మోదీ సీటులో బీజేపీకి షాక్
♦ వారణాసి పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితం
♦ యూపీలో చాలా చోట్ల బలం పుంజుకున్న బీఎస్పీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజక వర్గం వారణాసిలో బీజేపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. వారణాసిలోని 48 స్థానాల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులు ఎనిమిది మంది మాత్రమే గెలుపొందారు. యూపీలో నాలుగు దశల్లో జరిగిన స్థానిక ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. మోదీతోపాటు, ఎస్పీ, కాంగ్రెస్‌లను కూడా ఈ ఎన్నికలు గట్టి ఎదురు దెబ్బ తీశాయి. ఆశ్చర్యకరంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ చాలా చోట్ల పుంజుకుంది. వారణాసి జిల్లాలో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తాను బలపరచిన 25 మంది అభ్యర్థులను గెలిపించుకోగలిగింది.
వారణాసి జిల్లాలో ప్రధాని దత్తత తీసుకున్న జయపూర్ గ్రామంలో బీజేపీ బలపరచిన అరుణ్‌సింగ్, బీఎస్పీకి చెందిన రమేశ్ తివారీ చేతిలో ఓడిపోయారు. ఈ జిల్లాలో ఎస్పీ 25, బీజేపీ 8, కాంగ్రెస్ 2. బీఎస్పీ 3, అప్నాదళ్ 4, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలిచారు. గత పంచాయతి ఎన్నికల్లో ఈ జిల్లాలో బీజేపీ గెలుచుకుంది మూడు స్థానాలే . జిల్లా పంచాయతి అధ్యక్షుడిగా ఎస్పీ బలపరచిన అభ్యర్థే ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సతీష్ ఫౌజీ తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులకు ఎదురుదెబ్బే తగిలింది. పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతల కుటుంబసభ్యులు, బంధువులు పరాజయం పాలయ్యారు.
రాష్ట్రంలో 3112 జిల్లా పంచాయతి పదవులకు, 77,576 బ్లాక్ పంచాయతి పదవులకు ఎన్నికలు జరిగాయి. ఎస్పీ చీఫ్ ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజమ్‌గఢ్ స్థానంలో పార్టీ మద్దచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, ఉపాధ్యక్షుడు రాహుల్ నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు ఘోరంగా ఓడారు. రాయబరేలీలో 22మంది పార్టీ అభ్యర్థులకు గానూ 21మంది ఓడిపోయారు. అటు అమేథీలో మొత్తం 8స్థానాల్లో కాంగ్రెస్ బలపరచిన ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరిగినవి కాకపోవడంతో పార్టీ బలాబలాలపై స్పష్టత రాలేదు.
ఎంఐఎం బోణీ.. యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఎంఐఎం బోణీ కొట్టింది. ముజఫర్ నగర్ జిల్లాలో షెడ్యుల్ కులానికి చెందిన నిత్‌రాపల్ సింగ్ బోస్, ఆజామ్‌గఢ్ జిల్లాలో కైలాస్ కుమార్ గౌతమ్, బల్ రాంపూర్ జిల్లాలో నసీమా, మహ్మద్ తాహేర్ ఖాన్ విజయం సాధించినట్లు ఎంఐఎం సోమవారం హైదరాబాద్‌లో ఓ ప్రకటనలో పేర్కొంది.