సాక్షి, ముంబై: కలిసికట్టుగా ఉండటం వల్లే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా పేరుగాంచిన మహారాష్ట్రకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. నీటి ఎద్దడి సమస్య నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడం, సమతుల్య పారిశ్రామికాభివృద్ధి, విద్యా ప్రమాణాలు పెంచడం, బంజరు భూములను సాగుకు అనుకూలంగా మార్చడం, మెరుగైన పాలన తదితర పంచ సూత్రాల ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రాలయ ఆవరణలో పృథ్వీరాజ్ చవాన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొందామన్నారు. అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల కారణంగా తమకీ స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మనకు లభించిన ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకుందామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి పేలుడు నేపథ్యంలో నేవీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయసహకారాలు అందుతాయన్నారు.
గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలిగాం
ఎలాంటి ప్రాంతీయవాదాల జోలికి వెళ్లకపోవడంతోపాటు కరువు, అతివృష్టి, ద్రవ్యోల్పణం తదితర విషయాల్లో మహారాష్ట్ర ఐక్యత కనబరిచిందని సీఎం చవాన్ తెలిపారు. దీంతో జటిల సమస్యలతోపాటు గడ్డుపరిస్థితులను కూడా ఎదుర్కోగలిగిందన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో రాష్ట్రంలో కరువు పరిస్థితి ఉండేదని, అయితే ఈసారి అలాంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఇప్పటికే ఈసారి రాష్ట్రంలోని 35 జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయన్నారు. ‘వర్షాలు ఒక సంవత్సరం అధికంగా, మరో సంవత్సరం సగటు వర్షపాతం కంటే తక్కువగా కురుస్తున్నాయి.
దీంతో గతేడాది వర్షాలు తక్కువగా కురవడంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రజలకు భరోసా కలిగించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకున్నాం. అయితే ఇప్పుడే అదే ప్రాంతాల్లో వరదలు సంభవించి పంటలు నాశనమయ్యాయి. ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామ’ని తెలిపారు. తాత్కాలిక మద్దతుతో పాటు శాశ్వతంగా వరదప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళిక కోసం రూ. 2,000 కోట్లు కేటాయించామని తెలిపారు.
గత నాలుగేళ్లలోనే మెరుగైన అభివృద్ధి ...
మునుపెన్నడూ జరగని అభివృద్ధి గత నాలుగేళ్లలో జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏకంగా రూ. ఐదు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్న రాజధాని ముంబైతోపాటు పుణే, నాగపూర్ నగరాల్లో జనాభా సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా నగరాల్లో తాగునీటితోపాటు మురుగునీటి పారుదల, ట్రాఫిక్ వ్యవస్థ మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోందని వివరించారు. సామాన్యుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మిల్లు కార్మికులకు ఇళ్లు అందించేందుకు ఏర్పాటుచేసిన నియమాలలో కొన్నింటిని రద్దు చేశామన్నారు.
అలాగే మురికివాడల వాసులకు ఇళ్లను ఇవ్వడం, విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం ప్రారంభించిన ‘రాజీవ్ జీవన్‌దాయి ఆరోగ్య యోజన’ పథకాన్ని ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ద్రవ్యోల్పణ సమస్యను ఎదుర్కోవడంతోపాటు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి పరచడం, శాశ్వత ఉపాధి పథకాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. రైతులకు పంటలు సాగు చేసే విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. పంటలు, పరిశ్రమలకు కావల్సిన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
{పముఖుల జెండావిష్కరణ: భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి విషాద ఘటన బాధలోనే పలువురు ప్రముఖులు స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు. పుణేలో జాతీయ జెండాను గవర్నర్ కె.శంకర్ నారాయణన్ ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ సునీల్ ప్రభు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే, కొంకణ్ రైల్వే, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, వివిధ రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు, గృహ సముదాయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఇటీవల వరదలు సంభవించిన విదర్భ ప్రాంతంలో అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన కొంత మంది తమ సొంత ఖర్చులతో మాత్రం వేడుకలను నిర్వహించుకున్నారు.
ముంబైలో భారీ భద్రత: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతతో పహారా కాశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తినీ తనిఖీ చేశారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ కూడా నిర్వహించారు.
ఐక్యతతోనే అభివృద్ధి స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం
Published Fri, Aug 16 2013 2:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement