Azad Maidan
-
రైతు మహాధర్నా.. తలొగ్గిన సర్కార్
-
రైతు ‘మహా’ విజయం
సాక్షి, ముంబై: మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ ‘రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించాం. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలి. వారికి భూములను బదిలీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. డిమాండ్లలోని దాదాపు అన్నింటినీ నిర్ణీత సమయంలోపు మేం నెరవేరుస్తాం’ అని చెప్పారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో అలసి సొలసిన రైతన్నలు ఆందోళన విరమించి ఇక తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. రైతులను ముంబై నుంచి ఇళ్లకు తిరిగి పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ముంబై నుంచి నాసిక్ మీదుగా భుసావల్ వరకు రైతుల కోసం 2 రైళ్లను నడపటంతోపాటు ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు జనరల్ బోగీలను కూడా తగిలిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అదనంగా రైతు రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం తాము నెరవేర్చలేమని సీఎం చెప్పారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ రుణాలు తీసుకున్నప్పుడు వారిలో ఎవరి పేరున అప్పు తక్కువగా ఉంటే ఆ రుణం మాత్రమే మాఫీ అయిందనీ, దీన్ని సరిదిద్దడానికి ఇంకా ఎంత ఎక్కువ వ్యయం అవుతుందో అంచనా వేయడానికి ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సోమవారం ముంబైలోని ఆజాద్ మైదానంలో సమావేశమైన రైతులు ఒకటే గమ్యం.. ఒకటే గమనం నడిచి నడిచి పాదాలకు పుండ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు. మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకుదెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. నాసిక్ నుంచి ముంబై వరకు మొత్తం 180 కిలో మీటర్లు సాగిన ఈ రైతు పాదయాత్రలో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు.. మహిళా రైతులు కూడా అన్నింటినీ పంటి బిగువున భరించారు. అలుపూసొలుపూ లేకుండా దాదాపు 35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కిలో మీటర్లు నడిచారు. మహారాష్ట్ర సర్కార్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. ఒక్కో ఊరు దాటుతుంటే ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు. మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. తొలి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్‌లో రోజు గడిచేకొద్దీ రైతుల సంఖ్య పెరిగి ముంబైకొచ్చేసరికి 50 వేలు దాటేసింది. కనీస సదుపాయాలు లేకున్నా.. డెబ్బయి ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు కూడా ఈ పాదయాత్రలో ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా వారు పట్టించుకోలేదు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసుల మూటలను మోస్తూనే నడక సాగించారు. రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండిపోతున్న ఎండలో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలూ తలెత్తాయి. ‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలి? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం’ అని 74 ఏళ్ల వయసున్న శంకర్ గావిట్ అనే రైతు చెప్పారు. రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. అంతటి కష్టంలోనూ రైతులు ముంబై విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ఆదివారం సాయంత్రానికల్లా ముంబై శివార్లకు చేరుకున్న వారు.. తమ పాదయాత్రతో సోమవారం టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే సదుద్దేశంతో ఆదివారం రాత్రి కూడా నడక సాగించి సూర్యుడు ఉదయించేలోపే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. డబ్బావాలాల ఆహారం.. స్థానికుల ఔదార్యం ఎన్నో బాధలను భరించి అన్ని కిలోమీటర్లు నడిచొచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతన్నల ఆకలిదప్పులు తీర్చారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ నెరవేర్చారు. నగరంలో పాదయాత్ర సాగుతుండగా అర్ధరాత్రే అనేక మంది ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి రైతులకు అందించారు. చెప్పులు లేని వారికి కొత్తవి ఇచ్చారు. పాదాల గాయాలకు వైద్య విద్యార్థులు చికిత్స చేశారు. రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్ దిగి రావల్సి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఆజాద్ మైదానానికి చేరుకుంటున్న రైతులు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రైతు మహాధర్నా.. తలొగ్గిన సర్కార్
సాక్షి, ముంబై : దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో మహారాష్ట్రలో రైతు ధర్నా కొనసాగుతోంది. ఈ ఉదయం ఆజాద్ మైదానానికి ర్యాలీగా చేరుకున్న సుమారు 40 వేల మంది రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైతులను బుజ్జగించేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. డిమాండ్ల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చర్చలకు సిద్ధమయ్యారు. రైతు బృందాల ప్రతినిధులతో ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి కల్లా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సీఎంవో కార్యాలయం చెబుతోంది. మరోవైపు చర్చల ఫలితం ప్రతికూలంగా వస్తే తాము అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఎర్ర సంద్రంగా ఆజాద్ మైదానం... ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) నేతృత్వంలో ర్యాలీగా బయలుదేరిన సుమారు 50వేల మంది రైతులు ముంబైకి చేరుకున్నారు. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సోమవారం అసెంబ్లీని ముట్టడి చెయ్యాలన్నదే ఈ యాత్ర ఉద్దేశం. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆకలిదప్పులు లెక్కచేయక అకుంఠిత దీక్షతో పాదయాత్రను కొనసాగించారు. నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర.. రోజుకు పాతిక కిలోమీటర్లు చొప్పున సాగి 180 కిలోమీటర్ల దూరంలోని రాజధానిలో ఉన్న ఆజాద్ మైదానానికి చేరుకుంది. ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి -
కేంద్రం ‘పవర్’గేమ్..!
►ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపణ ►విద్యుత్ సమస్యకు కేంద్రమే కారణం ►మోడీ వంద రోజుల పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు ►‘బ్లడ్ ఆన్ కాల్’ను కాపీ కొట్టారు.. ముంబై: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ముఖ్యమంతి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజాద్ మైదాన్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చవాన్ మాట్లాడుతూ.. కేంద్ర గ్రిడ్ల నుంచి విద్యుత్ పంపిణీలో కేంద్రం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానన్నారు. కేంద్ర గ్రిడ్ల నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించకపోతే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజలకు ఎటువంటి పవర్ కట్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ సర్కార్ 100 రోజుల పాలనపై ఆయనమాట్లాడుతూ.. యూపీఏ సర్కార్ సమయంలో పూర్తయిన, ప్రారంభమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప ఆ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి తీసుకోవడంలోనూ విఫలమైందని ఆరోపించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒడంబడిక ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో మన కేంద్రం మెతకవైఖరినే అవలంభిస్తుండటం శోచనీయమన్నారు. ఇదిలాఉంచితే.. కేంద్ర, రాష్ట్రాల నడుమ సత్సంబంధాలను కొనసాగించడంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రధానితో పాటు పాల్గొన్న ముఖ్యమంత్రిని మాట్లాడకుండా అడ్డుకుని అవమానించడం వంటి ఘటనలను మహారాష్ట్ర ప్రజలు ఇకపై సహించరని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మోడీ ప్రభుత్వం ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సురేష్ శెట్టికి ఒక మెసేజ్ వచ్చిందని, దాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని చవాన్ తెలిపారు. వాస్తవానికి, తమ ప్రభుత్వం ఇప్పటికే ఆ పథకాన్ని రాష్ర్టంలో సామాన్య ప్రజల సంక్షేమార్థం ప్రారంభించిందని చెప్పారు. అయితే కేంద్రం ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తే మంచిదే అన్నారు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం తమ ప్రభుత్వానికి వస్తుందని చవాన్ పేర్కొన్నారు. బీజేపీకి అధికారం అప్పగించి తాము తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్ట కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించి, డీజిల్ ధర పెంచిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఏమాత్రం కృషిచేయడంలేదని విమర్శించారు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రలో విద్యుత్ సమస్యలకు కేంద్రం తీరే కారణమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. నారాయణ్‌రాణే, అశోక్ చవాన్ మాట్లాడుతూ కేంద్రం మహారాష్ర్టనుంచి విదర్భను విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు. -
నేడు ఆజాద్ మైదాన్‌లో నిరసన
సాక్షి, ముంబై: నగరంలో హత్యకు గురైన తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు ప్రజలు మంగళవారం నిరసనకు దిగనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాదిరెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కేసును త్వరితగతిన విచారించి నిందితులకు శిక్ష వేయాలన్నారు. భారీగా తెలుగు ప్రజలు పాల్గొనాలని కోరారు. ఘననివాళి పింప్రి, న్యూస్‌లైన్: పుణే సాక్షి మీడియా బృందం దేహూరోడ్డులోని ‘ట్రైజీసస్ మినిస్ట్రీస్’ తెలుగు చర్చిలో ఆదివారం సాయంత్రం ఘననివాళి అర్పించారు. చర్చి పాస్టర్ జాకప్ వీరప్ప సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగువారి కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని సూచించారు. ఏదైనా ఘటన జరిగితే రాష్ర్టంలోని తెలుగువారంతా కుల మతాలకు అతీతంగా ఏకం కావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు సమాజ సభ్యులు శివప్రసాద్, దేహూరోడ్ తెలుగు పాఠశాల ఉపాధ్యాయులు వీరేష్, రమాంజనేయులు, భీంసింగ్ తల్వాది,టీసీఎస్ కంపెనీకి చెందిన ఉద్యోగులు లక్ష్మీ సుధీర్, గంగా తల్వాది, దీపా, ప్రియాంక తదితరులు హాజరయ్యారు. -
గూడు కోసం పోరు
సాక్షి, ముంబై: ఇళ్ల కోసం మిల్లు కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆజాద్‌మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి 25 మంది అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన విరమించేది లేదని వీరు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి (ఎమ్మెమ్మార్డీయే) చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు అందజేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీని ఆయన నిలబెట్టుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, మాడా అధికారులతో భేటీ అయి, వారి వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని మాజీ కార్మికుడు గన్నారపు శంకర్ ఆరోపించారు. అందుకే బుధవారం నుంచి రెండోసారి ఆందోళనకు దిగాల్సివచ్చిందని ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’ ఉపాధ్యక్షుడు భజరంగ్ చవాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు బుధవారం నుంచి 25 మంది ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మిగతా కార్మికులు కూడా వీరికి మద్దతుగా వేర్వేరు పద్ధతుల్లో నిరసనలు తెలుపనున్నట్టు చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్నవారిలో మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్ పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షుడు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే, నివృత్తి దేశాయి, అన్నా శిర్సేకర్ తదితరులు మిల్లు కార్మికులకు మార్గదర్శనం చేసి ఆందోళన గురించి తెలియపరిచారు. పరేల్‌లో నేడు రాస్తారోకో... ఆందోళనను మరింత తీవ్రం చేయాలన్న ఉద్దేశంతో గురువారం ఉదయం పరేల్‌లోని దాల్వీ బిల్డింగ్ ఎదుట రాస్తారోకో నిర్వహించనున్నట్టు భజరంగ్ చవాన్ తెలిపారు. రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో జరగనుందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తొందరగా స్పందించకుంటే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. జాప్యమే కారణం అర్హులైన మిల్లు కార్మికులకు తక్కువ ధరకు ఇళ్లు నిర్మించేందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ముందుకు వచ్చింది. ఇళ్ల నిర్మాణానికి నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్‌కు(ఎన్టీసీ) చెందిన తొమ్మిది మిల్లులుసహా మూడు ప్రైవేటు మిల్లులు ఇలా మొత్తం 12 మిల్లుల స్థలాలను మాడా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇళ్ల ధరలు ఎలా నిర్ణయించాలనే అంశం ఎటూ తేలకపోవడంతో నిర్మాణ పనులు పెండింగులో పడ్డాయి. దీంతో మిల్లు కార్మికుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో వారు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. సెంచరీ, ప్రకాశ్ కాటన్, రూబీ ఇలా మూడు ప్రైవేటు మిల్లులతోపాటు తొమ్మిది ఎన్టీసీ మిల్లుల స్థలాలు మాడా అధీనంలో ఉన్నాయి. సెంచరీ మిల్లు స్థలంలో 2,500, ప్రకాశ్ కాట న్మిల్లు స్థలంలో 1,200, రూబీ మిల్లు స్థలంలో 500 ఇళ్లు నిర్మించవచ్చు. మిగతా తొమ్మిది మిల్లు స్థలాల్లో 2,800 ఇళ్లు నిర్మించేందుకు వీలుందని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మించే వాటిలోనూ 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇవ్వనున్నట్టు సీఎం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ‘నిబంధనల్లో మార్పులు చేయడానికి మరో నెల సమయం కావాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆదేశాలు జారీచేస్తామని చవాన్ హామీ ఇచ్చారు. ఇంత వరకు ఆయన ఇచ్చిన హామీ నెరవేరనేలేదు’ అని నాయకులు వివరించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరించారు.