Shiv Sena activists
-
ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ముంబై: మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో..ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. ఆపై ఎమ్మెల్యే రవి రానా, ఆయన భార్య ఎంపీ నవనీత్ కౌర్‌లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చదవండి👉🏾: బీజేపీ అండతో నవనీత్ కౌర్ రెచ్చిపోతోంది -
రాంపూర్ జిల్లాలో శివసేన కార్యకర్త దారుణ హత్య
రాంపూర్ : శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లోని జ్వాలానగర్‌లో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే శర్మను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. శర్మ నిన్న రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. కాగా శర్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. (పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య) -
18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు
సాక్షి, ముంబై: తన ప్రియతమ నాయకుడు గెలిచాడని బాపు జావీర్ అనే కార్యకర్త ఏకంగా 18 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేపట్టి మొక్కు తీర్చుకున్నారు. షోలాపూర్ జిల్లా సాంగోలా అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి శహాజీ బాపు పాటిల్ విజయం సాధించారు. పాటిల్ విజయం కోసం సాంగోలా బాపు జావీర్ తనవంతు కృషి చేశారు. పాటిల్ విజయం సాధిస్తే స్వగ్రామం సుపాలే నుంచి పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు చేసి విఠలేషున్ని దర్శించుకుంటానని జావీర్ మొక్కుకున్నాడు. పాటిల్ గెల్చిన విషయం తెల్సి.. జావీర్ సుపాలి గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లాడు. ఎండలో తారు రోడ్డుపై, మట్ట రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు పెట్టిన దృశ్యం వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. -
పాక్‌పై ప్రతీకారానికి మానవబాంబులా...
సూరత్ : ఉడి ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర చిచ్చు చెలరేగింది. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోకుండా కేంద్రప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టుకుంటుందని విమర్శించిన శివసేన, పాకిస్తాన్‌ను నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్‌ను నాశనం చేయడానికి తమ కార్యకర్తలు మానవబాంబుల మారతారని ప్రకటిస్తూ.. దీనికి సంబంధించిన ఓ మెమోరాండంను జిల్లా కలెక్టర్‌కు సమర్పించింది. ఈ మెమోరాండంలో సూరత్‌కు చెందిన 28 శివసేన కార్యకర్తలు, పాకిస్తాన్ అంతుచూడటానికి మానవబాంబుల మారతామని గుజరాత్‌కు ఆఫర్ చేసింది. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగితే, గాయాలపాలైన జవాన్లకు తాము అవయవాలు దానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు శివసేన కార్యకర్తలు ఆ మెమోరాండంలో వెల్లడించారు. సూరత్ శివసేన అధ్యక్షుడు అరుణ్ కలాల్ ఈ వార్తను ధృవీకరించారు. 28 శివసైనికులు మానవ బాంబులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారని వారి సంతకాలతో కూడా ఓ మెమోరాండంను సోమవారం కలెక్టర్‌కు సమర్పించారు. గత రెండేళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రపూరిత చర్యలకు భారత్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవడం లేదని, ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్‌కు ఇండియా ఎలాంటి శిక్ష విధించబోతుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తుందని శివసేన పేర్కొంది. ఉడి ఉగ్రదాడి తర్వాత చాలా దేశాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యాయని తెలిపింది. భారత్ పటిష్టతత్వాన్ని కేవలం ఒక్క దేశమే దెబ్బతీయలేదని, తగిన జవాబు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది. -
నా జన్మదిన వేడుకలు జరపొద్దు
♦ పార్టీ కార్యకర్తలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విజ్ఙప్తి ♦ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టొద్దు ♦ వాటికయ్యే ఖర్చుతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండి సాక్షి, ముంబై : తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు విజ్ఙప్తి చేశారు. ప్రతిఏటా జూలై 27న జరిగే ఉద్ధవ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు తరలివస్తారు. అయితే ఈ సారి రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా తదితర రీజియన్లలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరారు. ‘గతేడాది రైతులకు పంట చేతికందలేదు. ఈ సారి విత్తనాలు మళ్లీ నాటాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీతో రైతుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి సంకట సమయంలో నేను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సబబు కాదు’ అని కార్యకర్తలు, అభిమానులకు ఉద్ధవ్ సందేశాన్నిచ్చారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం ఖర్చు చేసే డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేయాలని కోరారు. -
టోల్ వసూలుపై ఆగ్రహ జ్వాల!
సాక్షి ముంబై: టోల్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొల్హాపూర్‌లో గతవారం ప్రారంభించిన ‘కరో యా మరో’ ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టోల్ వసూలును నిలిపివేసిన ఐడియల్ రోడ్ బిల్డర్(ఐఆర్బీ) కంపెనీ శనివారం రాత్రి మళ్లీ వసూళ్లను పునఃప్రారంభించడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుభికింది. ఫులేవాడి, శిరోలీ టోల్‌నాకాలపై వందలమంది ఆందోళనకారులు దాడికి దిగారు. రెండు క్యాబిన్లకు నిప్పుపెట్టడంతోపాటు అందులోని కంప్యూటర్లను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ‘కరో యా మరో’ ఆందోళన ఆరు రోజులుగా శాంతియుతంగానే కొనసాగుతున్నా ఐఆర్బీ వైఖరితోనే ఆందోళనకారులు ఆగ్రహానికి గురయ్యారని సామాజిక కార్యకర్త ఎన్డీ పాటిల్ తెలిపారు. శనివారం ఆందోళనలో ఆయన కూడా పాల్గొన్నారు. పైకి టోల్ వసూలు చేయవద్దని చెబుతూనే లోలోపల వసూలు చేసుకోవాల్సిందిగా కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్, హోంశాఖ సహాయమంత్రి సతేజ్ పాటిల్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు మంత్రులు టోల్ వసూలును నిలిపివేయాలని ఐఆర్బీని ఆదేశించారు. టోల్ డబ్బును కార్పొరేషన్ చెల్లిస్తుందని కూడా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సదరు కంపెనీ టోల్ వసూలును నిలిపివేసింది. దీంతో కొల్హాపూర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అయితే అదే రోజు రాత్రి నుంచి కంపెనీ టోల్ వసూలు చేయడం పున:ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే ఆదివారం ఉదయం ఫులేవాడి, శిరోలి టోల్‌నాకాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు టోల్ నాకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడున్న సీసీవీటీ కెమెరాలు, భద్రతా యంత్రాలు, క్యాబిన్లు, ఇతర వస్తువులన్నంటినీ ధ్వంసం చేసి తీవ్ర నిరసన తెలిపారు. శిరోలిటోల్ నాకాను ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మంటల్లో అక్కడున్న భారీ జనరేటర్ దగ్ధమైంది. ఈ ఘటనతో ఐఆర్బీకి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నియంత్రించలేకపోయారు. పోలీసులు వారిస్తున్నా ఆందోళనకారులు ధ్వంసకాండను ఆపలేదు. లాఠీచార్జీకి దిగితే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బంద్‌కు పిలుపునిచ్చిన శివసేన.. రాష్ట్ర ప్రభుత్వం టోల్ నాకాను మూసి వేసే విషయంపై కొల్హాపూర్ వాసులను మోసం చేసిందని స్థానిక శివసేన నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా టోల్ నాకాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులకు శివసైనికులు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తూ సోమవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. రూ.220 కోట్లు ఖర్చుచేసిన ఐఆర్బీ కొల్హాపూర్ మీదుగా ఐడియల్ రోడ్ బిల్డర్ కంపెనీ 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ఇందు కోసం రూ.220 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చును 30 సంవత్సరాలు టోల్ వసూలు చేయడం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.