.
అసాంఘిక శక్తుల అడ్డా శక్తి మిల్స్
ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలో ఉన్న డాక్టర్ ఇ. మోజెస్ రోడ్డులో శక్తిమిల్స్ సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల క్రితం నాటి ఈ మిల్లు ప్రైవేటు వ్యక్తులది. దీన్ని 30 ఏళ్ల కిందట మూసేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ముళ్ల పొదలు, చెట్లతో విస్తరించి చిట్టడవిలా మారింది. పగటిపూట నిర్మానుష్యంగా ఉండే ఈ మిల్లు ప్రాంతం సాయంత్రం కాగానే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతుంది. మత్తు పదార్థాలకు బానిసలైనవారు, మందుబాబులు ఇక్కడకు చేరుకొని రాత్రంతా నానా హంగామా సృష్టిస్తుంటారు. అందుకే ఈ మిల్లు పరిసర ప్రాంతాల్లో నివసించే స్థానికులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతుంటారు. కాగా, మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని ఆమె సహచర ఉద్యోగి పోలీసులకు శనివారం చూపించాడు. ఘటన జరిగిన తీరును వారికి వివరించాడు.
‘ఒళ్లు జలదరిస్తోంది’
‘‘నేను శక్తి మిల్స్ ఫొటోలను ఎన్నోసార్లు తీశాను. నేను ఫొటో స్టోరీ చేసేందుకు వెళ్లేటప్పుడు బ్యాగులో మిరియాల స్ప్రే వెంట తీసుకెళ్లేదాన్ని. అయితే దాని అవసరం రాకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు ఆకతాయిలను కొట్టేందుకు నా కెమెరాను ఉపయోగించా. ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్ జరిగిందని తెలియడంతో నోటమాటరాలేదు. నా ఒళ్లంతా భయంతో జలదరించింది. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇటువంటి దాడుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని భావిస్తున్నా’’ - శ్రద్ధా భార్గవ చతుర్వేది (ముంబైలో ఓ మ్యాగజైన్‌కు పనిచేసే ఫొటోజర్నలిస్టు)