Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ! | India Skill Report Says Full Demand-B-Com Commerce-Huge Employment | Sakshi
Sakshi News home page

Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ!

Published Sat, Jan 7 2023 4:19 AM | Last Updated on Sat, Jan 7 2023 12:17 PM

India Skill Report Says Full Demand-B-Com Commerce-Huge Employment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజీ రూ.20 లక్షలు అంటే.. అబ్బో అంటారు. కానీ ఇప్పుడు బీకాం చేసిన విద్యార్థికే ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారంటే నమ్మగలమా? నమ్మా­ల్సిందే! అంతర్జాతీయ సంస్థలే కాదు, భారత్‌లోని కంపెనీలూ ఇప్పు­డు అనలిస్ట్‌లకు ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

2023లో 60 శాతం వరకు అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉందని ఇండియా స్కిల్‌ రిపోర్టు– 2023 చెబుతోంది. భవిష్యత్తులోనూ కామర్స్‌ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఆరేళ్ల నుంచే డిమాండ్‌ పెరుగుతూ వస్తోందని పేర్కొంది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఊహించని విధంగా ఏకంగా 60.62 శాతానికి చేరుకోబోతోందని వివరించింది. ఇక బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, సైబర్‌ క్రైం కోర్సుల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపింది.

అన్ని రంగాల్లో పెరిగిన అవకాశాలు..
కరోనా తర్వాత వాణిజ్య రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ–కామర్స్‌ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీల్లో డేటా అనాలసిస్‌ వ్యవస్థ పెరిగింది. దీంతో అనలిస్ట్‌ల అవసరం పెరిగింది. బీకాం నేపథ్యం ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్, తద్వారా ఉపాధి పెరగడానికి ఇది దోహద పడింది. ఇండియాలో బీకామ్‌కు ఉద్యోగావకాశాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్‌ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైంది.

గతంలో ఉన్న ఇన్‌కం ట్యాక్స్‌కు, ఇప్పటి జీఎస్టీకి చాలా తేడాలున్నాయి. ఇదే కాలంలో డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ట్యాక్స్‌ నైపుణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్‌ బిజినెస్‌ రంగాల్లో కూడా కామర్స్‌ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది.  ఈ నేపథ్యంలోనే అనలిస్ట్‌ ఉద్యోగుల వేతనం మూడేళ్ళల్లోనే 98 శాతం పెరిగినట్టు ఇండియా స్కిల్‌ నివేదిక పేర్కొంది. బీకాం కోర్సుల్లో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని తెలిపింది.

బీకాం కోర్సులకు క్రేజ్‌
అందివస్తున్న మార్కెట్‌ అవసరాల నేపథ్యంలో రాష్ట్రంలో బీకాం కోర్సులకు రానురాను డిమాండ్‌ పెరుగుతోంది. డిగ్రీ ప్రవేశాల్లో 41 శాతం వరకు బీకాం విద్యార్థులే ఉంటున్నారు. వాస్తవానికి ఆరేళ్ళ కిందట 46 శాతం సైన్స్‌ విద్యార్థులే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. 2017–18లో 80,776 మంది బీకాం కోర్సులో చేరితే, 2022–23లో 87,480 మంది చేరారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా బీకాం కోర్సుల్లో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. బీకాంలో జనరల్, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను అంచనా వేసే టెక్నాలజీని కూడా బీకాం కోర్సుల్లో మేళవించారు. ఈ తరహా కామర్స్‌ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 



ఈ–కామర్స్‌ పెరగడంతో మంచి డిమాండ్‌ 
ఈ–కామర్స్‌ పెరిగిన నేపథ్యంలో ట్యాక్స్‌ కన్సల్టెన్సీ, ఆడిట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో బహుళజాతి కంపెనీలు కామర్స్‌ విద్యార్థులను అత్యధిక వేతనాలతో నియమిస్తున్నాయి. ప్రతి ఏటా డెలాయిట్, బ్రాడ్‌రిచ్, వెల్స్‌ఫార్‌గో, జేపీ మోర్గాన్‌ వంటి సంస్థలు క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ఢిల్లీలో రూ. 21 లక్షల వరకు బహుళజాతి సంస్థలు ఇస్తున్నాయి. బీకాం తర్వాత విదేశాల్లో ఎంబీఏ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. 
– డాక్టర్‌ మోహన్‌కుమార్‌ (భద్రుక కాలేజీ ప్రిన్సిపల్‌)

జీఎస్టీపై పట్టు ఉంటే మంచి వేతనం
జీఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్‌ విద్యార్థులకు డిమాండ్‌ పెరిగింది. అన్ని రకాల సర్టిఫికేషన్‌ కోర్సులు చేసిన వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఫైలింగ్‌ సిస్టమ్‌లో అనుభవాన్ని బట్టి వేతనాలు ఉన్నాయి. మల్టీ నేషనల్‌ కంపెనీలో సీఏ తర్వాత జీఎస్టీ అడ్మినిస్ట్రేషన్‌ ఉన్న వాళ్ళకు పొజిషన్‌ ఇస్తున్నారు. సీఏలకు ఏటా రూ.50 లక్షలు ఇవ్వడం కంటే జీఎస్టీ సర్టిఫికేషన్‌ ప్రోగ్రాం చేసిన వారికి రూ. 21 లక్షలు ఇవ్వడం కంపెనీలకు లాభదాయకంగా మారింది.
– ఎక్కుల్‌దేవి పరమేశ్వర్‌ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి)

సీఏ చేసే పనులన్నీ చేస్తున్నాం 
కామర్స్‌ తర్వాత యూఎస్‌లో మాస్టర్‌ ప్రోగ్రాం చేశాను. బహుళజాతి కంపెనీలో ఆడిట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌లో ఉద్యోగం వచ్చింది. మొదట్లో రూ.18 లక్షలు ఇచ్చారు. సీఏ చేసే పనులన్నీ చేయగలుగుతున్నాం. జీఎస్టీ విధానంలో ఎక్కువ అనుభవం గడించాం. రెండేళ్ళల్లో నా వేతనం రూ.21 లక్షలకు పెరిగింది. 
– శశాంక్‌ (బహుళజాతి కంపెనీ ఉద్యోగి, ఢిల్లీ)   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement