Chief Minister Prithviraj Chavan
-
సీఎంపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించారని ‘దేశ్ బచావ్ పార్టీ’ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. సీఎం వైఖరిపై ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించిందని దేశ్ బచావ్ పార్టీ అధ్యక్షుడు హేమంత్ పాటల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘రాష్ట్రంలో వచ్చే నెల 15న ఎన్నికలు జరుగుతాయని ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.. వెనువెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.. నియమాల ప్రకారం కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు.. అయినప్పటికీ ముఖ్యమంత్రి 35 రకాల ఫత్వాలు (ఆదేశాలు) జారీ చేశారు.. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల బదిలీ ఫైళ్లపై సంతకాలు చేశారు.. ఇలా చేయడం నియమాలు ఉల్లంఘించడమే’నని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే చవాన్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసిందని హేమంత్ పాటిల్ తెలిపారు. -
కేంద్రం ‘పవర్’గేమ్..!
►ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపణ ►విద్యుత్ సమస్యకు కేంద్రమే కారణం ►మోడీ వంద రోజుల పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు ►‘బ్లడ్ ఆన్ కాల్’ను కాపీ కొట్టారు.. ముంబై: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజాద్ మైదాన్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చవాన్ మాట్లాడుతూ.. కేంద్ర గ్రిడ్ల నుంచి విద్యుత్ పంపిణీలో కేంద్రం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానన్నారు. కేంద్ర గ్రిడ్ల నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించకపోతే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజలకు ఎటువంటి పవర్ కట్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ 100 రోజుల పాలనపై ఆయనమాట్లాడుతూ.. యూపీఏ సర్కార్ సమయంలో పూర్తయిన, ప్రారంభమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప ఆ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి తీసుకోవడంలోనూ విఫలమైందని ఆరోపించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒడంబడిక ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో మన కేంద్రం మెతకవైఖరినే అవలంభిస్తుండటం శోచనీయమన్నారు. ఇదిలాఉంచితే.. కేంద్ర, రాష్ట్రాల నడుమ సత్సంబంధాలను కొనసాగించడంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రధానితో పాటు పాల్గొన్న ముఖ్యమంత్రిని మాట్లాడకుండా అడ్డుకుని అవమానించడం వంటి ఘటనలను మహారాష్ట్ర ప్రజలు ఇకపై సహించరని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మోడీ ప్రభుత్వం ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సురేష్ శెట్టికి ఒక మెసేజ్ వచ్చిందని, దాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని చవాన్ తెలిపారు. వాస్తవానికి, తమ ప్రభుత్వం ఇప్పటికే ఆ పథకాన్ని రాష్ర్టంలో సామాన్య ప్రజల సంక్షేమార్థం ప్రారంభించిందని చెప్పారు. అయితే కేంద్రం ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తే మంచిదే అన్నారు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం తమ ప్రభుత్వానికి వస్తుందని చవాన్ పేర్కొన్నారు. బీజేపీకి అధికారం అప్పగించి తాము తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్ట కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించి, డీజిల్ ధర పెంచిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఏమాత్రం కృషిచేయడంలేదని విమర్శించారు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రలో విద్యుత్ సమస్యలకు కేంద్రం తీరే కారణమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. నారాయణ్‌రాణే, అశోక్ చవాన్ మాట్లాడుతూ కేంద్రం మహారాష్ర్టనుంచి విదర్భను విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. -
గోపీనాథ్ ముండే మృతిపై పలువురి దిగ్భ్రాంతి
