
ముంబై: సంతోషంగా, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులతో సంతోషంగా జరుగుతున్న ఫెర్‌వెల్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటనలో బాధిత విద్యార్థినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.
మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ విషాదంగా ముగిసింది. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ (20) వేదికపై ప్రసంగిస్తున్నారు. అప్పటివరకు విద్యార్థులు, లెక్చరర్ల గురించి మాట్లాడారు. మధ్య మధ్యలో తన ప్రసంగంతో అటు విద్యార్థుల్ని, ఇటు లెక్చరర్లను నవ్వించారు.
At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech 😢😢https://t.co/O4Rx9pmtnp#suddendeath https://t.co/gPlhM9qaGh pic.twitter.com/fcCdm6PWFX
— Dee (@DeeEternalOpt) April 5, 2025
అయితే అప్పటి వరకు అందరిని నవ్వించి వర్ష మాట్లాడుతూ కుప్పకూలారు. ఫెర్‌వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం పరండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థిని వర్ష మరణించినట్లు ప్రకటించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్ష ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మందులు కూడా వాడటం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణంగా ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (సడెన్ కార్డియాక్ అరెస్ట్) రావడం వల్ల బ్రెయిన్ డెత్ వచ్చి మృతి చెందిందని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె స్మృతిగా ఒక్కరోజు సెలవు ప్రకటించారు.