సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్‌కు చేరుకుంది.
ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది.
8 క్రీడా మైదానాల ఎంపిక
ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్‌డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్‌డోర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించింది.
పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం
15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్‌లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు.
వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు.
జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్‌కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment