Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం | Ranji Trophy 2024-2025: Harsh Dubey Breaks Record For Most Wickets Picked In A Season | Sakshi
Sakshi News home page

Ranji Trophy Final: చరిత్ర సృష్టించిన దూబే.. విదర్భకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

Published Fri, Feb 28 2025 5:47 PM | Last Updated on Fri, Feb 28 2025 5:56 PM

Ranji Trophy 2024-2025: Harsh Dubey Breaks Record For Most Wickets Picked In A Season

రంజీ క్రికెట్‌లో (Ranji Trohy) విదర్భ (Vidarbha) లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ హర్ష్‌ దూబే (Harsh Dubey) చరిత్ర సృష్టించాడు. ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (69 వికెట్లు) తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీహార్‌ బౌలర్‌ అషుతోష్ అమన్‌ పేరిట ఉండింది. అమన్‌ 2018-19 ఎడిషన్‌లో 68 వికెట్లు తీశాడు. ప్రస్తుత రంజీ ఎడిషన్‌ (2024-25) ఫైనల్లో (కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో) హర్ష్‌, అమన్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఎడిషన్‌లో హర్ష్‌ 19 ఇన్నింగ్స్‌ల్లో 16 సగటున 69 వికెట్లు తీశాడు.

రంజీ ట్రోఫీ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
హర్ష్‌ దూబే (విదర్భ)- 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (2024-25)
ఆషుతోష్‌ అమన్‌ (బీహార్‌)- 8 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు (2018-19)
జయదేవ్‌ ఉనద్కత్‌ (సౌరాష్ట్ర)- 10 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు (2019-20)

ఫైనల్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హర్ష్‌ సహా విదర్భ బౌలర్లు రాణించడంతో విదర్భ కేరళపై కీలకమైన తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు దనిశ్‌ మలేవార్‌ (153) సూపర్‌ సెంచరీతో విదర్భ భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. అతనికి కరుణ్‌ నాయర్‌ (86) సహకరించాడు.

విదర్భ ఇన్నింగ్స్‌లో మలేవార్‌, కరుణ్‌ నాయర్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్‌ ఆటగాడు నచికేత్‌ భూటే (32) మలేవార్‌, కరుణ్‌ నాయర్‌ తర్వాత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధృవ్‌ షోరే (16), యశ్‌ ఠాకూర్‌ (25), కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (23), అక్షయ్‌ కర్నేవార్‌ (12), హర్ష్‌ దూబే (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్‌ రేఖడే (0), దర్శన్‌ నల్కండే (1), యశ్‌ రాథోడ్‌ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్‌, ఈడెన్‌ యాపిల్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్‌ 2, జలజ్‌ సక్సేనా ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటై, విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 37 పరుగులు వెనుకపడింది. కేరళ ఇన్నింగ్స్‌కు ఆదిత్య సర్వటే (79), కెప్టెన్‌ సచిన్‌ బేబి (98) జీవం పోశారు. వీరిద్దరూ అహ్మద్‌ ఇమ్రాన్‌ (37), సల్మాన్‌ నిజర్‌ (21), మహ్మద్‌ అజారుద్దీన్‌ (34), జలజ్‌ సక్సేనాతో (28) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. 

ఓ దశలో (సచిన్‌ క్రీజ్‌లో ఉండగా) కేరళ విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను దాటేసేలా కనిపించింది. అయితే సచిన్‌ సెంచరీ ముందు అనవసర షాట్‌ ఆడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు జట్టును కూడా ఇరకాటంలో పడేశాడు. సచిన్‌ ఔటయ్యాక కేరళ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా గతి తప్పింది. 18 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది.  పార్థ్‌ రేఖడే సచిన్‌ సహా జలజ్‌ సక్సేనా, ఏడెన్‌ యపిల్‌ టామ్‌ వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హర్ష్‌ కూడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన ఆదిత్య సర్వటే, సల్మాన్‌ నిజర్‌, ఎండీ నిధీశ్‌ వికెట్లు పడగొట్టాడు. నిధీశ్‌ వికెట్‌తో హర్ష్‌ ఓ సింగిల్‌ రంజీ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.

కీలకమైన తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించి విదర్భ కేరళపై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ ఆధారంగా విదర్భనే విజేతగా నిలుస్తుంది. అలాగని కేరళకు దారులు మూసుకుపోలేదు. కేరళ విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ చేసి, వారు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు తమ తొలి రంజీ టైటిల్‌ కలను నెరవేర్చుకుంటుంది. 

ప్రస్తుతానికి కేరళపై విదర్భ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విదర్భ, కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. విదర్భ గత సీజన్‌ ఫైనల్లో ముంబై చేతిలో భంగపడి టైటిల్‌ ఆశలను చేజార్చుకుంది. ఈసారి ఆ జట్టు ఎలాగైనా టైటిల్‌ సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, ఈ సీజన్‌లో విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు చేరింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement