Home Minister R R Patil
-
మరో ఇద్దరు మృగాళ్ల అరెస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని దక్షిణ ముంబైలోని మదన్‌పురా ప్రాంతంలో శనివారం వేకువజామున పట్టుకున్నారు. నిందితుడి పేరు విజయ్ జాదవ్(22) అని, విచారణలో ఇతడు నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సిరాజ్ రెహ్మాన్(25)ను ముంబ్రా పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. త్వరలోనే మిగతా ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్ చెప్పారు. ‘‘పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మిగతావారి వివరాలు కూడా తెలిశాయి. వీరు ముంబైకి కొద్దిదూరంలోనే ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం’’ అని ఆయన చెప్పారు. ముంబైలోని శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఐదుగురు వ్యక్తులు మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరు దొరికారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు 20 బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితులకు 30 వరకు పోలీసు కస్టడీ రేప్ కేసు నిందితులు మహమ్మద్ అబ్దుల్, విజయ్ జాదవ్‌లను పోలీసులు శనివారం దాదర్‌లోని బోయివాడా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారు. కోర్టు నిందితులిద్దరికీ ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీ విధించింది. విచారణ సందర్భంగా నేరాన్ని ఒప్పుకున్న మహమ్మద్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయలేదు. న్యాయమూర్తి ముందు కూడా ఆవలింతలు తీస్తూ నిర్లక్ష్యంగా కనిపించాడు. కోలుకుంటున్న బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు జస్లోక్ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారంతోపోలిస్తే ఆమె కాస్త కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ తెలిపారు. ‘మా వాడు మైనర్’ ఈ కేసులోఅరెస్టయిన మొదటి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ మైనర్ అని అతడి బంధువులు పేర్కొన్నారు. మహమ్మద్ 1997, ఫిబ్రవరి 26న జన్మించినట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అతడి అమ్మమ్మ సర్ణబాయ్ శనివారం పోలీసులకు అందించింది. అయితే పోలీసులు ఆమె వాదనను కొట్టిపడేస్తున్నారు. నిందితుడిని రక్షించేందుకే వారు ఈ ప్రయత్నం చేస్తున్నారని, మహమ్మద్‌కు 19 ఏళ్లు ఉన్నాయని చెబుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిందే.. మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అఘాయిత్యానికి పాల్పడిన కీచకులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివారికి ఉరిశిక్షే సరైందని, అప్పుడే ఇలాంటి నేరాలు ఆగుతాయని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఆందోళన న్యూఢిల్లీ: ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్‌పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న విమర్శల వేడి శనివారం లోక్‌సభను తాకింది. కఠిన చట్టాలను రూపొందిస్తున్నా ఇలాంటి సంఘటనలు కొనసాగుతుండటంపై వివిధ పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జీరో అవర్ సందర్భంగా బీజేపీ సభ్యుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ.. ముంబై గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక కోరాలని, సభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జయప్రద మాట్లాడుతూ.. నిర్భయ ఘటన తర్వాత ఎంపీలందరూ ఏకమై క్రిమినల్ లాను సవరించి చట్టం తెచ్చారని, అయినా మహిళలపై నేరాలు కొనసాగుతున్నాయంటూ విచారం వ్యక్తంచేశారు. జీవితం ముగిసినట్లు కాదు: బాధితురాలు ‘‘అత్యాచారం జరిగినంత మాత్రాన జీవితం అంతమైనట్లు కాదు. దోషులందరికీ అత్యంత కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నా. అలాగే వీలైనంత వెంటనే తిరిగి డ్యూటీలో చేరాలని ఉంది’’. ఇదీ ముంబైలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళా ఫొటో జర్నలిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఘటనపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలకు ఇచ్చిన సందేశం. తనను పరామర్శించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభావాల్కర్తో ఆమె ఈ మాటలు అన్నారు. బీరు బాటిల్‌తో బెదిరించి... మహిళా ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. పగిలిన బీరు బాటిల్ చేతిలో పట్టుకొని చంపుతామంటూ బెదిరించి పశువుల్లా ప్రవర్తించినట్లు తెలిసింది. పోలీసులు, ఆమె సహోద్యోగి అందించిన వివరాల ప్రకారం.. తాము పని చేస్తున్న ఇంగ్లిష్ మేగజైన్‌కు ముంబైలో మిల్లుల పరిస్థితిపై కథనం ఇచ్చేందుకు వారు నిర్మానుష్య ప్రాంతంలోని శక్తిమిల్ వద్దకు వెళ్లారు. ఫొటోలు తీస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి ఇక్కడ ఫొటోలు తీయరాదని చెప్పి వెళ్లారు. కాసేపటికి మరో వ్యక్తితో మొత్తం ముగ్గురు వచ్చి వారిని బెదిరించారు. సహచరుడి చేతులను బెల్టుతో కట్టివేసి చెట్లు, నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు తోడయ్యారు. తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తల్లి నుంచి ఆమెకు ఫోనొచ్చింది. క్షేమంగానే ఉన్నానని చెప్పాలని, లేదంటే బీరు బాటిల్‌తో చంపేస్తామని బెదిరించారు. ఆమె భయపడుతూ అలాగే చెప్పి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన తల్లి మరోసారి ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయొద్దని బెదిరించారు. పాశవికంగా ప్రవర్తించిన తర్వాత ఆ కామాంధులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనన్న అనుమానంతో యువతితోపాటు ఆమె సహచరుడిని సమీపంలోని రైల్వేస్టేషన్ దాకా అనుసరించారు. అసాంఘిక శక్తుల అడ్డా శక్తి మిల్స్ ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలో ఉన్న డాక్టర్ ఇ. మోజెస్ రోడ్డులో శక్తిమిల్స్ సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల క్రితం నాటి ఈ మిల్లు ప్రైవేటు వ్యక్తులది. దీన్ని 30 ఏళ్ల కిందట మూసేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ముళ్ల పొదలు, చెట్లతో విస్తరించి చిట్టడవిలా మారింది. పగటిపూట నిర్మానుష్యంగా ఉండే ఈ మిల్లు ప్రాంతం సాయంత్రం కాగానే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతుంది. మత్తు పదార్థాలకు బానిసలైనవారు, మందుబాబులు ఇక్కడకు చేరుకొని రాత్రంతా నానా హంగామా సృష్టిస్తుంటారు. అందుకే ఈ మిల్లు పరిసర ప్రాంతాల్లో నివసించే స్థానికులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతుంటారు. కాగా, మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని ఆమె సహచర ఉద్యోగి పోలీసులకు శనివారం చూపించాడు. ఘటన జరిగిన తీరును వారికి వివరించాడు. ‘ఒళ్లు జలదరిస్తోంది’ ‘‘నేను శక్తి మిల్స్ ఫొటోలను ఎన్నోసార్లు తీశాను. నేను ఫొటో స్టోరీ చేసేందుకు వెళ్లేటప్పుడు బ్యాగులో మిరియాల స్ప్రే వెంట తీసుకెళ్లేదాన్ని. అయితే దాని అవసరం రాకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు ఆకతాయిలను కొట్టేందుకు నా కెమెరాను ఉపయోగించా. ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్ జరిగిందని తెలియడంతో నోటమాటరాలేదు. నా ఒళ్లంతా భయంతో జలదరించింది. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇటువంటి దాడుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని భావిస్తున్నా’’ - శ్రద్ధా భార్గవ చతుర్వేది (ముంబైలో ఓ మ్యాగజైన్‌కు పనిచేసే ఫొటోజర్నలిస్టు) -
ముంబై..భద్రతకు బైబై..!
సాక్షి, ముంబై: నగరంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. గురువారం సాయంత్రం ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారం సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. జాతీయ రాజధానితోపాటు దేశ ఆర్థిక రాజధానిలో సైతం మహిళలకు తగిన రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నగరంలో జరిగిన కొన్ని సంఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్లో ఓ యువతిపై ఆసిడ్ దాడి, రైల్లో అత్యాచార ప్రయత్నం, అమెరికా యువతిపై బ్లేడ్‌తో దాడి సంఘటనలన్నీ ముంబైలో ఇటీవల కాలంలోనే జరిగిన విషయం విదితమే. మూడు రోజుల కిందటే పుణేలో సామాజిక కార్యకర్త నరేంద్ర దాబోల్కర్ హత్య సంఘటనను మరవకముందే ముంబైలో ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిగింది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైతోపాటు రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘాలు, కెమెరామెన్, ఫొటోగ్రాఫర్ జర్నలిస్ట్ సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ముంబైలోని హుతాత్మ చౌక్‌లో శుక్రవారం జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. మరోవైపు ఠాణేలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఠాణే జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. పుణే, ఔరంగాబాద్, నాగపూర్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ జర్నలిస్ట్‌లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. అదేవిధంగా ఈ సంఘటనలో నిందితులకు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాయి. మరోవైపు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సైతం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్‌పై విమర్శలు గుప్పించారు. పాటిల్ హోంమంత్రిగా పనికిరాడని, అతడు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. పింప్రిలో రాస్తారోకో పింప్రి, న్యూస్‌లైన్: మహిళా ఫొటోజర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన మహిళా శాఖ శుక్రవారం నగరంలో రాస్తోరోకో నిర్వహించింది. ఈ సందర్భంగా ముంబై-పుణే హైవేపై పెద్దసంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఈ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైనందువల్ల హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించడం సంగతి పక్కనబెట్టి ముందు వారికి రక్షణ కల్పించాలని కోరారు. ఆర్.ఆర్.పాటిల్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున మహిళలు నినదించారు. శివసేన కార్పొరేటర్ సులభా ఉభాలే, సీమా సావలే, బీజేపీ మహిళా విభాగం ప్రదేశ్ కార్యదర్శి ఉమా భాపరలు రాస్తారోకో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. అన ంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద సులభా ఉభాలే, సీమా ఖాపరేలు ఓ సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆశా షేడగే, శారదా బాబర్, అశ్విని చించ్వడ్, సంగీతా భోంద్వే, సంగీతా పవార్, మాజీ కార్పొరేటర్లు విజయ, శివసేన మహిళా శాఖ నాయకురాలు సునీతా చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
రేప్ సిటీ..!
ముంబై: ‘నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తాం’... ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలివి. అయితే ప్రస్తుతం నగరం ‘రేప్ సిటీ’గా మారిందని, హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగాకొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమే గత పదిసంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈ కాలంలో నగరంలో అత్యాచారాల సంఖ్య ఎనభై శాతం పెరిగింది. పదేళ్ల క్రితం 2002లో 128 మంది అత్యాచారానికి గురికాగా 2012లో 231 మంది అత్యాచారానికి గురయ్యారు. ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే 89 మందిపై అత్యాచారం జరిగింది. ఇందులో ముక్కుపచ్చలారని బాలికలు 46 మంది ఉన్నారు. ఈ గణాంకాలు చూశాక కూడా నగరాన్ని సేఫ్ సిటీ అందామా? లేక ప్రతిపక్షాలు ‘రేప్ సిటీ’గా మారిందంటూ చేస్తున్న విమర్శలను నిజమనే నమ్ముదామా? సామాజిక కార్యకర్త చేతన్ కోఠారి ఆర్టీఐ హక్కు ద్వారా ఈ వివరాలను సేకరించారు. ఉచితంగానే, కోరిన వెంటనే ఇవ్వాల్సిన గణాంకాలను ఇచ్చేందుకు కూడా పోలీసులు ఎన్నో సాకులు చెప్పారని, మూడు నెలల తర్వాత.. పదేళ్లలో జరిగిన అత్యాచారాలకు సంబంధించిన వివరాలు ఇచ్చారని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. పదేళ్లలో 80 శాతం పెరిగిన అత్యాచారాల సంఖ్య పదకొండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 95 శాతానికి ఎగబాకింది. విచిత్రమేమింటే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా శిక్ష పడుతున్నది మాత్రం కేవలం 22 శాతం మందికే. పదేళ్లలో 1,631 మంది మహిళలు, బాలికలు అత్యాచారానికి గురికాగా పోలీసులు 2,072 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో కేవలం 346 మందికి మాత్రమే కోర్టులు శిక్ష విధించాయి. ఓ అత్యాచారం చేసులో 15 సంవత్సరాలు శిక్ష పడిన కానిస్టేబుల్ చంద్రకాంత్ పవార్‌ను బాంబే హైకోర్టు విడుదల 2001లోనే చేసేసింది. డీబీ మార్గ్ స్టేషన్ పోలీసులు 46 అత్యాచారాలకు సంబంధించి 91 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా అందులో కేవలం ఇద్దరికి మాత్రమే శిక్ష పడింది. ఇక జుహూలో జరిగిన అత్యాచారానికి సంబంధించి కోర్టు కేవలం రూ. 3,000 జరిమానా విధించి, నిందితుడిని వదిలేసింది. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ముంబై పోలీసులు మహిళల కోసం ఘాట్కోపర్, దాదర్, బాంద్రా, చెంబూర్‌లో కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా అవి ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు, కానిస్టేబుళ్లలో కూడా మహిళలు ఉండాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తున్నా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. హోంమంత్రి రాజీనామాకు ఇది సమయం కాదు: సీఎం ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదు. ఇంతపెద్ద రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాను. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తున్నాను. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పదవిలోనుంచి దిగిపోండి: ఫడ్నవీస్ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ముంబై నగరం సేఫ్ సిటీ కాదు... రేప్ సిటిగా మారిందని చెప్పొచ్చు. నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తామని పాటిల్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వీటిని కాపాడడం మీ వల్ల కాకపోతే వెంటనే పదవిలోంచి దిగిపోండి. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అన్నివర్గాల ప్రజల నుంచి ఆగ్రహా జ్వాలలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అత్యాచారాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీ ఘటన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం నేర్చుకున్నట్లు కనిపించడంలేదు. కొరియర్ బాయ్‌లా పాటిల్: రాజ్‌ఠాక్రే హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు ఒక కొరియర్ బాయ్‌లా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు అక్కడికి చేరవేయడం మినహా శాంతిభద్రత లు, హోం శాఖపై దృష్టిసారించడం లేదు. హోంశాఖపై ఆయనకు అవగాహనలేదు. ఖాకీ డ్రెస్‌లో ఉన్నవారు పోస్టుమేనా లేక పోలీసా అనేది కూడ ఆయన తెలియదు. ఏమాత్రం సిగ్గు, పరువు ఉంటే వెంటనే తన పదవికీ రాజీనామా చేయాలి. రాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారిని స్వేచ్చగా వదిలేస్తే నేరాలను పూర్తిగా అరికడతారు. కాని పాటిల్ లాంటి అసమర్థులు హోంశాఖ పదవిలో ఉంటే వారేమీ చేయలేరు. గుర్తింపు పరేడ్ నిర్వహించాలి: ఉద్ధవ్‌ఠాక్రే నగరంలో ఇప్పటిదాకా చోటుచేసుకున్న అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరితో గుర్తింపు పరేడ్ నిర్వహించాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన సామూహిక అత్యాచార ఘటన ముంబైకేకాకుండా మానవత్వానికే సిగ్గుచేటన్నారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయనే విషయం ఈ ఘటనతో తేటతెల్లమైనాయని విమర్శించారు. పోలీసులకు అవసరమైన సహకారం అందించాల్సిన సమయమిదని, దీనిని రాజకీయం చేయడం తగదని ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు.