సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలు (ఫ్యూచర్ స్కిల్స్) కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్‌షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. 21వ శతాబ్దపు విద్యార్థులను ‘కృతిమ మేధ’ (ఏఐ)సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు–2024’ ఊతం ఇచ్చింది.
ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. టాలెంట్ అసెస్‌మెంట్ ఏజెన్సీ ‘వీబాక్స్’ ఏటా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)తో కలిసి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు’ను విడుదల చేస్తోంది. భవిష్యత్‌లో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని తాజా నివేదిక ప్రశంసించింది.
ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ (సంఖ్యాపర నైపుణాలు) కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉండటం విశేషం.
ఇంటర్న్‌షిప్‌లోనూ టాప్
విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను దేశంలోనే ప్రప్రథమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌లో సుమారు 8 లక్షల మందికి షార్ట్‌టెర్మ్, లాంగ్ టెర్మ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించింది.
ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్‌షిప్‌కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 93.50 శాతం స్కోరు సాధిస్తే.. ఇప్పుడు 98.33 శాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 96.72 శాతంతో తెలంగాణ, 93.44 శాతంతో పంజాబ్, 92.44 శాతంతో హర్యానా ఉన్నాయి.
వచ్చే జనవరిలో మరో 2.20 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ 22 ఎడ్యుటెక్ సర్విస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్‌షిప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించింది.
ఉద్యోగాల కల్పనలోనూ మేటి
ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోందని నివేదిక కొనియాడింది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 65.58 శాతం స్కోరుతో 4వ స్థానంలో ఉండగా.. తాజాగా 72.38 శాతం స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. హర్యానా (76.47శాతం), మహారాష్ట్ర (73.03 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రోస్థాయి నగరాలు లేనప్పటికీ ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు లేకపోవడం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పోటీపడీ మరి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరుతో అత్యున్నతంగా నిలిచిందని నివేదిక ఊటంకించింది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు అన్ని వయసు్కలకు ఉపాధి బాగుందని, ముఖ్యంగా 18–21 ఏళ్ల వయసు్కల్లో (73.10 శాతం స్కోరు) ఉద్యోగాల అందించడంలో నాల్గవ స్థానంలో ఉంది.
మహిళలు, పురుషులకు ఉపాధి, ఉద్యోగాల కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తర్వాత బీఈ/బీటెక్‌లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ/బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (73.32 శాతం స్కోరుతో) 2వ స్థానంలో నిలిచింది.
మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. కేరళ, కర్ణాటక మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐటీలో 68.44 శాతం, కంప్యూటర్ సైన్స్‌లో 66 శాతం, ఆ తర్వాత ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది సాంకేతిక విద్యార్థులకు ఏకంగా 1.20 లక్షలకు పైగా క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి.
గొప్ప టాలెంట్ రిజర్వాయర్!
దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ను ‘టాలెంట్ రిజర్వాయర్’గా నివేదిక అభివర్ణించింది. విద్యార్థులకు మెరుగైన విద్య విషయంలో దృఢమైన నిబద్ధత, విభిన్న నైపుణ్యాల సాధికారత కల్పనలో చిత్తశుద్ధిని లేకుండా ఇతంటి వృద్ధి సాధ్యపడదని పేర్కొంది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కొనియాడింది.
ఉద్యోగాల్లో రూ.2.60 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ముఖ్యంగా బీఈ/బీటెక్ విద్యార్థుల్లో నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పింది. ఏపీలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలే ఎక్కువ. కానీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్‌పోర్స్‌లో మెట్రోపాలిటిన్ సిటీలను కూడా వెనక్కినెట్టింది. 39.96 శాతం స్కోర్‌తో హర్యానా తర్వాతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సీఎం దార్శనికతకు నిదర్శనం
భవిష్యత్ ప్రపంచం కృత్రిమ మేధపై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పిం చారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. వాటిని ఫలితాల ప్రతిరూపం తాజా ఇండియా స్కిల్స్ నివేదిక ద్వారా వెల్లడైంది.
దేశంలోనే ‘ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్’లో మనం టాప్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఏఐలో పరిపూర్ణ విజ్ఞానవంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఎల్‌ఎంఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో రిసోర్స్ సెంటర్లు, ఇన్నోవేటివ్ ల్యాబ్స్‌ను పెడతాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి
Comments
Please login to add a commentAdd a comment