పారిశ్రామికవేత్తలతో సమావేశం
ఉపాధి పొందిన యువతతో మాటామంతి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు.
రాష్ట్ర యువతకు నైపుణ్య ‘భవిత’
రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు.
7న సీఎం అనకాపల్లి రాక
సాక్షి, అనకాపల్లి : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న అనకాపల్లి రానున్నారు. వైఎస్సార్ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్‌కు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మలసాల భరత్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment