BSC
-
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్‌గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్‌లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్‌లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
TS Election 2023: ‘కోడ్’కు ముందే స్పీడ్ ! మాటలదాడితో నువ్వా.. నేనా? అంటూ పోటీ..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికల సంఘం పర్యటన మొదలైన దరిమిలా అధికార పార్టీ కూడా అభివృద్ధి పనుల శంకుస్థాపనల స్పీడ్ పెంచింది. అవే వేదికలపై ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తమను మరోసారి గెలిపిస్తే.. ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాటలదాడి చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు అంతా అభివృద్ధి పనుల స్పీడ్ పెంచారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులు, పెండింగ్ పనులు పూర్తిచేయడం, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు జాబితా ఎంపిక, పింఛన్లు పంపిణీ, రోడ్లు, మున్సిపల్ వర్క్స్ తదితరాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏదిచేసినా ఈనెల 6– నుంచి 14 తేదీలోగా పూర్తిచేయాలన్న పార్టీ అధిష్టానం సూచనలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. 60 ఏళ్లలో పాత జిల్లాలో జరిగిన అభివృద్ధి, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తాము దేశంలో ముందున్నామని వివరిస్తున్నారు. 13 నియోజకవర్గాల్లో ప్రతీరోజూ చేరికల పర్వంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దపల్లి, జగిత్యాల, రామగుండం, ధర్మపురిలో అభివృద్ధి పనులను ప్రారంభించి ఎన్నికల సమరశంఖం పూరించారు. మినీ బహిరంగసభలతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేల ప్రైవేట్ కార్యాలయాలు సిద్ధం.. ఎన్నికలకు ముందస్తు వ్యూహంతో వచ్చిన భారత రాష్ట సమితి(బీఆర్ఎస్) ముందే అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి మరునాటి నుంచే అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యలో జమిలి ఎన్నికల ప్రస్తావనతో కాస్త విరామం ప్రకటించారు. ఇటీవల జమిలి లేదని తేలడంతో తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వేదికలపై నుంచి తమ అభివృద్ధి వివరిస్తూనే.. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు విడుదలవనున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇప్పటికే అందరికీ అందుబాటులో ఉండేలా వారంతా ప్రైవేట్ కార్యాలయాలను కిరాయికి తీసుకోవడం విశేషం. మరోవైపు.. సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా ఆర్మీలను నియమించుకుంటున్నారు. పర్వదినాలు, పండుగలు, పరామర్శలు.. ఇలా సందర్భమేదైనా ముందుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలో రాని స్పష్టత.. ఉమ్మడి జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నుంచి 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు అదేసంఖ్యలో బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇంతవరకూ రెండుపార్టీలు ఒక్కఅభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. పాత కరీంనగర్ జిల్లాలో ఒకటిరెండుచోట్ల మినహా అన్నిస్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారన్న ప్రచారం ఉన్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇదేరకమైన అనిశ్చితి నెలకొంది. దీన్నిఅవకాశంగా తీసుకున్న బీఆర్ఎస్.. మరింత దూకుడు పెంచుతోంది. 11మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రతీరోజు సుడిగాలి పర్యటనలు చేస్తూ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఎస్పీ జాబితా విడుదల.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఎస్పీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ స్థానాలు, ఒకటి జనరల్ కావడం విశేషం. నిశాని రామచందర్ –మానకొండూరు, చొప్పదండి– కొంకటి శేఖర్, ధర్మపురి– నక్కా విజయ్‌కుమార్, పెద్దపల్లి–దాసరి ఉష పేర్లు ఖరారు చేసింది. ఇందులో అభ్యర్థులంతా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీచేస్తామని తాజాగా ప్రకటించిన జనసేన పార్టీ.. పాత కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలపై కన్నేసింది. రామగుండం, హుస్నాబాద్, జగిత్యాల, మంథని స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించడం గమనార్హం. -
బీఎస్సీ హెల్త్ సైన్సెస్ ఫీజు రూ.15వేలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెట్టబోయే బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేళ్ల ఈ హెల్త్‌సైన్సెస్ కోర్సులను గాంధీ, ఉస్మానియా సహా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెడుతున్నారు. కొత్త కోర్సులు కావడంతో వీటికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలేజీలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు రూ. 6వేలు కాగా, విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే మూడేళ్లకు రూ.45 వేల ఫీజు ఉండొచ్చు. మరో ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. చివరి ఏడాదిలో విద్యార్థులకే స్కాలర్షిప్ ఇస్తారు. ఫీజు వివరాలను త్వరలో వెల్లడిస్తామని వర్సిటీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పదో తరగతి ఆధారంగా పారామెడికల్ కోర్సులు ఉండగా, బీఎస్సీ డిగ్రీతో మొదటిసారిగా వీటిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల మరింత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సాంకేతిక నిపుణులు తయారుకానున్నారు. దీనివల్ల వైద్య సేవలు మరింత పటిష్టం కానున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థులకు ప్రైవేట్ రంగంలోనూ మంచి ఆఫర్లు ఉంటాయి. అలాగే విదేశాల్లోనూ డిమాండ్ ఉంటుందని కాళోజీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో మున్ముందు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ కాలేజీల్లోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కోటా అభ్యర్థులు లేకుంటే ఓపెన్‌లోకి.. ►మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వు చేశారు. ఈ కేటగిరీ అభ్యర్థులు లేకుంటే రిజర్వ్డ్ సీట్లు ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. వాటిని మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. ►29 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తారు. అర్హతగల అభ్యర్థులు లేకుంటే, మిగిలిన సీట్లను తదు పరి సబ్–గ్రూప్ అభ్యర్థులకు కేటాయించవచ్చు. వారు కూడా అందుబాటులో లేకుంటే, ఓపెన్ కేటగిరీకి మారుస్తారు. ►ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు ఉన్నాయి. ►ప్రతి కేటగిరీలో మహిళా అభ్యర్థులకు 33.3 శాతం కేటాయిస్తారు. 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. ►స్థానిక రిజర్వేషన్ 85 శాతం ఉంటుంది. ►మెరిట్ జాబితాను బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పొందిన మార్కుల ఆధారంగా తయారుచేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారా కాదా అనేది కూడా చూస్తారు. పాత అభ్యర్థులకు అధిక మెరిట్ ఉంటుంది. ►కోర్సు వ్యవధిలో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు విద్యార్థుల బదిలీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ►ఈ సంవత్సరం 860 సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం నేరుగా దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో ఎంసెట్కుగానీ లేదా ఇతరత్రా ఏదైనా ప్రవేశ పరీక్షకు అనుసంధానిస్తారు. బీఎస్సీ హెల్త్‌సైన్సెస్ కోర్సులివీ.. ►అనెస్థీషియా టెక్నాలజీ ►ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ►కార్డియాక్ కార్డియో వాస్క్యూలర్ టెక్నాలజీ ►రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ►ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ►న్యూరో సైన్స్ టెక్నాలజీ ►క్రిటికల్ కేర్ టెక్నాలజీ ►రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ►ఆడియోలజీ స్పీచ్ థెరపీ టెక్నాలజీ ►మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ ►న్యూక్లియర్ మెడిసిన్ ►రేడియో థెరపీ టెక్నాలజీ -
Hyderabad: ఆన్లైన్లో బిట్స్ పిలానీ బీఎస్సీ డిగ్రీ
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ క్యాంపస్ లో ‘కొర్సెరా’ భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్లైన్ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్) సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్ డైరెక్టర్ జి.సుందర్ తెలిపారు. 12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్ పిలానీతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీ వాండెన్ బోష్ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం బిట్స్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఓయూ పీజీ కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్లాగ్, ఇంప్రువ్మెంట్కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబసైట్లో చూడవచ్చు. (క్లిక్: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల) -
ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్మెంట్ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. చదవండి: ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా 2021–22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక (సోషియో ఎకనామిక్) సర్వేలో పలు విషయాలు వెల్లడించారు. ఢిల్లీ తరహాలో మళ్లీ డిగ్రీ కోర్సుల వైపు ఉత్తరాదిన ఇంజినీరింగ్ విద్య నామమాత్రంగా ఉంటుంది. 90 శాతం మంది డిగ్రీ కోర్సులవైపే మొగ్గుచూపుతారు. డిగ్రీ కోర్సులు చేయడానికి ఉత్తరాదిలో చాలామంది ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90వేల సీట్లుంటే..అన్నీ భర్తీ అవుతాయి. అంటే డిగ్రీ కోర్సులకు దేశంలోనే ఢిల్లీలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. గత ఏడాది అనంతపురం జిల్లాలో 14,342 మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ. రాష్ట్రంలోనే రెండో స్థానం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరిన వారి సంఖ్యను చూస్తే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 17,921 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఆ తర్వాతి స్థానంలో 14,342 అడ్మిషన్లతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిలిచింది. అందులోనూ అత్యధికగా బీసీ విద్యార్థులు 8,190 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 4,260 మంది ఎస్సీ విద్యార్థులు, 827 మంది ఎస్టీలు డిగ్రీ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 30,311 అడ్మిషన్లు జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 1,924 మాత్రమే. ఆనర్స్ డిగ్రీతో ఉపాధి అవకాశాలు ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన నూతన సిలబస్ ప్రకారం యూజీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సుతో సెలవు రోజుల్లో ఉద్యోగాధారిత శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతోంది. స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తిచేయాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రాజెక్ట్‌లూ పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు పొందారు. – ప్రొఫెసర్ ఎ.మల్లికార్జున రెడ్డి, రెక్టార్, ఎస్కేయూ వినూత్నమైన సిలబస్‌పై ఆసక్తి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్ ప్రవేశ పెట్టారు. కళాశాల నుంచి కొలువులు దక్కేలా ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా అవకాశాలు కల్పించారు. డిగ్రీ ఆనర్స్ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. –డి.పులికొండ, బీకాం (కంప్యూటర్స్) బహుళజాతి సంస్థల్లో అవకాశాలు దక్కేలా.. కోర్సు పూర్తయ్యాక బహుళజాతి సంస్థల్లో (మల్టీనేషనల్ కంపెనీస్) ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇందుకు నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు దోహదపడుతోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తే ఎగ్జిట్ అయి సాధారణ డిగ్రీ పొందవచ్చు. నాలుగు సంవత్సరాలు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. – కె.సురేష్, బీకాం (కంప్యూటర్స్) బీటెక్ కోర్సుకు దీటుగా.. స్కిల్ ఆధారిత కోర్సులతో ప్రత్యేక నైపుణ్యాలు అలవడుతున్నాయి. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. తద్వారా కోర్సులో ఉన్నçప్పుడే పరిశ్రమల అనుభవం వస్తోంది. బీటెక్ కోర్సుకు దీటుగా డిగ్రీ సిలబస్ రూపకల్పన చేశారు. దీంతో డిగ్రీ వైపే ఆసక్తి చూపాం. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉంటే చాలు. డిగ్రీ ఉన్నా.. బీటెక్ ఉన్నా అవకాశాలు దక్కుతాయి. –సంగమిత్ర, డిగ్రీ విద్యార్థిని -
Neha Nialang: 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా... సహజమైన పద్ధతిలో
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది. మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్‌లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది. సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్‌కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్‌లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్‌లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్‌లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్‌ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్‌గా తీసుకునేది కాదు. వృథా కానివ్వద్దని.. లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి. ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్‌లు తయారు చేసేది. దలాడే ఫుడ్స్.. నేహ తయారుచేసిన జామ్‌లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ. ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది. ‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది. -
సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్లకే అన్నది ఇప్పటివరకు ఉన్నమాట. ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిగ్రీలో ఏం చేయబోతున్నారు? సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు. దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. –ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మంచి ప్రయత్నం సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది. – గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ -
బీఎస్సీ డేటా సైన్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీలో పలు కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లను ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం విద్యారంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న డేటా సైన్స్‌ను బీఎస్సీ డేటా సైన్స్ పేరుతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. యూనివర్సిటీ ల్లోని కంప్యూటర్ సైన్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాలతోపాటు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పారిశ్రామిక రంగాలకు చెందిన నిఫుణుల సహకారంతో కోర్సు సిలబస్‌కు డిజైన్ చేసింది. టాప్ కోర్సు బీఎస్సీ డేటా సైన్స్ మార్కెట్లో పరిస్థితులు, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును రాష్ట్రంలోని 80 ప్రైవేటు కాలేజీల్లో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. కొన్ని కాలేజీల్లో ఒక సెక్షన్‌కు, ఇంకొన్ని కాలేజీల్లో రెండు మూడు సెక్షన్లకు అనుమతిచ్చింది. ఇక 26 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈ కోర్సు నిర్వహణకు కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉండనున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజీ, గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కోఎడ్యుకేషన్), బాన్స్వాడ, కామారెడ్డి, ఎస్ఆర్ఆర్ కరీంనగర్, జీడీసీ (ఉమెన్) కరీంనగర్, ఎస్ఆర్బీజీఎన్ఆర్ ఖమ్మం, ఎమ్వీఎస్ మహబూబ్‌నగర్, ఎన్టీఆర్ (ఉమెన్) మహబూబ్‌నగర్, నారాయణపేట, కూకట్పల్లి, నాగార్జున కాలేజీ– నల్లగొండ, గిరిరాజ్ కాలేజీ–నిజమాబాద్, హయత్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ (ఉమెన్), కేడీసీ హన్మకొండ, పింగలి ఉమెన్స్ కాలేజీ– హన్మకొండల్లో ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. వేటికవే విలక్షణం.. ఈ కోర్సులు ► బీకాం బిజినెస్ అనలటిక్స్ కోర్సును 24 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. ► బీకాం టాక్సేషన్ కోర్సు 27 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. వీటిలో ఆదిలాబాద్, భద్రాచలం డిగ్రీ కాలేజీలున్నాయి. ► బీకాం ఫారిన్ ట్రేడ్ కోర్సును హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్ కాలేజీ, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. ►మొదటిసారి బీఏ మ్యాథమేటిక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా ఆర్ట్స్ కాంబినేషన్స్‌తో రూపుదిద్దిన ఈ కోర్సును ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. మ్యాథ్స్, హిస్టరీ, ఎకనమిక్స్ కాంబినేషన్‌తో పాటు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల కాంబినేషన్లతో ఈ కోర్సు రూపుదిద్దుకుంది. ► జమ్మికుంట డిగ్రీ కాలేజీలో మాత్రమే ఉన్న బీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సును తాజాగా 21 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, ఆఫీస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్‌తో కాంబినేషన్‌తో ఈ కోర్సును తీసుకువస్తున్నారు. ► ప్రస్తుతం ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులకు మరిన్ని అవకాశాలు పెంచేలా బీఎస్సీ డెయిరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ వంటి కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ► జువాలజీ, కెమిస్ట్రీ, డెయిరీ సైన్స్ కాంబినేషన్‌తో డెయిరీ సైన్స్, క్రాప్‌ప్రొడక్షన్, బోటనీ, కెమిస్ట్రీతో కాంబినేషన్‌తో బీఎస్సీ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కోర్సును తీసుకువస్తున్నారు. ►ఒకటీ రెండు కాలేజీలకే పరిమితమైన సెరీకల్చర్, ఫిషరీస్ వంటి కోర్సులను ఈసారి మరిన్ని కాలేజీలకు విస్తరించనున్నారు. -
ఇకపై ఆన్లైన్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌కు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు 11.5 మిలియన్ల ఉద్యోగాలు లభ్యమవుతాయని అంచన. దానిని దృష్టిలో పెట్టుకొని డేటాసైన్స్‌లో ఆన్లైన్ ద్వారా సమగ్రమైన ఒక డిగ్రీని అందించే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో మొదటిసారి ప్రోగ్రామింగ్ అండ్ డేటాసైన్స్‌లో ఆన్లైన్ బీఎస్సీకోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోర్సును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీ, మద్రాస్) అందిస్తోంది. 12వ తరగతి పాస్ అయ్యి, 10వ తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. (ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1) ఈ కోర్సును మూడు స్టేజ్లలో అందించనున్నారు. ఫౌండేషన్ ప్రోగ్రాం, డిప్లమా ప్రోగ్రాం, డిగ్రీ ప్రోగ్రాం. అయితే ఏ స్టేజ్‌లో కావాలన్నా కోర్సును మధ్యలో ఆపేయవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఐఐటీ మద్రాస్ నుంచి పొందవచ్చు. (తాగునీటి శుద్ధికి జనుము + రాగి!) ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అఫ్లికేషన్ ఫీజు రూ. 3000 ఉంటుంది. వారికి నాలుగు వారాల పాటు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్‌లో కోర్సు ఉంటుంది. వీరికి ఆన్లైన్లో విద్యాబోధన అందిస్తారు. వీరు ఆన్లైన్లో ఎసైన్మెంట్స్, నాలుగో వారం చివరిలో క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో 50శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ ఫౌండేషన్ కోర్సుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. (ప్రపంచం భారత్ వైపు చూస్తోంది!) -
సైన్స్ డిగ్రీనా.. సెటిలైనట్లే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మాత్రమే కాదు.. బీఎస్సీ వంటి సైన్స్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభ (ఎంప్లాయబుల్ టాలెంట్) కలిగిన విద్యార్థుల సంఖ్య బీఎస్సీ కోర్సుల్లో భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో దేశంలో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై అంచనా వేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.10 లక్షల మంది విద్యార్థులను కలిసింది. వారి అభిప్రాయాలు, పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించింది. 2017 సంవత్సరంలో ఉద్యోగానికి కావాల్సిన సమర్థత కలిగిన బీఎస్సీ విద్యార్థులు 31.76% ఉంటే అది 2018లో 33.62 శాతానికి పెరిగింది. ఇక 2019 నాటికి ఇది 47.37 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇంజనీరింగ్‌లో పెరగనున్న అవకాశాలు.. వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. 2014లో 51.74 శాతం మందికి ఎంప్లాయబిలిటీ టాలెంట్ ఉంటే అది 2015లో 54 శాతానికి పెరిగింది. తరువాత మూడేళ్లలో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ 2019 నాటికి మాత్రం ఇలా టాలెంట్ కలిగిన విద్యార్థులు 57.09 శాతానికి చేరుకుంటారని వీబాక్స్ అంచనా వేసింది. బీఎస్సీలోనూ అదే పరిస్థితి. 2014లో బీఎస్సీలో 41.66 శాతం మంది ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉంటే అది 2017 వరకు ఏటా తగ్గుతూ వచ్చింది. అయితే 2018లో మాత్రం పెరిగింది. ఇక 2019లో భారీగా పెరుగుదల నమోదు కానుందని వెల్లడించింది. దేశంలో ఐటీ, ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటివరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2014లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఎంబీఏ విద్యార్థులు 41.02 శాతం ఉంటే 2018లో 39.4 శాతానికి తగ్గింది. ఇక 2019లో ఈ సంఖ్య 36.44 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఒకప్పుడు ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఐటీఐ విద్యార్థులు 46.92 శాతం ఉంటే 2018 నాటికి అది 29.46 శాతానికి పడిపోయింది. 2019లో ఎలా ఉంటుందన్న అంచనా కూడా వీబాక్స్ వేయలేదు. పాలిటెక్నిక్‌లో సామర్థ్యాలు కలిగిన వారు 2018లో 32.67 శాతం ఉంటే వచ్చే సంవత్సరానికి 18.05 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఎనిమిదవ స్థానంలో తెలంగాణ... రాష్ట్రాల వారీగా చూస్తే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. గతంలో టాప్ 10లో కూడా లేని తెలంగాణ ఈసారి తమ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చి గత రెండేళ్లుగా చర్యలు చేపట్టిన కారణంగా ఈసారి 8వ స్థానంలో నిలువగలిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2018లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన మొదటి పది స్థానాల్లో ఉన్న దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈసారి కూడా మొదటి పది స్థానాల్లో ఉన్నాయని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 పేర్కొంది. ఈసారి కొత్తగా తెలంగాణ, రాజస్థాన్, హరియాణా టాప్–10 రాష్ట్రాల జాబితాలో చేరాయి. 2018 నివేదికలో టాప్–10 రాష్ట్రాల్లో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ఈసారి లేకుండాపోయాయి. -
లాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ నిలిపివేత : ధర ఎంత?
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేత బాటపట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు మరోభారీ షాక్ తగిలింది. త్వరలోనే కంపెనీ మూత పడనున్న నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ గురువారం లాంకో ఇన్ఫ్రాటెక్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 14,2018 నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. లిక్విడేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్‌లో మార్కెట్ సమస్యలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్టుతెలిపింది. దీంతో లాంకో షేరు 4శాతం క్షీణించి 48 పైసల వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) ప్రకారం ఆర్బీఐ గుర్తించిన 12 కంపెనీల్లో లాంకో కూడా ఒకటి. లాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడీబీఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. ఐబిబిఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని వాదించింది. దీన్ని విచారించిన ఎన్సీఎల్టీ ఇటీవల లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆగస్టు 27న అనుమతినిచ్చింది. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్‌గా నియమించింది -
31న ఓయూ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూ డిగ్రీ ఆఖరి సంవత్సర వార్షిక పరీక్ష ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కుమార్ శుక్ర వారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు, దూరవిద్య డిగ్రీ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఫ్రెంచ్, జర్మన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజస్ సీనియర్, జూనియర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ ఫారెన్ లాంగ్వేజెస్ విభా గం ప్రకటించింది. ఈ కోర్సుల వ్యవధి 4నెలలు . ఆసక్తి గల విద్యార్థులు జూన్ 11 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం 80194 27898 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. -
కాలిబాటలతో ప్రయోజనం
గడ్డిపల్లి (గరిడేపల్లి) : పొలాల్లో కాలిబాటల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని లయోలా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తెలిపారు. శుక్రవారం మండలంలోని గడ్డిపల్లిలో రైతు మల్లిఖార్జున్ పంట పొలంలో కాలిబాటలపై కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. నాట్లు వేసే సమయంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత దిగుబడి వస్తుందని రైతులు భావించడం సరికాదన్నారు. వరిసాగులో మొక్కల సాంద్రత చాలా కీలకమైందని, మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి చీడపీడలు వ్యాపిస్తాయన్నారు. కాలిబాటలను తీసుకోవడం వల్ల దోమ పోటును నివారించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కరిష్మా, సింధు, నిషిత, తేజస్వీ, బిందు పాల్గొన్నారు. -
మోదీ సీటులో బీజేపీకి షాక్
♦ వారణాసి పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితం ♦ యూపీలో చాలా చోట్ల బలం పుంజుకున్న బీఎస్పీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజక వర్గం వారణాసిలో బీజేపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. వారణాసిలోని 48 స్థానాల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులు ఎనిమిది మంది మాత్రమే గెలుపొందారు. యూపీలో నాలుగు దశల్లో జరిగిన స్థానిక ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. మోదీతోపాటు, ఎస్పీ, కాంగ్రెస్‌లను కూడా ఈ ఎన్నికలు గట్టి ఎదురు దెబ్బ తీశాయి. ఆశ్చర్యకరంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ చాలా చోట్ల పుంజుకుంది. వారణాసి జిల్లాలో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తాను బలపరచిన 25 మంది అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. వారణాసి జిల్లాలో ప్రధాని దత్తత తీసుకున్న జయపూర్ గ్రామంలో బీజేపీ బలపరచిన అరుణ్‌సింగ్, బీఎస్పీకి చెందిన రమేశ్ తివారీ చేతిలో ఓడిపోయారు. ఈ జిల్లాలో ఎస్పీ 25, బీజేపీ 8, కాంగ్రెస్ 2. బీఎస్పీ 3, అప్నాదళ్ 4, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలిచారు. గత పంచాయతి ఎన్నికల్లో ఈ జిల్లాలో బీజేపీ గెలుచుకుంది మూడు స్థానాలే . జిల్లా పంచాయతి అధ్యక్షుడిగా ఎస్పీ బలపరచిన అభ్యర్థే ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సతీష్ ఫౌజీ తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులకు ఎదురుదెబ్బే తగిలింది. పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతల కుటుంబసభ్యులు, బంధువులు పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో 3112 జిల్లా పంచాయతి పదవులకు, 77,576 బ్లాక్ పంచాయతి పదవులకు ఎన్నికలు జరిగాయి. ఎస్పీ చీఫ్ ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజమ్గఢ్ స్థానంలో పార్టీ మద్దచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, ఉపాధ్యక్షుడు రాహుల్ నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు ఘోరంగా ఓడారు. రాయబరేలీలో 22మంది పార్టీ అభ్యర్థులకు గానూ 21మంది ఓడిపోయారు. అటు అమేథీలో మొత్తం 8స్థానాల్లో కాంగ్రెస్ బలపరచిన ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరిగినవి కాకపోవడంతో పార్టీ బలాబలాలపై స్పష్టత రాలేదు. ఎంఐఎం బోణీ.. యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఎంఐఎం బోణీ కొట్టింది. ముజఫర్ నగర్ జిల్లాలో షెడ్యుల్ కులానికి చెందిన నిత్రాపల్ సింగ్ బోస్, ఆజామ్‌గఢ్ జిల్లాలో కైలాస్ కుమార్ గౌతమ్, బల్ రాంపూర్ జిల్లాలో నసీమా, మహ్మద్ తాహేర్ ఖాన్ విజయం సాధించినట్లు ఎంఐఎం సోమవారం హైదరాబాద్‌లో ఓ ప్రకటనలో పేర్కొంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 27,000 మార్క్‌ను అందుకుంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 30 పాయింట్లతో 8,150 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 170 పాయింట్లకు పైగా లాభాలతోనూ, నిఫ్టీ 50 పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కోనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రియాల్టీ, మెటల్, ఆయిల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
ఉపాధికి వెలుగు రేఖలు..
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.. పది పూర్తయితే చాలు ఇంటర్మీడియెట్ స్థాయిలో చాలా మంది ఎంపిక చేసుకునే గ్రూపులివి! ఉన్నత విద్యా కోర్సుల్లో చేరి, నచ్చిన కెరీర్‌ను అందుకునేందుకు బాటలు వేసే గ్రూపులివి! అయితే పది తర్వాత రెండేళ్లకే పదిలమైన ఉపాధిని అందించే కోర్సులు ఒకేషనల్ కోర్సులు. విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని అందించే ఇంటర్ ఒకేషనల్ కోర్సులపై స్పెషల్ ఫోకస్.. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల లక్ష్యాలు +2 స్థాయిలో విద్యార్థులకు వివిధ వృత్తులకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలను అందించి, ఉద్యోగావకాశాలు లేదా స్వయం ఉపాధిని పొందేలా చేయడం.ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి, వ్యక్తిగత శ్రేయస్సులను అనుసంధానించడం.వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో వృద్ధి పథంలో పయనిస్తున్న విభాగాలకు అవసరమైన మధ్యస్థాయి మానవ వనరులను సృష్టించడం. తక్షణ ఉపాధికి సత్వర మార్గం: పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇ లాంటి వారికి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులు అవసరం. మరోవైపు నేటి ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి. అర్హత, కోర్సులు: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఔత్సాహిక విద్యార్థులు నేరుగా కాలేజీని సంప్రదించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తక్షణ ఉపాధికి మార్గాలు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల వ్యవధి గల ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. లేదంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యలోనూ అవకాశాలు పొందొచ్చు. కోర్సు పూర్తిచేసిన తర్వాత అప్రెంటీస్‌షిప్ చేయొచ్చు. ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. ఏటా ప్రభుత్వం అప్రెంటీస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. వీటిద్వారా అప్రెంటీస్‌షిప్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మా కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ (ఓఏ) కోర్సు ఉంది. ఇందులో గతేడాది 30 మందికిపైనే చేరారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులకు అధికారులు అనుమతిచ్చినప్పటికీ ఫ్యాకల్టీ కొరత ఉంది. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు, విశ్రాంత సిబ్బందిని మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకోవాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. - పి.నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్, బాలికల కళాశాల, వనపర్తి, మహబూబ్‌నగర్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కంపెనీలు తేలికపాటి, భారీ వాహనాలను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నాయి. దీంతో సర్వీసింగ్, మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో మధ్యస్థాయి టెక్నీషియన్లకు డిమాండ్ పెరిగింది. కరిక్యులం: వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.. ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.స్వయం ఉపాధి: ఆటోమొబైల్ మెకానిక్, డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ సర్వీస్ మెకానిక్, వెహికల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్‌మ్యాన్-డీలర్. మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.స్వయం ఉపాధి: సోలార్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ; వెల్డింగ్ వర్క్‌షాప్; లైట్ మోటార్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్; జనరల్ వర్క్‌షాప్.ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.స్వయం ఉపాధి: ఎలక్ట్రానిక్ పరికరాల సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల డీలర్షిప్/ఏజెన్సీ, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి. ఎలక్ట్రికల్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్. స్వయం ఉపాధి: ఎలక్ట్రిక్ ఉపకరణాల డీలర్షిప్/ఏజెన్సీ; రిపైర్ షాప్; మ్యానుఫ్యాక్చరింగ్; ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్; ఎలక్ట్రీషియన్; వైర్‌మ్యాన్; సర్వీస్ టెక్నీషియన్/సర్వీస్ ఇంజనీర్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: ఉద్యోగావకాశాలు: జూనియర్ ప్రోగామర్, కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, సాఫ్ట్వేర్ మార్కెటింగ్ పర్సనల్, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అసిస్టెంట్, డ్రాఫ్టింగ్ అసిస్టెంట్స్.స్వయం ఉపాధి: డీటీపీ ఆపరేటర్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సెంటర్ మెయింటెనెన్స్, ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ హార్డ్‌వేర్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నీషియన్, వెబ్‌డిజైనర్. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ: ఉద్యోగావకాశాలు: నిర్మాణ రంగంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లకు అసిస్టెంట్లు; కాంట్రాక్ట్ ఉద్యోగాలు; తాపీమేస్త్రీ, కార్పెంటర్, పెయింటర్ వంటివి.స్వయం ఉపాధి: నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్; పెయింటింగ్, బార్ బెండింగ్ వంటి సేవలు. అగ్రికల్చరల్ కోర్సులు క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్: భూ, నీటి వనరులు క్షీణిస్తుండటం.. వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి నేపథ్యంలో దేశంలో పంట ఉత్పత్తుల్లో నిలకడ వృద్ధి సాధించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సంస్థాగతపరమైన సహకారంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ వృత్తి విద్యా నిపుణుల అవసరం పెరుగుతోంది. ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఫార్మ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, విలేజ్ కోఆర్డినేటర్, ప్లాంట్ ప్రొటక్షన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: అగ్రీ ఇన్పుట్ సప్లయిర్; సీడ్ గ్రోవర్, క్రాప్ ప్రొడ్యూసర్, కస్టమ్ సర్వీస్, కాంట్రాక్టర్/కాంట్రాక్టింగ్ ఫార్మింగ్. డెయిరీ: ఉద్యోగావకాశాలు: వెటర్నరీ అసిస్టెంట్, డెయిరీ ఫారం అసిస్టెంట్; మిల్క్ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్; డెయిరీ లేబొరేటరీ అసిస్టెంట్; ఫీడర్ ప్రొడక్షన్ సూపర్వైజర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: డెయిరీ ఫారం ఓనర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్; ఫీడర్ ప్రొడ్యూసర్; మిల్క్ పార్లర్; మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్; మిల్క్ కలెక్షన్ సెంటర్. ఫిషరీస్: ఉద్యోగావకాశాలు: లేబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, సూపర్వైజర్; ఆక్వా కేంద్రాలు, హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబొరేటరీ అసిస్టెంట్; ఫీల్డ్ మార్కెటింగ్ అసిస్టెంట్, సీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిషరీస్ కోఆపరేటివ్ సంస్థలలో ఉద్యోగాలు, స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు. స్వయం ఉపాధి: ఫిషరీ ఇన్పుట్ సప్లయిర్, సీడ్ ప్రొడ్యూసర్, ఫిష్ ప్రొడ్యూసర్.. సెరీకల్చర్: ఉద్యోగావకాశాలు: ఆపరేటివ్ (గ్రెయినేజ్/మల్బరీ కల్టివేషన్/ఎక్స్టెన్షన్/రియరింగ్/రీలింగ్); లేబ్ అటెండర్; కల్టివేటర్/లేబర్.స్వయం ఉపాధి: మల్బరీ నర్సరీ, గ్రెయినేజ్, సెరీకల్చర్ సర్వీస్ సెంటర్, మల్బరీ గ్రోవర్, సిల్క్‌వార్మ్ సీడ్ సప్లయిర్, మల్బరీ ప్రోపగేటర్, సిల్క్ రీలర్, సిల్క్ ట్విస్టర్, కకూన్ సప్లయిర్. హ్యుమానిటీస్, ఇతర కోర్సులు కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్: ఉద్యోగావకాశాలు: మీడియా సంస్థలలో యానిమేటర్‌గా అవకాశాలుంటాయి. డ్రాయింగ్ అసిస్టెంట్, ఫొటో ఎడిటింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందొచ్చు. స్థానిక కేబుల్ టీవీ కేంద్రాలు, గేమింగ్ స్టూడియోల్లోనూ అవకాశాలుంటాయి. టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్: ఉద్యోగావకాశాలు: టూరిజం అసిస్టెంట్, టూరిస్ట్‌గైడ్, టూర్ ఎస్కార్ట్, గెస్ట్ రిలేషన్ అసిస్టెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్, హౌస్‌కీపింగ్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: కేటరింగ్ ఆపరేషన్స్, టూర్ కండక్టర్, కొరియర్ అండ్ కార్గో ఏజెంట్, టూరిస్ట్ గైడ్.. పారామెడికల్ కోర్సులు ెుడికల్ ల్యాబ్ టెక్నీషియన్: వైద్య సేవల రంగంలో రోగ నిర్ధరణ కీలకమైంది. సరిగా రోగ నిర్ధరణ జరక్కుంటే రోగికి చికిత్స చేసేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. కరిక్యులం: బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ అండ్ పాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఉద్యోగావకాశాలు: ఆసుపత్రుల రోగ నిర్ధారణ కేంద్రాలు; వైద్య, ఫార్మసీ కళాశాలలు; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్స్ వంటివాటిలో లేబొరేటరీ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.