కిసాన్ సభకు ర్యాలీగా వచ్చిన రైతులు
సాక్షి, ముంబై : దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో మహారాష్ట్రలో రైతు ధర్నా కొనసాగుతోంది. ఈ ఉదయం ఆజాద్ మైదానానికి ర్యాలీగా చేరుకున్న సుమారు 40 వేల మంది రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైతులను బుజ్జగించేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
డిమాండ్ల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చర్చలకు సిద్ధమయ్యారు. రైతు బృందాల ప్రతినిధులతో ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి కల్లా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సీఎంవో కార్యాలయం చెబుతోంది. మరోవైపు చర్చల ఫలితం ప్రతికూలంగా వస్తే తాము అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.
ఎర్ర సంద్రంగా ఆజాద్ మైదానం...
ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) నేతృత్వంలో ర్యాలీగా బయలుదేరిన సుమారు 50వేల మంది రైతులు ముంబైకి చేరుకున్నారు. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సోమవారం అసెంబ్లీని ముట్టడి చెయ్యాలన్నదే ఈ యాత్ర ఉద్దేశం. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆకలిదప్పులు లెక్కచేయక అకుంఠిత దీక్షతో పాదయాత్రను కొనసాగించారు. నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర.. రోజుకు పాతిక కిలోమీటర్లు చొప్పున సాగి 180 కిలోమీటర్ల దూరంలోని రాజధానిలో ఉన్న ఆజాద్ మైదానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment