సాక్షి ప్రతినిధి, అనంతపురం: డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్‌మెంట్ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.
చదవండి: ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా 2021–22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక (సోషియో ఎకనామిక్) సర్వేలో పలు విషయాలు వెల్లడించారు.
ఢిల్లీ తరహాలో మళ్లీ డిగ్రీ కోర్సుల వైపు
ఉత్తరాదిన ఇంజినీరింగ్ విద్య నామమాత్రంగా ఉంటుంది. 90 శాతం మంది డిగ్రీ కోర్సులవైపే మొగ్గుచూపుతారు. డిగ్రీ కోర్సులు చేయడానికి ఉత్తరాదిలో చాలామంది ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90వేల సీట్లుంటే..అన్నీ భర్తీ అవుతాయి. అంటే డిగ్రీ కోర్సులకు దేశంలోనే ఢిల్లీలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. గత ఏడాది అనంతపురం జిల్లాలో 14,342 మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ.
రాష్ట్రంలోనే రెండో స్థానం
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరిన వారి సంఖ్యను చూస్తే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 17,921 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఆ తర్వాతి స్థానంలో 14,342 అడ్మిషన్లతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిలిచింది. అందులోనూ అత్యధికగా బీసీ విద్యార్థులు 8,190 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 4,260 మంది ఎస్సీ విద్యార్థులు, 827 మంది ఎస్టీలు డిగ్రీ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 30,311 అడ్మిషన్లు జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 1,924 మాత్రమే.
ఆనర్స్ డిగ్రీతో ఉపాధి అవకాశాలు
ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన నూతన సిలబస్ ప్రకారం యూజీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సుతో సెలవు రోజుల్లో ఉద్యోగాధారిత శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతోంది. స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తిచేయాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రాజెక్ట్‌లూ పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు పొందారు.
– ప్రొఫెసర్ ఎ.మల్లికార్జున రెడ్డి, రెక్టార్, ఎస్కేయూ
వినూత్నమైన సిలబస్‌పై ఆసక్తి
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్ ప్రవేశ పెట్టారు. కళాశాల నుంచి కొలువులు దక్కేలా ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా అవకాశాలు కల్పించారు. డిగ్రీ ఆనర్స్ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
–డి.పులికొండ, బీకాం (కంప్యూటర్స్)
బహుళజాతి సంస్థల్లో అవకాశాలు దక్కేలా..
కోర్సు పూర్తయ్యాక బహుళజాతి సంస్థల్లో (మల్టీనేషనల్ కంపెనీస్) ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇందుకు నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు దోహదపడుతోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తే ఎగ్జిట్ అయి సాధారణ డిగ్రీ పొందవచ్చు. నాలుగు సంవత్సరాలు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు.
– కె.సురేష్, బీకాం (కంప్యూటర్స్)
బీటెక్ కోర్సుకు దీటుగా..
స్కిల్ ఆధారిత కోర్సులతో ప్రత్యేక నైపుణ్యాలు అలవడుతున్నాయి. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. తద్వారా కోర్సులో ఉన్నçప్పుడే పరిశ్రమల అనుభవం వస్తోంది. బీటెక్ కోర్సుకు దీటుగా డిగ్రీ సిలబస్ రూపకల్పన చేశారు. దీంతో డిగ్రీ వైపే ఆసక్తి చూపాం. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉంటే చాలు. డిగ్రీ ఉన్నా.. బీటెక్ ఉన్నా అవకాశాలు దక్కుతాయి.
–సంగమిత్ర, డిగ్రీ విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment