టోల్ వసూలుపై ఆగ్రహ జ్వాల!
సాక్షి ముంబై: టోల్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొల్హాపూర్‌లో గతవారం ప్రారంభించిన ‘కరో యా మరో’ ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టోల్ వసూలును నిలిపివేసిన ఐడియల్ రోడ్ బిల్డర్(ఐఆర్‌బీ) కంపెనీ శనివారం రాత్రి మళ్లీ వసూళ్లను పునఃప్రారంభించడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుభికింది. ఫులేవాడి, శిరోలీ టోల్‌నాకాలపై వందలమంది ఆందోళనకారులు దాడికి దిగారు. రెండు క్యాబిన్లకు నిప్పుపెట్టడంతోపాటు అందులోని కంప్యూటర్లను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ‘కరో యా మరో’ ఆందోళన ఆరు రోజులుగా శాంతియుతంగానే కొనసాగుతున్నా ఐఆర్‌బీ వైఖరితోనే ఆందోళనకారులు ఆగ్రహానికి గురయ్యారని సామాజిక కార్యకర్త ఎన్‌డీ పాటిల్ తెలిపారు. శనివారం ఆందోళనలో ఆయన కూడా పాల్గొన్నారు.
పైకి టోల్ వసూలు చేయవద్దని చెబుతూనే లోలోపల వసూలు చేసుకోవాల్సిందిగా కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్, హోంశాఖ సహాయమంత్రి సతేజ్ పాటిల్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు మంత్రులు టోల్ వసూలును నిలిపివేయాలని ఐఆర్‌బీని ఆదేశించారు. టోల్ డబ్బును కార్పొరేషన్ చెల్లిస్తుందని కూడా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సదరు కంపెనీ టోల్ వసూలును నిలిపివేసింది. దీంతో కొల్హాపూర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అయితే అదే రోజు రాత్రి నుంచి కంపెనీ టోల్ వసూలు చేయడం పున:ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే ఆదివారం ఉదయం ఫులేవాడి, శిరోలి టోల్‌నాకాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు టోల్ నాకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడున్న సీసీవీటీ కెమెరాలు, భద్రతా యంత్రాలు, క్యాబిన్‌లు, ఇతర వస్తువులన్నంటినీ ధ్వంసం చేసి తీవ్ర నిరసన తెలిపారు. శిరోలిటోల్ నాకాను ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మంటల్లో అక్కడున్న భారీ జనరేటర్ దగ్ధమైంది. ఈ ఘటనతో ఐఆర్‌బీకి తీవ్ర నష్టం వాటిల్లింది.
సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నియంత్రించలేకపోయారు. పోలీసులు వారిస్తున్నా ఆందోళనకారులు ధ్వంసకాండను ఆపలేదు. లాఠీచార్జీకి దిగితే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
బంద్‌కు పిలుపునిచ్చిన శివసేన..
రాష్ట్ర ప్రభుత్వం టోల్ నాకాను మూసి వేసే విషయంపై కొల్హాపూర్ వాసులను మోసం చేసిందని స్థానిక శివసేన నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా టోల్ నాకాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులకు శివసైనికులు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తూ సోమవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.
రూ.220 కోట్లు ఖర్చుచేసిన ఐఆర్‌బీ
కొల్హాపూర్ మీదుగా ఐడియల్ రోడ్ బిల్డర్ కంపెనీ 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ఇందు కోసం రూ.220 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చును 30 సంవత్సరాలు టోల్ వసూలు చేయడం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.