
కేరళ, విదర్భ (Kerala Vs Vidarbha) జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ (Ranji Trophy Final) హోరాహోరీగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో విదర్భ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్ నాయర్ (86) సహకరించాడు. అనంతరం బరిలోకి దిగిన కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.
ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సచిన్ బేబి (Sachin Baby) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేరళను తొలి ఇన్నింగ్స్ సాధించే దిశగా తీసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 235 బంతులు ఎదుర్కొన్న సచిన్.. 10 బౌండరీల సాయంతో 98 పరుగులు చేశాడు. సచిన్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య సర్వటే (79) కేరళ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు.
సర్వటే.. అహ్మద్ ఇమ్రాన్ (37), సచిన్ బేబి సహకారంతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం సచిన్.. సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజహరుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
మూడో రోజు మూడో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా, ఏడెన్ యాపిల్ టామ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 42 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధిస్తే ఈ మ్యాచ్ డ్రా అయినా కేరళనే విజేతగా నిలుస్తుంది. కాబట్టి తొలి ఇన్నింగ్స్ లీడ్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి.
ఇబ్బంది పెట్టిన నల్కండే
ఈ ఇన్నింగ్స్‌లో కేరళకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్‌ను (0) దర్శన్ నల్కండే తెగ ఇబ్బంది పెట్టాడు. వీరిద్దరినీ నల్కండే 13 పరుగుల వ్యవధిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నల్కండే ఈ రెండు వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు. సెమీఫైనల్లో సెంచరీ హీరో మహ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. విదర్భ బౌలర్లలో నల్కండేతో పాటు హర్ష్ దూబే (2), యశ్ ఠాకూర్ (1), పార్థ్ రేఖడే (1) వికెట్లు తీశారు.
అంతకుముందు విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్, కరుణ్ నాయర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.
కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది.