
మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సొంతం
కేరళతో ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేత ఖరారు
రన్నరప్‌తో సరిపెట్టుకున్న కేరళ
హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు
సీజన్ ఆసాంతం నిలకడ కొనసాగించిన విదర్భ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తూ చాంపియన్‌గా ఆవతరించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా... పరాజయమే ఎరగకుండా మూడోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అసమాన పోరాటంతో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్ చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... దేశవాళీ టోర్నీ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. కేరళతో జరిగిన తుదిపోరు ‘డ్రా’గా ముగియడంతో... 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు చాంపియన్‌గా అవతరించడం ఇది మూడోసారి.
2017–18, 2018–19 సీజన్‌లలో వరుసగా ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ జట్టు... మళ్లీ ఆరేళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. తాజా సీజన్‌లో ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచ్‌లాడిన విదర్భ... పరాజయం లేకుండా ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చాంపియన్ విదర్భ జట్టుకు రూ. 5 కోట్లు... రన్నరప్ కేరళ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి.
సొంత మైదానంలో జరిగిన తుదిపోరులో ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (295 బంతుల్లో 135; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (108 బంతుల్లో 25), దర్శన్ నల్కండే (98 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షయ్ కర్నెవర్ (70 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఫలితంగా విదర్భ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 37 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా విదర్భ జట్టు 412 పరుగుల ముందంజలో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు టీ విరామం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ దానిశ్ మాలేవర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 379; కేరళ తొలి ఇన్నింగ్స్: 342; విదర్భ రెండో ఇన్నింగ్స్: పార్థ్ రేఖడే (బి) జలజ్ సక్సేనా 1; ధ్రువ్ షోరే (సి) అజహరుద్దీన్ (బి) ని«దీశ్ 5; దానిశ్ మాలేవర్ (సి) సచిన్ బేబీ (బి) అక్షయ్ చంద్రన్ 73; కరుణ్ నాయర్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) ఆదిత్య 135; యశ్ రాథోడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య సర్వతే 24; అక్షయ్ వాడ్కర్ (బి) ఆదిత్య 25; హర్ష్ దూబే (ఎల్బీడబ్ల్యూ) అధన్ టామ్ 4; అక్షయ్ కర్నెవర్ (బి) బాసిల్ 30; దర్శన్ నల్కండే (నాటౌట్) 51; నచికేత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య 3; యశ్ ఠాకూర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (143.5 ఓవర్లలో 9 వికెట్లకు) 375.
వికెట్ల పతనం: 1–5, 2–7, 3–189, 4–238, 5–259, 6–279, 7–283, 8–331, 9–346,
బౌలింగ్: ని«దీశ్ 15–3–48–1; జలజ్ సక్సేనా 50–11–109–1; అధన్ టామ్ 14–0–57–1; ఆదిత్య సర్వతే 44.5–12–96–4; బాసిల్ 7–2–18–1; అక్షయ్ చంద్రన్ 13–2–33–1.
వీసీఏ నజరానా రూ. 3 కోట్లు
మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు.
గతేడాది మేం ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని ముందే అనుకున్నాం. ప్రతి ఒక్కరు తమ ఆటతీరును మెరుగు పర్చుకున్నారు. దాని ఫలితమే ఈ విజయం. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి పది మందిలో నలుగురు విదర్భ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన హర్ష్, అత్యధిక పరుగులు చేసిన యశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హోదాలో ఈసారి రంజీ ట్రోఫీ అందుకున్న క్షణాలు అద్భుతంగా అనిపించాయి. –అక్షయ్ వాడ్కర్, విదర్భ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment