రంజీ రారాజు ఎవరో? | Ranji Trophy final from today | Sakshi
Sakshi News home page

రంజీ రారాజు ఎవరో?

Published Wed, Feb 26 2025 4:00 AM | Last Updated on Wed, Feb 26 2025 4:00 AM

Ranji Trophy final from today

నేటి నుంచి దేశవాళీ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌

కేరళతో విదర్భ అమీతుమీ

ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియోహాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

నాగ్‌పూర్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి జరగనున్న 2024–25 రంజీ ట్రోఫీ సీజన్‌ ఫైనల్లో కేరళతో రెండుసార్లు చాంపియన్‌ విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు చేజిక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు అద్భుతాన్ని ఆశిస్తోంది. 

తాజా సీజన్‌లో ఇరు జట్లు నిలకడైన ప్రదర్శన కనబర్చగా... అక్షయ్‌ వాడ్కర్‌ సారథ్యంలోని విదర్భ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఫైనల్‌ చేరే క్రమంలో విదర్భ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించింది. గ్రూప్‌ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందిన విదర్భ... క్వార్టర్‌ ఫైనల్లో తమిళనాడును చిత్తు చేసింది. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైతో జరిగిన సెమీఫైనల్లో విజృంభించిన విదర్భ... స్టార్‌లతో కూడిన ముంబైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి ఫైనల్‌కు చేరింది. 

ఈ క్రమంలో నిరుడు ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో ఇది 90వ సీజన్‌ కాగా... విదర్భ జట్టుకిది నాలుగో ఫైనల్‌. గతంలో 2017–18, 2018–19 సీజన్‌లలో వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు... గతేడాది ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

అప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో విదర్భ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్‌లో విజయ్‌ హజారే ట్రోఫీలో కూడా విదర్భ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన కేరళ సమష్టి కృషితోనే టైటిల్‌ చేజిక్కించుకోవాలని చూస్తోంది. 

బ్యాటింగే బలంగా...  
తాజా సీజన్‌లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన విదర్భ జట్టు... బ్యాటింగే ప్రధాన బలంగా ఫైనల్‌ బరిలోకి దిగనుంది. కెపె్టన్‌ అక్షయ్‌ వాడ్కర్, కరుణ్‌ నాయర్, అథర్వ తైడే, ధ్రువ్‌ షోరే, యశ్‌ రాథోడ్, దానిశ్‌ మాలేవర్‌తో విదర్భ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. 933 పరుగులు చేసిన యశ్‌ రాథోడ్‌ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 5 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో విజృంభించిన యశ్‌... 58.13 సగటుతో ఈ పరుగులు రాబట్టడం విశేషం. 

సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో యశ్‌ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్‌ కీపర్, కెపె్టన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 48.14 సగటుతో 674 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్న సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ 8 మ్యాచ్‌లాడి 45.85 సగటుతో 642 పరుగులు సాధించాడు. 

అందులో 3 సెంచరీలు, 1 హాఫ్‌ సెంచరీ ఉంది. దానిశ్‌ మాలేవర్‌ (557 పరుగులు), ధ్రువ్‌ షోరే (446 పరుగులు) కూడా రాణించారు. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ సమష్టిగా కదంతొక్కుతుంటే... బౌలింగ్‌లో 22 ఏళ్ల హర్‌‡్ష దూబే సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టిన హర్‌‡్ష... ఒక రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 

గతంలో ఈ రికార్డు అశుతోశ్‌ అమన్‌ (2018–19 సీజన్‌లో 68 వికెట్లు; బిహార్‌) పేరిట ఉంది. హర్‌‡్షతో పాటు దర్శన్‌ నల్కండే, నచికేత్‌ భూటె, పార్థ్‌ రెఖడే బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఈ బౌలింగ్‌ దాడిని కాచుకుంటూ పరుగులు రాబట్టాలంటే కేరళ జట్టు శక్తికి మించి పోరాడక తప్పదు.  

సమష్టి కృషితో... 
స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతోనే కేరళ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో 3 మ్యాచ్‌లు గెలిచి మరో రెండు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకున్న సచిన్‌ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో గ్రూప్‌ ‘సి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. అయితే క్వార్టర్‌ ఫైనల్, సెమీఫైనల్లో మాత్రం కేరళ అసాధారణ పోరాటం కనబర్చింది. 

జమ్మూకశ్మీర్‌తో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ముందంజ వేసిన కేరళ... సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో గట్టెక్కింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు సల్మాన్‌ నిజార్, మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. నిజార్‌ 86.71 సగటుతో 607 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

అజహరుద్దీన్‌ 75.12 సగటుతో 601 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 4 అర్ధశతకాలు ఉన్నాయి. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో ఈ జంట అసమాన పోరాటం వల్లే కేరళ జట్టు తుదిపోరుకు అర్హత సాధించింది. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లపై మానసికంగా పైచేయి సాధించడంలో అజహరుద్దీన్, నిజార్‌ది అందెవేసిన చేయి. 

వీరితో పాటు జలజ్‌ సక్సేనా, సచిన్‌ బేబీ, రోహన్‌ కున్నుమ్మల్, అక్షయ్‌ చంద్రన్‌ కూడా కలిసికట్టుగా రాణిస్తే కేరళకు తిరుగుండదు. బౌలింగ్‌లో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ జలజ్‌ సక్సేనా తాజా సీజన్‌లో 38 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్య సర్వతే (30 వికెట్లు) కూడా ఫామ్‌లో ఉన్నాడు. ని«దీశ్, బాసిల్‌ పేస్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు.

విదర్భ ఫైనల్‌ చేరిందిలా... 
» ఆంధ్రపై 74 పరుగుల తేడాతో గెలుపు 
» పుదుచ్చేరిపై 120 పరుగుల తేడాతో విజయం 
» ఉత్తరాఖండ్‌పై 266 పరుగుల తేడాతో గెలుపు 
» హిమాచల్‌ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌88 పరుగులతో విజయం 
» గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 
» రాజస్తాన్‌పై 221 పరుగులతో గెలుపు 
» హైదరాబాద్‌పై 58 పరుగులతో విజయం 
» క్వార్టర్స్‌లో తమిళనాడుపై 198 పరుగులతో గెలుపు 
» సెమీస్‌లో ముంబైపై 80 పరుగులతో విజయం  

కేరళ ఫైనల్‌ చేరిందిలా... 
» పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం 
» కర్ణాటకతో మ్యాచ్‌ ‘డ్రా’ 
» బెంగాల్‌తో మ్యాచ్‌ ‘డ్రా’ 
» ఉత్తరప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌ 117 పరుగులతో గెలుపు 
» హరియాణాపై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 
» మధ్యప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 
» బీహార్‌పై ఇన్నింగ్స్‌ 169 పరుగులతో విజయం 
» క్వార్టర్స్‌లో జమ్ముకశ్మీర్‌పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 
» సెమీస్‌లో గుజరాత్‌పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement