కేంద్రం ‘పవర్’గేమ్..!
►ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపణ
►విద్యుత్ సమస్యకు కేంద్రమే కారణం
►మోడీ వంద రోజుల పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు
►‘బ్లడ్ ఆన్ కాల్’ను కాపీ కొట్టారు..
ముంబై: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజాద్ మైదాన్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చవాన్ మాట్లాడుతూ.. కేంద్ర గ్రిడ్‌ల నుంచి విద్యుత్ పంపిణీలో కేంద్రం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానన్నారు.
కేంద్ర గ్రిడ్‌ల నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించకపోతే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజలకు ఎటువంటి పవర్ కట్‌లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ 100 రోజుల పాలనపై ఆయనమాట్లాడుతూ.. యూపీఏ సర్కార్ సమయంలో పూర్తయిన, ప్రారంభమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప ఆ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి తీసుకోవడంలోనూ విఫలమైందని ఆరోపించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒడంబడిక ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో మన కేంద్రం మెతకవైఖరినే అవలంభిస్తుండటం శోచనీయమన్నారు.
ఇదిలాఉంచితే.. కేంద్ర, రాష్ట్రాల నడుమ సత్సంబంధాలను కొనసాగించడంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రధానితో పాటు పాల్గొన్న ముఖ్యమంత్రిని మాట్లాడకుండా అడ్డుకుని అవమానించడం వంటి ఘటనలను మహారాష్ట్ర ప్రజలు ఇకపై సహించరని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, మోడీ ప్రభుత్వం ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సురేష్ శెట్టికి ఒక మెసేజ్ వచ్చిందని, దాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని చవాన్ తెలిపారు. వాస్తవానికి, తమ ప్రభుత్వం ఇప్పటికే ఆ పథకాన్ని రాష్ర్టంలో సామాన్య ప్రజల సంక్షేమార్థం ప్రారంభించిందని చెప్పారు. అయితే కేంద్రం ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తే మంచిదే అన్నారు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం తమ ప్రభుత్వానికి వస్తుందని చవాన్ పేర్కొన్నారు.
బీజేపీకి అధికారం అప్పగించి తాము తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్ట కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించి, డీజిల్ ధర పెంచిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఏమాత్రం కృషిచేయడంలేదని విమర్శించారు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రలో విద్యుత్ సమస్యలకు కేంద్రం తీరే కారణమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. నారాయణ్‌రాణే, అశోక్ చవాన్ మాట్లాడుతూ కేంద్రం మహారాష్ర్టనుంచి విదర్భను విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.