స్వయం ఉపాధి: డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల ఏర్పాటు; ల్యాబ్ కెమికల్స్, గ్లాస్‌వేర్, ల్యాబ్ పరికరాలు, విడి భాగాల డిస్ట్రిబ్యూటర్.ఇతర కోర్సులు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ. బిజినెస్, కామర్స్ కోర్సులు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్: కరిక్యులం: బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఉద్యోగావకాశాలు: సూపర్ బజార్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, బ్యాంకుల్లో అవకాశాలుంటాయి. మ్యూచ్‌వల్‌ఫండ్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి: పోస్టల్ సేవింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లుగా స్వయం ఉపాధి పొందొచ్చు. చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ................................. ఇతర కోర్సులు: ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులకు కొత్త కరిక్యులం రూపొందించి, 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏ ఒకేషనల్ కోర్సుకైనా ప్రాక్టికల్స్ కీలకం. కాబట్టి కోర్సులో భాగంగా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కుల వెయిటేజీ కూడా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమానంగా ఉంటుంది. అంటే.. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు పాక్టికల్స్‌కు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్టులుంటాయి. కళాశాల వీలునుబట్టి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. వేతనాలు ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధిని చూపించవచ్చు. ఉన్నత విద్యావకాశాలు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే 10 శాతం కోటా కింద సంబంధిత పాలిటెక్నిక్ హెల్త్ అండ్ పారామెడికల్ కోర్సులు చేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్‌తో గ్రాడ్యుయేషన్ స్థాయిలో మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు.మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. కామర్స్, బిజినెస్ కోర్సులు పూర్తిచేసిన వారు బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు బీఎస్సీ, బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. -
వ్యవసాయ అనుబంధ కోర్సులు.. ఉపాధి వేదికలు
బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్ ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ఉత్పత్తై ఫలసాయానికి విదేశాల్లో విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయి. సాగు విధానాల్లోనూ ఆధునికత సంతరించుకోవడంతో.. సీజన్‌తో సంబంధం లేకుండా హార్టికల్చర్ ఏడాది పొడవునా ఉత్పత్తులను నమోదు చేస్తోంది. అయితే నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఫలసాయం రావాలంటే దానికి సంబంధించిన సాంకేతిక మెలకువలు తెలిసిన అభ్యర్థులు కావాలి. అలాంటి మెలకువలను బోధించే లక్ష్యంతో ప్రారంభించిన కోర్సు.. హార్టికల్చర్ సైన్స్. మొత్తం నాలుగు కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్)-హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వివరాలు.. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా). కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-రాజేంద్రనగర్, హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్-మోజెర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్- అనంతరాజు పేట (వైఎస్ఆర్ కడప జిల్లా). కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. అందుబాటులోని సీట్ల సంఖ్య: 210. అవకాశాలు: హార్టికల్చర్ సైన్స్‌లో నైపుణ్యం సాధించిన వారు వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలోనే నెలకు కనీసం రూ.10వేల వేతనం సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో.. హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్లు, ఆఫీసర్లు, డైరక్టర్ల హోదా పొందొచ్చు. దీంతోపాటు.. స్వయం ఉపాధి మార్గాలు కూడా ఎన్నో. అర్హత కలిగిన అభ్యర్థులు సొంతగా నర్సరీలు, ఫార్మ్ సెంటర్లను నెలకొల్పవచ్చు. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని కోర్సులు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్).. మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా డాక్టర్ కలను తీర్చే కోర్సు. దీంతో ఈ కోర్సును అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. ఐదు కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. వివరాలు: కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - తిరుపతి. సీట్లు: 60 ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - గన్నవరం.సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-హైదరాబాద్. సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-ప్రొద్దుటూరు. సీట్లు: 30 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-కోరుట్ల. సీట్లు: 30 కోర్సు కాల వ్యవధి: ఐదేళ్లు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో 18 అంశాల్లో బోధన ఉంటుంది. ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, గైనకాలజీ, జెనెటిక్స్ తదితర అంశాలను చదవాలి. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కేవలం జంతు సంరక్షణనే కాకుండా...పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మన దేశంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు అవకాశాల పరంగా కొదవలేదని చెప్పొచ్చు. కేవలం క్లినికల్ విభాగంలోనే కాకుండా పరిశోధన, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యుటికల్ వంటి రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో కూడా అవకాశాలు ఉంటాయి. ఏటా ఆర్మీ కెప్టెన్ హోదాలో వెటర్నరీ డాక్టర్లను షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో నియమించుకుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. నూతన ఔషధాల పరిశోధన కోసం ఫార్మాస్యూటికల్ సంస్థలు ఆర్ అండ్ డీ విభాగంలో వెటర్నరీ డాక్టర్లను నియమించుకుంటున్నాయి. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ. 45 వేల వేతనం లభిస్తుంది. ఐసీఏఆర్ వంటి ఇన్స్టిట్యూట్లలో శాస్త్రవేత్తగా ఎంపికైతే నెలకు రూ. 50 వేల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ). కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-ముతుకూరు (నెల్లూరు జిల్లా)లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో సీట్ల సంఖ్య: 30.ఈ కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లుంటాయి. కోర్సు-అవకాశాలు: మత్స్య నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో చేపల పెంపకం, పోషణ, వాటికి వచ్చే వ్యాధులు, జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రాసెసింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాలను బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్, ఫిషింగ్ గీయర్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో వివిధ హోదాలను అందుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. ఉన్నత విద్యా విషయానికొస్తే.. బ్యాచిలర్ తర్వాత పీజీ (ఎంఎఫ్ఎస్సీ) కోర్సు చేయవచ్చు. నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) ప్రవేశం: ఎంసెట్-2014 (మెడికల్ స్ట్రీమ్) ర్యాంక్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా. వయసు: 17-22 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు-25 ఏళ్లు, పీహెచ్ విద్యార్థులకు-27 ఏళ్లు) దరఖాస్తు: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 10, 2014. వివరాలకు: www.angrau.ac.in కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇంటర్మీడియెట్ మార్కుల మెమో ఎంసెట్-2014 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సీ/తత్సమాన సర్టిఫికెట్ సంబంధిత విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రం ఆరు నుంచి 12వ తరగతి వరకు ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్లు రెసిడెన్స్ సర్టిఫికెట్ (అవసరమైతే) ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ, చివర చదివిన తరగతికి సంబంధించింది) -
ఏయూ దూరవిద్య నేటి పరీక్ష వాయిదా
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), న్యూస్‌లైన్ : ఏయూ దూరవిద్యా కేంద్రం శుక్రవారం నిర్వహించాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్టు కేంద్రం సంచాలకుడు ఆచార్య ఎల్డీ సుధాకర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే మొదటి సంవత్సరం, మధ్యాహ్నం జరిగే మూడో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు. ఈ పరీక్షను జూన్ ఒకటో తేదీ ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మిగిలిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రం మార్పు బీఎస్సీ విభాగంలో కాకినాడ పి.ఆర్.ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకున్నవారు ఎంఎస్ఎన్ కళాశాలో పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. విద్యార్థులు మారిన పరీక్షా కేంద్రాల నుంచి తమ హాల్ టికెట్లు పొంది పరీక్షకు హాజరుకావాలని సూచించారు. -
విద్యార్థులకు బీఆర్‌ఏయూ షాక్
పొందూరు, న్యూస్‌లైన్: ప్రశ్న పత్రాల లీకులతో విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ఓ ప్రశ్న ముద్రించకపోవడంతో విద్యార్థు లు దానికి మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇవీ... శుక్రవారం డిగ్రీ రెండో సంవత్సరం(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఎం) విద్యార్థులకు జనరల్ తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ప్రశ్న పత్రం చూసి అవాక్కవడం విద్యార్థుల వంతైంది. కారణమేమిటంటే... ప్రశ్న పత్రం రెండవ పుటలో ఐదవ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలిచ్చి ఒకదానికి వ్యాసం(జవా బు) రాయవలసి ఉంది. అయితే ఇందులో మూడు ప్రశ్నలే ఇచ్చారు. రోమన్ నంబర్ 1, 3, 4ల్లో ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. రెండో ప్రశ్న స్థానంలో కేవలం అంకె వేసి వదిలేశారు. ఈ ప్రశ్నకు ఎనిమిది మార్కులు కేటాయించా రు. దీంతో తాము చేయని తప్పునకు అనవసరంగా ఎనిమిది మార్కులు కోల్పోవలసి వచ్చిందని పలువురు విద్యార్థులు ‘న్యూసలైన్’కు తెలిపారు. తమకు జరిపిన అన్యాయాన్ని యూనివర్సిటీ ఉపకులపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ప్రశ్నపత్రం కోడ్ నంబర్ ట్చట002. ఈప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు కేటాయించారు. -
దీపావళి నాటికి కొత్త శిఖరాలకు సెన్సెక్స్!.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ ఈ దీపావళి నాటికి కొత్త శిఖరాలను తాకొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి మెరుగ్గా ఉండటం, విదేశీ పెట్టుబడుల వెల్లువ, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఇందుకు చేయూతగా నిలుస్తాయనేది వారి అభిప్రాయం. గత శుక్రవారం సెన్సెక్స్ 20,932 పాయింట్ల గరిష్టాన్ని తాకి.. చివరకు 20,883 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. కీలకమైన 21,000 పాయింట్లకు కూతవేటు దూరంలో నిలబడింది. అమెరికాలో సహాయ ప్యాకేజీల కోత ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చన్న అంచనాలు, చైనాలో ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం వంటివి దేశీ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇక 2008లో సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టం(21,207 పాయింట్లు)తో చూస్తే ప్రస్తుతం కేవలం 324 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఈ నెలలో ఇప్పటిదాకా సెన్సెక్స్ 6.99% (1,366 పాయిం ట్లు) ఎగబాకడం గమనార్హం. దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, లిక్విడిటీ జోరును చూస్తుంటే... మార్కెట్లలో దూకుడు కొనసాగుతుందన్న విశ్వాసం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమీప కాలంలో సెన్సెక్స్ కొత్త శిఖరాలను అందుకోవచ్చని, బహుశా ఈ దీపావళి నాటికే ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకే అవకాశం ఉందని ఆషికా స్టాక్ బ్రోకర్స్ రీసెర్చ్ హెడ్ పారస్ బోత్రా అభిప్రాయపడ్డారు. ఇందుకు ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు ప్రధాన చోదకంగా నిలవనుందని కూడా ఆయన పేర్కొన్నారు. జియోజిత్ బీఎన్పీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.