సాక్షి, ముంబై: బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై ప్రభుత్వం, పార్టీలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. ముండే స్వగ్రామానికి చెందిన కొందరు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. గవర్నర్, సీఎం సహా పలువురు నాయకులు ముండే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముండే లోకనాయకుడు-గవర్నర్ కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే లోకనాయకుడు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించేవారు. కేంద్రమంత్రిగా చేరిన వారం రోజులకే దుర్మరణం పాలుకావడం రాష్ట్రవాసులందరినీ దుఖంలో ముంచివేసింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించి ఉన్నతస్థాయికి ఎదిగారు. చేపట్టిన ప్రతి పదవిలోనూ తనదైన ముద్ర వేశారు. పేదల పక్షపాతి: సీఎం పృథ్వీరాజ్ చవాన్ పేదల కోసం పోరాడుతూ అనతికాలంలోనే ప్రజలకు దగ్గరైన నాయకుల్లో ముండే ఒకరు. ఎలాంటి విపత్తులు వచ్చినా రాజకీయాలను పక్కన బెట్టి బాధితులకు సాయం చేసేవారు. ఇలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రజల తరఫున ముండేకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. నాకు సన్నిహితుడు: ఎన్సీపీ అధిపతి పవార్ రాజకీయాలు పక్కనే బెడితే మా ఇద్దరి మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. ఎక్కడ కనిపించినా ఒకరినొకరం అప్యాయంగా పలుకరించుకునేవాళ్లం. పేదలను ప్రేమించి సహృదయుడు కారు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఈ దుఖాన్ని తట్టుకునే శక్తి ఆయన కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పోరాట యోధుడు: మాణిక్‌రావ్ ఠాక్రే పేదలు, వెనకబడిన తరగతుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఇక లేరు. చాలా కాలం తరువాత ఆయనకు మంత్రిగా సేవ చేసేందుకు అవకాశం లభించింది. ఇలాంటి సమయంలో ఆకస్మికంగా ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం. ఎన్నో ఆశలుపెట్టుకుని ప్రజలు ఆయనను గెలిపించారు. సేవ చేసేందుకు దేవుడు అవకాశమివ్వలేదు. ప్రజలకు ఆప్తుడు : శివసేన ముండే మృతి మహారాష్ట్ర వాసులకు తీరనిలోటు. కార్యకర్తలు, ప్రజలతో ఆయన ఎపుడూ మమేకమయ్యేవారు. ఏ సమయంలోనైనా ప్రశాంతగా, సంయమనంగా వ్యవహరించేవారు. మా పార్టీతో ఎప్పుడూ సత్సంబంధాలు కోరుకునేవారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి తీవ్రంగా శ్రమించారు. ముండే లేని లోటు పూడ్చలేనిది : రాజ్ ఠాక్రే కేంద్ర మంత్రిగా సేవలు అందించేందుకు ప్రజల్లోకి వస్తున్న తరుణంలో ముండే మృతి చెందడం దురదృష్టకరం. ఆయన లేరనే బాధ, లోటు కేవలం బీజేపీకే పరిమితం కాదు. యావత్ రాష్ట్రానికీ అన్యాయం జరిగింది. ముండే మృతిచెందారనే విషయం నమ్మశక్యంగా లేదు. సీబీఐ దర్యాప్తు జరిపించాలి: ఆఠవలే ఈ ఘటనపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఉదయం వాహనాల రద్దీ లేదు. సిగ్నల్ జంప్ చేశారా..? ఢీ కొట్టిన కారు ముండే కాన్వాయ్‌లోకి ఎలా వచ్చింది.. ఇందులో ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయం తేలాలంటే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన లేరనే వార్తను ఉదయం ఎవరో ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపు నమ్మబుద్ధి కాలేదు. తరువాత నిజమని తేలడంతో జీర్ణించుకోలేకపోయాను. ఆయన మరణం బీజేపీకే కాదు.. యావత్ రాష్ట్ర ప్రజలకు తీరనిలోటు. -
టోల్ వసూలుపై ఆగ్రహ జ్వాల!
సాక్షి ముంబై: టోల్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొల్హాపూర్‌లో గతవారం ప్రారంభించిన ‘కరో యా మరో’ ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టోల్ వసూలును నిలిపివేసిన ఐడియల్ రోడ్ బిల్డర్(ఐఆర్బీ) కంపెనీ శనివారం రాత్రి మళ్లీ వసూళ్లను పునఃప్రారంభించడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుభికింది. ఫులేవాడి, శిరోలీ టోల్‌నాకాలపై వందలమంది ఆందోళనకారులు దాడికి దిగారు. రెండు క్యాబిన్లకు నిప్పుపెట్టడంతోపాటు అందులోని కంప్యూటర్లను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ‘కరో యా మరో’ ఆందోళన ఆరు రోజులుగా శాంతియుతంగానే కొనసాగుతున్నా ఐఆర్బీ వైఖరితోనే ఆందోళనకారులు ఆగ్రహానికి గురయ్యారని సామాజిక కార్యకర్త ఎన్డీ పాటిల్ తెలిపారు. శనివారం ఆందోళనలో ఆయన కూడా పాల్గొన్నారు. పైకి టోల్ వసూలు చేయవద్దని చెబుతూనే లోలోపల వసూలు చేసుకోవాల్సిందిగా కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్, హోంశాఖ సహాయమంత్రి సతేజ్ పాటిల్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు మంత్రులు టోల్ వసూలును నిలిపివేయాలని ఐఆర్బీని ఆదేశించారు. టోల్ డబ్బును కార్పొరేషన్ చెల్లిస్తుందని కూడా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సదరు కంపెనీ టోల్ వసూలును నిలిపివేసింది. దీంతో కొల్హాపూర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అయితే అదే రోజు రాత్రి నుంచి కంపెనీ టోల్ వసూలు చేయడం పున:ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే ఆదివారం ఉదయం ఫులేవాడి, శిరోలి టోల్‌నాకాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు టోల్ నాకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడున్న సీసీవీటీ కెమెరాలు, భద్రతా యంత్రాలు, క్యాబిన్లు, ఇతర వస్తువులన్నంటినీ ధ్వంసం చేసి తీవ్ర నిరసన తెలిపారు. శిరోలిటోల్ నాకాను ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మంటల్లో అక్కడున్న భారీ జనరేటర్ దగ్ధమైంది. ఈ ఘటనతో ఐఆర్బీకి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నియంత్రించలేకపోయారు. పోలీసులు వారిస్తున్నా ఆందోళనకారులు ధ్వంసకాండను ఆపలేదు. లాఠీచార్జీకి దిగితే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బంద్‌కు పిలుపునిచ్చిన శివసేన.. రాష్ట్ర ప్రభుత్వం టోల్ నాకాను మూసి వేసే విషయంపై కొల్హాపూర్ వాసులను మోసం చేసిందని స్థానిక శివసేన నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా టోల్ నాకాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులకు శివసైనికులు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తూ సోమవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. రూ.220 కోట్లు ఖర్చుచేసిన ఐఆర్బీ కొల్హాపూర్ మీదుగా ఐడియల్ రోడ్ బిల్డర్ కంపెనీ 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ఇందు కోసం రూ.220 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చును 30 సంవత్సరాలు టోల్ వసూలు చేయడం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. -
రేప్ సిటీ..!
ముంబై: ‘నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తాం’... ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలివి. అయితే ప్రస్తుతం నగరం ‘రేప్ సిటీ’గా మారిందని, హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగాకొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమే గత పదిసంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈ కాలంలో నగరంలో అత్యాచారాల సంఖ్య ఎనభై శాతం పెరిగింది. పదేళ్ల క్రితం 2002లో 128 మంది అత్యాచారానికి గురికాగా 2012లో 231 మంది అత్యాచారానికి గురయ్యారు. ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే 89 మందిపై అత్యాచారం జరిగింది. ఇందులో ముక్కుపచ్చలారని బాలికలు 46 మంది ఉన్నారు. ఈ గణాంకాలు చూశాక కూడా నగరాన్ని సేఫ్ సిటీ అందామా? లేక ప్రతిపక్షాలు ‘రేప్ సిటీ’గా మారిందంటూ చేస్తున్న విమర్శలను నిజమనే నమ్ముదామా? సామాజిక కార్యకర్త చేతన్ కోఠారి ఆర్టీఐ హక్కు ద్వారా ఈ వివరాలను సేకరించారు. ఉచితంగానే, కోరిన వెంటనే ఇవ్వాల్సిన గణాంకాలను ఇచ్చేందుకు కూడా పోలీసులు ఎన్నో సాకులు చెప్పారని, మూడు నెలల తర్వాత.. పదేళ్లలో జరిగిన అత్యాచారాలకు సంబంధించిన వివరాలు ఇచ్చారని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. పదేళ్లలో 80 శాతం పెరిగిన అత్యాచారాల సంఖ్య పదకొండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 95 శాతానికి ఎగబాకింది. విచిత్రమేమింటే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా శిక్ష పడుతున్నది మాత్రం కేవలం 22 శాతం మందికే. పదేళ్లలో 1,631 మంది మహిళలు, బాలికలు అత్యాచారానికి గురికాగా పోలీసులు 2,072 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో కేవలం 346 మందికి మాత్రమే కోర్టులు శిక్ష విధించాయి. ఓ అత్యాచారం చేసులో 15 సంవత్సరాలు శిక్ష పడిన కానిస్టేబుల్ చంద్రకాంత్ పవార్‌ను బాంబే హైకోర్టు విడుదల 2001లోనే చేసేసింది. డీబీ మార్గ్ స్టేషన్ పోలీసులు 46 అత్యాచారాలకు సంబంధించి 91 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా అందులో కేవలం ఇద్దరికి మాత్రమే శిక్ష పడింది. ఇక జుహూలో జరిగిన అత్యాచారానికి సంబంధించి కోర్టు కేవలం రూ. 3,000 జరిమానా విధించి, నిందితుడిని వదిలేసింది. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ముంబై పోలీసులు మహిళల కోసం ఘాట్కోపర్, దాదర్, బాంద్రా, చెంబూర్‌లో కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా అవి ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు, కానిస్టేబుళ్లలో కూడా మహిళలు ఉండాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తున్నా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. హోంమంత్రి రాజీనామాకు ఇది సమయం కాదు: సీఎం ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదు. ఇంతపెద్ద రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాను. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తున్నాను. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పదవిలోనుంచి దిగిపోండి: ఫడ్నవీస్ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ముంబై నగరం సేఫ్ సిటీ కాదు... రేప్ సిటిగా మారిందని చెప్పొచ్చు. నగరాన్ని సేఫ్ సిటీగా మారుస్తామని పాటిల్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వీటిని కాపాడడం మీ వల్ల కాకపోతే వెంటనే పదవిలోంచి దిగిపోండి. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అన్నివర్గాల ప్రజల నుంచి ఆగ్రహా జ్వాలలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అత్యాచారాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీ ఘటన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం నేర్చుకున్నట్లు కనిపించడంలేదు. కొరియర్ బాయ్‌లా పాటిల్: రాజ్‌ఠాక్రే హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు ఒక కొరియర్ బాయ్‌లా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు అక్కడికి చేరవేయడం మినహా శాంతిభద్రత లు, హోం శాఖపై దృష్టిసారించడం లేదు. హోంశాఖపై ఆయనకు అవగాహనలేదు. ఖాకీ డ్రెస్‌లో ఉన్నవారు పోస్టుమేనా లేక పోలీసా అనేది కూడ ఆయన తెలియదు. ఏమాత్రం సిగ్గు, పరువు ఉంటే వెంటనే తన పదవికీ రాజీనామా చేయాలి. రాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారిని స్వేచ్చగా వదిలేస్తే నేరాలను పూర్తిగా అరికడతారు. కాని పాటిల్ లాంటి అసమర్థులు హోంశాఖ పదవిలో ఉంటే వారేమీ చేయలేరు. గుర్తింపు పరేడ్ నిర్వహించాలి: ఉద్ధవ్‌ఠాక్రే నగరంలో ఇప్పటిదాకా చోటుచేసుకున్న అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరితో గుర్తింపు పరేడ్ నిర్వహించాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన సామూహిక అత్యాచార ఘటన ముంబైకేకాకుండా మానవత్వానికే సిగ్గుచేటన్నారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయనే విషయం ఈ ఘటనతో తేటతెల్లమైనాయని విమర్శించారు. పోలీసులకు అవసరమైన సహకారం అందించాల్సిన సమయమిదని, దీనిని రాజకీయం చేయడం తగదని ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. -
నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు
ముంబై:నగరంలో బాంబే హైకోర్టుకు చెందిన తొలి ఎలక్ట్రానిక్(ఈ) కోర్టును రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం ప్రారంభించారు. జస్టిస్ నితిన్ జందార్ ఆధ్వర్యంలో ఈ-కోర్టు పనిచేసే తీరును ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షాతో పాటు బాంబే హైకోర్టు న్యాయవాదులందరూ దగ్గరుండి వీక్షించారు. మొదటగా కంపెనీలకు సంబంధించి కేసులు విచారణకు వస్తాయని, ఆ తర్వాత ఇతర కేసులను కూడా విచారించనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. బాంబే హైకోర్టు భవనంలోని కోర్టు గది నంబర్ 47లో తొలి కేసును విచారించారు. ఈ కేసు విచారణ తీరును సెంట్రల్ హాల్లో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీక్షించారు. ఈ-కోర్టు గదిలో నితిన్ జందార్ టేబుల్‌పై ఫైల్లకు బదులుగా ఓ కంప్యూటర్ ఉంది. వ్యాజ్యదారుల ప్రయోజనార్ధం అదే కోర్టులో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్‌లో జందార్ కంప్యూటర్లో ఏ పేజీలు పరిశీలిస్తున్నారో అనేది కూడా కనిపించనుంది. ఎలక్ట్రానిక్ పత్రాల(పీడీఎఫ్, వర్డ్ ఫైల్)ను పెన్‌డ్రైవ్, సీడీలో కోర్టుకు పిటిషన్‌దారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ కోర్టు ఫీజు చెల్లింపులకు మంచి స్పందన లభించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా, సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్టులను ప్రోత్సహిస్తోంది. వచ్చే యేడాది మార్చి 31 నాటికి 969 కోర్టు కాంప్లెక్స్‌ల్లోని 2,249 కోర్టులను కంప్యూటరీకరణ చేయాలని భావిస్తోంది. -
ఐక్యతతోనే అభివృద్ధి స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం
సాక్షి, ముంబై: కలిసికట్టుగా ఉండటం వల్లే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా పేరుగాంచిన మహారాష్ట్రకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. నీటి ఎద్దడి సమస్య నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడం, సమతుల్య పారిశ్రామికాభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంచడం, బంజరు భూములను సాగుకు అనుకూలంగా మార్చడం, మెరుగైన పాలన తదితర పంచ సూత్రాల ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రాలయ ఆవరణలో పృథ్వీరాజ్ చవాన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొందామన్నారు. అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల కారణంగా తమకీ స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మనకు లభించిన ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకుందామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి పేలుడు నేపథ్యంలో నేవీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయసహకారాలు అందుతాయన్నారు. గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలిగాం ఎలాంటి ప్రాంతీయవాదాల జోలికి వెళ్లకపోవడంతోపాటు కరువు, అతివృష్టి, ద్రవ్యోల్పణం తదితర విషయాల్లో మహారాష్ట్ర ఐక్యత కనబరిచిందని సీఎం చవాన్ తెలిపారు. దీంతో జటిల సమస్యలతోపాటు గడ్డుపరిస్థితులను కూడా ఎదుర్కోగలిగిందన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో రాష్ట్రంలో కరువు పరిస్థితి ఉండేదని, అయితే ఈసారి అలాంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఇప్పటికే ఈసారి రాష్ట్రంలోని 35 జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయన్నారు. ‘వర్షాలు ఒక సంవత్సరం అధికంగా, మరో సంవత్సరం సగటు వర్షపాతం కంటే తక్కువగా కురుస్తున్నాయి. దీంతో గతేడాది వర్షాలు తక్కువగా కురవడంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రజలకు భరోసా కలిగించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకున్నాం. అయితే ఇప్పుడే అదే ప్రాంతాల్లో వరదలు సంభవించి పంటలు నాశనమయ్యాయి. ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామ’ని తెలిపారు. తాత్కాలిక మద్దతుతో పాటు శాశ్వతంగా వరదప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళిక కోసం రూ. 2,000 కోట్లు కేటాయించామని తెలిపారు. గత నాలుగేళ్లలోనే మెరుగైన అభివృద్ధి ... మునుపెన్నడూ జరగని అభివృద్ధి గత నాలుగేళ్లలో జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏకంగా రూ. ఐదు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్న రాజధాని ముంబైతోపాటు పుణే, నాగపూర్ నగరాల్లో జనాభా సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా నగరాల్లో తాగునీటితోపాటు మురుగునీటి పారుదల, ట్రాఫిక్ వ్యవస్థ మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోందని వివరించారు. సామాన్యుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మిల్లు కార్మికులకు ఇళ్లు అందించేందుకు ఏర్పాటుచేసిన నియమాలలో కొన్నింటిని రద్దు చేశామన్నారు. అలాగే మురికివాడల వాసులకు ఇళ్లను ఇవ్వడం, విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం ప్రారంభించిన ‘రాజీవ్ జీవన్‌దాయి ఆరోగ్య యోజన’ పథకాన్ని ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ద్రవ్యోల్పణ సమస్యను ఎదుర్కోవడంతోపాటు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి పరచడం, శాశ్వత ఉపాధి పథకాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. రైతులకు పంటలు సాగు చేసే విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. పంటలు, పరిశ్రమలకు కావల్సిన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. {పముఖుల జెండావిష్కరణ: భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి విషాద ఘటన బాధలోనే పలువురు ప్రముఖులు స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు. పుణేలో జాతీయ జెండాను గవర్నర్ కె.శంకర్ నారాయణన్ ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ సునీల్ ప్రభు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే, కొంకణ్ రైల్వే, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, వివిధ రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు, గృహ సముదాయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఇటీవల వరదలు సంభవించిన విదర్భ ప్రాంతంలో అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన కొంత మంది తమ సొంత ఖర్చులతో మాత్రం వేడుకలను నిర్వహించుకున్నారు. ముంబైలో భారీ భద్రత: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతతో పహారా కాశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తినీ తనిఖీ చేశారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహించారు.