ముంబై: ‘నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తాం’... ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలివి. అయితే ప్రస్తుతం నగరం ‘రేప్ సిటీ’గా మారిందని, హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగాకొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమే గత పదిసంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈ కాలంలో నగరంలో అత్యాచారాల సంఖ్య ఎనభై శాతం పెరిగింది. పదేళ్ల క్రితం 2002లో 128 మంది అత్యాచారానికి గురికాగా 2012లో 231 మంది అత్యాచారానికి గురయ్యారు. ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే 89 మందిపై అత్యాచారం జరిగింది. ఇందులో ముక్కుపచ్చలారని బాలికలు 46 మంది ఉన్నారు. ఈ గణాంకాలు చూశాక కూడా నగరాన్ని సేఫ్ సిటీ అందామా? లేక ప్రతిపక్షాలు ‘రేప్ సిటీ’గా మారిందంటూ చేస్తున్న విమర్శలను నిజమనే నమ్ముదామా?
సామాజిక కార్యకర్త చేతన్ కోఠారి ఆర్టీఐ హక్కు ద్వారా ఈ వివరాలను సేకరించారు. ఉచితంగానే, కోరిన వెంటనే ఇవ్వాల్సిన గణాంకాలను ఇచ్చేందుకు కూడా పోలీసులు ఎన్నో సాకులు చెప్పారని, మూడు నెలల తర్వాత.. పదేళ్లలో జరిగిన అత్యాచారాలకు సంబంధించిన వివరాలు ఇచ్చారని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
పదేళ్లలో 80 శాతం పెరిగిన అత్యాచారాల సంఖ్య పదకొండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 95 శాతానికి ఎగబాకింది. విచిత్రమేమింటే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా శిక్ష పడుతున్నది మాత్రం కేవలం 22 శాతం మందికే. పదేళ్లలో 1,631 మంది మహిళలు, బాలికలు అత్యాచారానికి గురికాగా పోలీసులు 2,072 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో కేవలం 346 మందికి మాత్రమే కోర్టులు శిక్ష విధించాయి. ఓ అత్యాచారం చేసులో 15 సంవత్సరాలు శిక్ష పడిన కానిస్టేబుల్ చంద్రకాంత్ పవార్‌ను బాంబే హైకోర్టు విడుదల 2001లోనే చేసేసింది. డీబీ మార్గ్ స్టేషన్ పోలీసులు 46 అత్యాచారాలకు సంబంధించి 91 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా అందులో కేవలం ఇద్దరికి మాత్రమే శిక్ష పడింది. ఇక జుహూలో జరిగిన అత్యాచారానికి సంబంధించి కోర్టు కేవలం రూ. 3,000 జరిమానా విధించి, నిందితుడిని వదిలేసింది.
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ముంబై పోలీసులు మహిళల కోసం ఘాట్కోపర్, దాదర్, బాంద్రా, చెంబూర్‌లో కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా అవి ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు, కానిస్టేబుళ్లలో కూడా మహిళలు ఉండాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తున్నా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.
హోంమంత్రి రాజీనామాకు ఇది సమయం కాదు: సీఎం
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదు. ఇంతపెద్ద రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాను. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తున్నాను. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
పదవిలోనుంచి దిగిపోండి: ఫడ్నవీస్
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ముంబై నగరం సేఫ్ సిటీ కాదు... రేప్ సిటిగా మారిందని చెప్పొచ్చు. నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తామని పాటిల్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వీటిని కాపాడడం మీ వల్ల కాకపోతే వెంటనే పదవిలోంచి దిగిపోండి. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అన్నివర్గాల ప్రజల నుంచి ఆగ్రహా జ్వాలలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అత్యాచారాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీ ఘటన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం నేర్చుకున్నట్లు కనిపించడంలేదు.
కొరియర్ బాయ్‌లా పాటిల్: రాజ్‌ఠాక్రే
హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్, కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు ఒక కొరియర్ బాయ్‌లా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు అక్కడికి చేరవేయడం మినహా శాంతిభద్రత లు, హోం శాఖపై దృష్టిసారించడం లేదు. హోంశాఖపై ఆయనకు అవగాహనలేదు. ఖాకీ డ్రెస్‌లో ఉన్నవారు పోస్టుమేనా లేక పోలీసా అనేది కూడ ఆయన తెలియదు. ఏమాత్రం సిగ్గు, పరువు ఉంటే వెంటనే తన పదవికీ రాజీనామా చేయాలి. రాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారిని స్వేచ్చగా వదిలేస్తే నేరాలను పూర్తిగా అరికడతారు. కాని పాటిల్ లాంటి అసమర్థులు హోంశాఖ పదవిలో ఉంటే వారేమీ చేయలేరు.
గుర్తింపు పరేడ్ నిర్వహించాలి: ఉద్ధవ్‌ఠాక్రే
నగరంలో ఇప్పటిదాకా చోటుచేసుకున్న అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరితో గుర్తింపు పరేడ్ నిర్వహించాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన సామూహిక అత్యాచార ఘటన ముంబైకేకాకుండా మానవత్వానికే సిగ్గుచేటన్నారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయనే విషయం ఈ ఘటనతో తేటతెల్లమైనాయని విమర్శించారు. పోలీసులకు అవసరమైన సహకారం అందించాల్సిన సమయమిదని, దీనిని రాజకీయం చేయడం తగదని ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు.
రేప్ సిటీ..!
Published Fri, Aug 23 2013 11:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement