bcom
-
Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజీ రూ.20 లక్షలు అంటే.. అబ్బో అంటారు. కానీ ఇప్పుడు బీకాం చేసిన విద్యార్థికే ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారంటే నమ్మగలమా? నమ్మాల్సిందే! అంతర్జాతీయ సంస్థలే కాదు, భారత్‌లోని కంపెనీలూ ఇప్పుడు అనలిస్ట్‌లకు ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2023లో 60 శాతం వరకు అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉందని ఇండియా స్కిల్ రిపోర్టు– 2023 చెబుతోంది. భవిష్యత్తులోనూ కామర్స్ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఆరేళ్ల నుంచే డిమాండ్ పెరుగుతూ వస్తోందని పేర్కొంది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఊహించని విధంగా ఏకంగా 60.62 శాతానికి చేరుకోబోతోందని వివరించింది. ఇక బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ క్రైం కోర్సుల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపింది. అన్ని రంగాల్లో పెరిగిన అవకాశాలు.. కరోనా తర్వాత వాణిజ్య రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ–కామర్స్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీల్లో డేటా అనాలసిస్ వ్యవస్థ పెరిగింది. దీంతో అనలిస్ట్‌ల అవసరం పెరిగింది. బీకాం నేపథ్యం ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్, తద్వారా ఉపాధి పెరగడానికి ఇది దోహద పడింది. ఇండియాలో బీకామ్‌కు ఉద్యోగావకాశాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైంది. గతంలో ఉన్న ఇన్‌కం ట్యాక్స్‌కు, ఇప్పటి జీఎస్టీకి చాలా తేడాలున్నాయి. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ట్యాక్స్ నైపుణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ రంగాల్లో కూడా కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనలిస్ట్ ఉద్యోగుల వేతనం మూడేళ్ళల్లోనే 98 శాతం పెరిగినట్టు ఇండియా స్కిల్ నివేదిక పేర్కొంది. బీకాం కోర్సుల్లో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని తెలిపింది. బీకాం కోర్సులకు క్రేజ్ అందివస్తున్న మార్కెట్ అవసరాల నేపథ్యంలో రాష్ట్రంలో బీకాం కోర్సులకు రానురాను డిమాండ్ పెరుగుతోంది. డిగ్రీ ప్రవేశాల్లో 41 శాతం వరకు బీకాం విద్యార్థులే ఉంటున్నారు. వాస్తవానికి ఆరేళ్ళ కిందట 46 శాతం సైన్స్ విద్యార్థులే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. 2017–18లో 80,776 మంది బీకాం కోర్సులో చేరితే, 2022–23లో 87,480 మంది చేరారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా బీకాం కోర్సుల్లో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. బీకాంలో జనరల్, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేసే టెక్నాలజీని కూడా బీకాం కోర్సుల్లో మేళవించారు. ఈ తరహా కామర్స్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ–కామర్స్ పెరగడంతో మంచి డిమాండ్ ఈ–కామర్స్ పెరిగిన నేపథ్యంలో ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో బహుళజాతి కంపెనీలు కామర్స్ విద్యార్థులను అత్యధిక వేతనాలతో నియమిస్తున్నాయి. ప్రతి ఏటా డెలాయిట్, బ్రాడ్‌రిచ్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీలో రూ. 21 లక్షల వరకు బహుళజాతి సంస్థలు ఇస్తున్నాయి. బీకాం తర్వాత విదేశాల్లో ఎంబీఏ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. – డాక్టర్ మోహన్‌కుమార్ (భద్రుక కాలేజీ ప్రిన్సిపల్) జీఎస్టీపై పట్టు ఉంటే మంచి వేతనం జీఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్ విద్యార్థులకు డిమాండ్ పెరిగింది. అన్ని రకాల సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఫైలింగ్ సిస్టమ్‌లో అనుభవాన్ని బట్టి వేతనాలు ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలో సీఏ తర్వాత జీఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు పొజిషన్ ఇస్తున్నారు. సీఏలకు ఏటా రూ.50 లక్షలు ఇవ్వడం కంటే జీఎస్టీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం చేసిన వారికి రూ. 21 లక్షలు ఇవ్వడం కంపెనీలకు లాభదాయకంగా మారింది. – ఎక్కుల్‌దేవి పరమేశ్వర్ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి) సీఏ చేసే పనులన్నీ చేస్తున్నాం కామర్స్ తర్వాత యూఎస్‌లో మాస్టర్ ప్రోగ్రాం చేశాను. బహుళజాతి కంపెనీలో ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వింగ్‌లో ఉద్యోగం వచ్చింది. మొదట్లో రూ.18 లక్షలు ఇచ్చారు. సీఏ చేసే పనులన్నీ చేయగలుగుతున్నాం. జీఎస్టీ విధానంలో ఎక్కువ అనుభవం గడించాం. రెండేళ్ళల్లో నా వేతనం రూ.21 లక్షలకు పెరిగింది. – శశాంక్ (బహుళజాతి కంపెనీ ఉద్యోగి, ఢిల్లీ) -
ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్మెంట్ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. చదవండి: ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా 2021–22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక (సోషియో ఎకనామిక్) సర్వేలో పలు విషయాలు వెల్లడించారు. ఢిల్లీ తరహాలో మళ్లీ డిగ్రీ కోర్సుల వైపు ఉత్తరాదిన ఇంజినీరింగ్ విద్య నామమాత్రంగా ఉంటుంది. 90 శాతం మంది డిగ్రీ కోర్సులవైపే మొగ్గుచూపుతారు. డిగ్రీ కోర్సులు చేయడానికి ఉత్తరాదిలో చాలామంది ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90వేల సీట్లుంటే..అన్నీ భర్తీ అవుతాయి. అంటే డిగ్రీ కోర్సులకు దేశంలోనే ఢిల్లీలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. గత ఏడాది అనంతపురం జిల్లాలో 14,342 మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ. రాష్ట్రంలోనే రెండో స్థానం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరిన వారి సంఖ్యను చూస్తే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 17,921 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఆ తర్వాతి స్థానంలో 14,342 అడ్మిషన్లతో ఉమ్మడి అనంతపురం జిల్లా నిలిచింది. అందులోనూ అత్యధికగా బీసీ విద్యార్థులు 8,190 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 4,260 మంది ఎస్సీ విద్యార్థులు, 827 మంది ఎస్టీలు డిగ్రీ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 30,311 అడ్మిషన్లు జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 1,924 మాత్రమే. ఆనర్స్ డిగ్రీతో ఉపాధి అవకాశాలు ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన నూతన సిలబస్ ప్రకారం యూజీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సుతో సెలవు రోజుల్లో ఉద్యోగాధారిత శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతోంది. స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తిచేయాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రాజెక్ట్‌లూ పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు పొందారు. – ప్రొఫెసర్ ఎ.మల్లికార్జున రెడ్డి, రెక్టార్, ఎస్కేయూ వినూత్నమైన సిలబస్‌పై ఆసక్తి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్ ప్రవేశ పెట్టారు. కళాశాల నుంచి కొలువులు దక్కేలా ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా అవకాశాలు కల్పించారు. డిగ్రీ ఆనర్స్ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. –డి.పులికొండ, బీకాం (కంప్యూటర్స్) బహుళజాతి సంస్థల్లో అవకాశాలు దక్కేలా.. కోర్సు పూర్తయ్యాక బహుళజాతి సంస్థల్లో (మల్టీనేషనల్ కంపెనీస్) ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇందుకు నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు దోహదపడుతోంది. మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేస్తే ఎగ్జిట్ అయి సాధారణ డిగ్రీ పొందవచ్చు. నాలుగు సంవత్సరాలు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. – కె.సురేష్, బీకాం (కంప్యూటర్స్) బీటెక్ కోర్సుకు దీటుగా.. స్కిల్ ఆధారిత కోర్సులతో ప్రత్యేక నైపుణ్యాలు అలవడుతున్నాయి. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. తద్వారా కోర్సులో ఉన్నçప్పుడే పరిశ్రమల అనుభవం వస్తోంది. బీటెక్ కోర్సుకు దీటుగా డిగ్రీ సిలబస్ రూపకల్పన చేశారు. దీంతో డిగ్రీ వైపే ఆసక్తి చూపాం. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉంటే చాలు. డిగ్రీ ఉన్నా.. బీటెక్ ఉన్నా అవకాశాలు దక్కుతాయి. –సంగమిత్ర, డిగ్రీ విద్యార్థిని -
డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది. పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, డా.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్లకే అన్నది ఇప్పటివరకు ఉన్నమాట. ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిగ్రీలో ఏం చేయబోతున్నారు? సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు. దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్‌తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. –ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మంచి ప్రయత్నం సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది. – గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ -
నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఐటీ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నాన్ ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు వీఐటీ యూనివర్శిటి శుభవార్త అందించింది. తమ యూనివర్శిటీలో ఆర్ట్స్ బీబీఏ, లా, బీ.కమ్, బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే లక్ష్యంగా జీవీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు గురువారం వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు డా.శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక బాధ్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జీవీ మెరిట్ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం వందశాతం స్కాలర్షిప్ లభిస్తుందని వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ.. రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలన్నారు. అతను/ఆమె డిగ్రీ ప్రోగ్రాంలో అన్ని సంవత్సరాలకు 50 శాతం స్కాలర్షిప్ పొందుతారని తెలిపారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25 శాతం స్కాలర్షిప్ లభిస్తుంది దీంతో మొత్తం 75 శాతం స్కాలర్షిప్ అవుతుంది. అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు.. ⇔ బీబీఏలో జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్ కోర్సులు, ⇔ న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను, ⇔ బి.కామ్ కోర్స్మూడేళ్ళతోపాటుసిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకుప్రాధమికంగా బోదించటం జరుగుతుంది. అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటాసైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది. ఈ రెండు మెరిట్ స్కాలర్షిప్లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది. ఈ అర్హత కలిగి విద్యార్థిని/ విద్యార్థులు తేదీ 17.02.2021 నుంచి 31.05.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్ డా. ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in నుసందర్శించవచ్చని లేదా 7901091283కి కాల్ చేసి లేదా admission@vitap.ac.inకి ఈ-మెయిలు చేసి వివరాలను పొందవచ్చని చెప్పారు. -
బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు
సాక్షి, సిటీబ్యూరో: ఐటీకి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది యువత బీకాం(బ్యాచిలర్ ఆఫ్ కామర్స్) కోర్సు వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సైన్సు కోర్సులకు ఉన్న ఆదరణ ఈ కోర్సుకు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం గ్రేటర్లో అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలు, ఔషధ పరిశ్రమలు, హోటళ్లు, బ్యాంకులు వెలిశాయి. ప్రతి సంస్థ తమ ఉత్పత్తులు, విక్రయాలు, రాబడులు, చెల్లింపుల ఆడిటింగ్ పక్కాగా నిర్వహించేందుకు ఆర్థిక అంశాలపై పట్టున్న బీకాం బ్యాక్ గ్రౌండ్ ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా బీఏ, బీఎస్సీ కోర్సులు చదివిన విద్యార్థులతో పోలిస్తే బీకాం కోర్సు చదువుకున్న విద్యార్థులకు సుల భంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ(దోస్త్) పరిధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అత్యధిక కళాశాలలు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సంప్రదాయ కోర్సులకు బదులు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న బీకాంలో కంప్యూటర్ కోర్సులను ఏర్పాటు చేశాయి. ఇతర వర్సిటీల పరిధిలోని విద్యార్థులు సైన్స్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరితే.. గ్రేటర్లో మాత్రం ఇందుకు భిన్నంగా బీకాం కోర్సులను ఎంచుకోవడం విశేషం. నిజానికి కాలేజీలు, సీట్ల సంఖ్య పరంగా చూస్తే బీఎస్సీ కోర్సుల్లో ఎక్కువ అడ్మిషన్లు కన్పించినా..తక్కువ కాలేజీలు, సీట్లు ఉన్న బీకాం కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం మిగిలిన సీట్ల సంఖ్యను విశ్లేషిస్తే..ఇదే అంశం స్పష్టమవుతుంది. ఆ ఖాళీల భర్తీ కోసం తుది విడత కౌన్సిలింగ్ తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, మహత్మాగాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ విద్యా సంవత్సరం 1110 డిగ్రీ కాలేజీలు ఉండగా, వీటిలో 130 మైనార్టీ, ఇతర కాలేజీలు సొంతం గా అడ్మిషన్లు చేసుకోగా, మిగిలిన 980 కాలేజీలు దోస్త్‌లో చేరాయి. వీటి పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో మొత్తం 3,83,514 సీట్లు ఉండగా, ఇప్పటి వరకు చేపట్టిన మూడు దశల కౌన్సిలింగ్స్లో 1,41,503 సీట్లు భర్తీ అయ్యాయి. 2,42, 011 సీట్లు మిగిలిపోయాయి. వీటి భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ప్రత్యేక రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ప్రక్రియను చేపట్టింది. జులై 26 నుంచి 29వ తేదీలోపు ఆయా వి ద్యార్థులంతా కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో సెల్ప్‌రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సీట్ల సంఖ్య తగ్గింది. సీట్ల సంఖ్య తో పాటు దరఖాస్తు దారుల సంఖ్య కూడా తగ్గడం కొసమెరుపు. 78 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు వందశాతం సీట్లు భర్తీ అయిన కాలేజీలు 11 ఉండగా, ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా భర్తీ కానీ కాలేజీలు 78 ఉన్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలో అత్య థికంగా 26 కాలేజీలు ఉండగా, మహత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 13 కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 18 కాలేజీలు, పాలమూరు వర్సిటీ పరిధి లో ఐదు కాలేజీలు, శాతవాహన వర్సిటీ పరిధిలో పది కాలేజీలు, తెలంగాణ వర్సిటీ పరిధిలో ఆరు కాలేజీలు ఉండటం గమనార్హం. మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరత, సొంత భవనాలు లేకపోవడంతో పాటు ఎక్కువ శాతం విద్యార్థులు సంప్రదాయ కోర్సులకు బదులు..సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నిర్వహించిన మూడు విడతల కౌన్సిలింగ్లో డిగ్రీ కోర్సుల్లో చేరిన వి ద్యార్థులను పరిశీలిస్తే...బాలురతో పోలిస్తే..బాలికలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు 1,41,503 సీట్లు భర్తీ కాగా వీరిలో 83,125 మంది అమ్మాయిలు కాగా, 58378 మంది అబ్బాయిలు ఉన్నారు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా బీకాం కోర్సుల్లో విద్యార్థులు చేరారు. ఉపాధి అవకాశాలు లభిస్తుండటం వల్లే: ప్రొఫెసర్ అప్పారావు బీకాం కంప్యూటర్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ విభాగాల్లోనే కాకుండా ప్రైవేటు సంస్థల్లోనూ సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అందువల్లే విద్యార్థులు ఎక్కువగా బీకాం వైపు మొగ్గు చూపుతున్నారు. -
బీకాం విద్యార్థుల ప్రశ్నపత్రం తారుమారు
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం డొల్లతనం మరోసారి బయటపడింది. బీకాం ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు అందజేయాల్సిన పేపర్ తారుమారు (ఒక ప్రశ్నపత్రం బదులు మరోప్రశ్నపత్రం ఇవ్వడం) అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సప్లిమెంటరీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వడంతో వారంతా తీవ్ర గందరగోళంలో ఉన్నారు. తమకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం: బీఆర్‌ఏయూ పరిధిలో గతనెల 24 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఐదో సెమిస్టర్, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఇందులో బీకాం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఫండమెంటల్ అకౌంటింగ్ పరీక్ష జరిగింది. అయితే వీరికి ఇచ్చిన ప్రశ్నపత్రం తారుమారైంది. 2016–17 బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ఇవ్వకుండా.. సప్లిమెంటరీ (2015–16) విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. తమ ప్రశ్నాపత్రమే ఆనుకుని వారంతా పరీక్ష రాసేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ప్రశ్నపత్రం తారుమారైనట్లు విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు. స్కోరింగ్ సబ్జెక్ట్ అకౌంటింగే! వాస్తవానికి బీకాం విద్యార్థులకు ఫండమెంటల్/ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్‌ను స్కోరింగ్ సబ్జెట్‌గా అంతా భావిస్తారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న పరీక్షలకు గత ఐదు మాసాలగా సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షలకొచ్చేసరికి తమది కాని ప్రశ్నపత్రాన్ని అందజేసి తమకు నిండా ముంచారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ బీకాం విద్యార్థులు సుమారు నాలుగు వేల మంది ఉండగా ఇందులో సగానికిపైగా విద్యార్థులు తారుమారు ప్రశ్నపత్రం కారణంగా నష్టపోయినట్లు తెలిసింది. తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో విద్యార్థి సంఘాలతో మమేకమై యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగుతామని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కల్పించుకుని ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మాదృష్టికి రాలేదు పేపర్లు మారిన విషయం ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం. వీటి పంపిణీలో పొరపాటు జరిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు మాదృష్టికి తీసుకురావాలి. లేదంటే అది వారి తప్పిదమవుతుంది. మా దృష్టికి వస్తేనే ఎలా న్యాయం చేయాలనేదానిపై ఆలోచన చేస్తాం. – తమ్మినేని కామరాజు, బీఆర్ ఏయూ పరీక్షల విభాగం డీన్ -
బీకాం కంప్యూటర్స్ కోర్సు యధాతథం
-సిలబస్ మార్పుతో గందరగోళం -కాలేజీల నిరసనతో సిలబస్‌లో మార్పులకు కమిటీ -పునరాలోచనలో ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సుకు సంబంధించి ఉన్నత విద్యామండలి చేసిన మార్పులు, చేర్పులపై కాలేజీలనుంచి నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం పలు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న బీకాం కంప్యూటర్స్ కోర్సులో మండలి చేసిన మార్పుల వల్ల నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా పాత విధానంలో ఫస్టియర్నుంచి మూడేళ్ల పాటు కంప్యూటర్ సిలబస్‌ను విద్యార్ధులు నేర్చుకొనే వారు. దీనివల్ల ఆయా కంపెనీలు ఈ కోర్సు చదివిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే ఉన్నత విద్యామండలి ఈ ఏడాదినుంచి బీకాం కంప్యూటర్స్ కోర్సులో చేసిన మార్పులు, చేర్పులతో వివాదం ఏర్పడింది. బీకాం కోర్సులో మొదటి రెండేళ్లు కామన్‌గా అందరికీ ఒకే సిలబస్‌ను ఏర్పాటుచేసి మూడో సంవత్సరంలో స్పెషలైజేషన్ సిలబస్‌ను రూపొందించింది. మూడో సంవత్సరంలో ఆయా విద్యార్ధులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అధ్యయనం చేయాలి. అలా నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ మూడో సంవత్సరంలో మాత్రమే పెట్టారు. బీకాం కంప్యూటర్స్ కోర్సులో మూడో సంవత్సరంలోనే మొత్తం సిలబస్ ఉందని, ఒకే సంవత్సరం మొత్తం అన్ని పేపర్లను చదవడం విద్యార్ధులకు భారంగా మారుతుందని కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొదటి రెండు సంవత్సరాల్లో కంప్యూటర్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాధమికంగా పెట్టిన సిలబస్ చాలా స్వల్పంగా ఉందని పేర్కొంటున్నారు. వివిధ కంపెనీలు మొదటి రెండేళ్ల సిలబస్‌ను చూశాక కంపెనీలు ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చే అవకాశం లేదని వివరించారు. పాత విధానంలోనే మొదటి సంవత్సరం నుంచే కంప్యూటర్ సిలబస్‌ను పక్కాగా పెట్టి మూడో సంవత్సరంలో పూర్తిస్థాయి సిలబస్‌ను పొందుపర్చడం వల్ల ఫలితాలుంటాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు విన్నవించారు. దీంతో మండలి ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయంపై పునరాలోచనలో పడింది. బీకాం కంప్యూటర్ కోర్సుకు ఉన్న ఆదరణను పరిగణనలోకి తీసుకొని దాన్ని యథాతథంగా కొనసాగించడానికి, కాలేజీల విన్నపం మేరకు సిలబస్‌లో మార్పులు చేయడానికి నిర్ణయించింది. సిలబస్ మార్పులపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఉపకులపతులు కేవీ రావు, వెంకయ్య, ప్రొఫెసర్ చలం, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావులతో ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు వివరించారు. మూడో సంవత్సరంలోని సిలబస్నుంచే కొన్ని చాప్టర్లను మినహాయించి మొదటి, రెండో సంవత్సరం బీకాం కంప్యూటర్ తరగతులకు సిలబస్‌గా మార్పు చేయనున్నారు. -
ఫైనాన్స్, అకౌంటింగ్లో సర్టిఫికెట్ కోర్స్
సాక్షి, బిజినెస్ బ్యూరో : కార్పొరేట్ ఫైనాన్స్‌లో చక్కని కెరీర్ కావాలనుకునే యువత కోసం ప్రత్యేకంగా ‘అప్లయిడ్ ఫైనాన్స్- అకౌంటింగ్లో సర్టిఫికెట్ కోర్సు’ను అందజేస్తున్నట్లు ఆంధ్రమహిళా సభ తెలియజేసింది. బీకామ్, బీబీఏ అర్హత గల యువత కోసం ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఆంధ్ర మహిళాసభ ప్రొఫెసర్ సి.వి.రామ్మోహన్ తెలియజేశారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సుకు రూ.12,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఉస్మానియా క్యాంపస్ రోడ్లో ఉన్న ఆంధ్రమహిళా సభను సంప్రతించవచ్చు. ఏఎంఎస్ఎస్ఓఐ.ఓఆర్జీ.ఇన్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.