
విశాఖ. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న భద్రతను ఏ విధంగా తొలగిస్తారని ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయనకు యధావిధిగా భద్రత కొనసాగించాలని కన్నబాబు కోరారు. వైఎస్ జగన్ జడ్ ప్లస్ భద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాల్సిన అవసరం ఉందన్నారు.
వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ పై తన కడుపు మంటను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే తప‍్పుడు కేసులు పెడతారా అంటూ నిలదీశారు కురసాల కన్నబాబు. మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నించారు. మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే గానీ చంద్రబాబులో చలనం రాలేదని ధ్వజమెత్తారు.
మోదీ, అమిత్ షాలకు మిథున్‌రెడ్డి లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.