ముంబై: మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో..ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. ఆపై ఎమ్మెల్యే రవి రానా, ఆయన భార్య ఎంపీ నవనీత్ కౌర్‌లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
చదవండి👉🏾: బీజేపీ అండతో నవనీత్ కౌర్ రెచ్చిపోతోంది
Comments
Please login to add a commentAdd a comment