Domestic tournament
-
విదర్భ తీన్మార్...
సీజన్ ఆసాంతం నిలకడ కొనసాగించిన విదర్భ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తూ చాంపియన్‌గా ఆవతరించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా... పరాజయమే ఎరగకుండా మూడోసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అసమాన పోరాటంతో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్ చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... దేశవాళీ టోర్నీ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. కేరళతో జరిగిన తుదిపోరు ‘డ్రా’గా ముగియడంతో... 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు చాంపియన్‌గా అవతరించడం ఇది మూడోసారి. 2017–18, 2018–19 సీజన్లలో వరుసగా ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ జట్టు... మళ్లీ ఆరేళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. తాజా సీజన్లో ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచ్‌లాడిన విదర్భ... పరాజయం లేకుండా ట్రోఫీ కైవసం చేసుకోవడం విశేషం. సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చాంపియన్ విదర్భ జట్టుకు రూ. 5 కోట్లు... రన్నరప్ కేరళ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. సొంత మైదానంలో జరిగిన తుదిపోరులో ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు... 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (295 బంతుల్లో 135; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (108 బంతుల్లో 25), దర్శన్ నల్కండే (98 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షయ్ కర్నెవర్ (70 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఫలితంగా విదర్భ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 37 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా విదర్భ జట్టు 412 పరుగుల ముందంజలో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు టీ విరామం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ దానిశ్ మాలేవర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, హర్ష్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 379; కేరళ తొలి ఇన్నింగ్స్: 342; విదర్భ రెండో ఇన్నింగ్స్: పార్థ్ రేఖడే (బి) జలజ్ సక్సేనా 1; ధ్రువ్ షోరే (సి) అజహరుద్దీన్ (బి) ని«దీశ్ 5; దానిశ్ మాలేవర్ (సి) సచిన్ బేబీ (బి) అక్షయ్ చంద్రన్ 73; కరుణ్ నాయర్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) ఆదిత్య 135; యశ్ రాథోడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య సర్వతే 24; అక్షయ్ వాడ్కర్ (బి) ఆదిత్య 25; హర్ష్ దూబే (ఎల్బీడబ్ల్యూ) అధన్ టామ్ 4; అక్షయ్ కర్నెవర్ (బి) బాసిల్ 30; దర్శన్ నల్కండే (నాటౌట్) 51; నచికేత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య 3; యశ్ ఠాకూర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (143.5 ఓవర్లలో 9 వికెట్లకు) 375. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–189, 4–238, 5–259, 6–279, 7–283, 8–331, 9–346, బౌలింగ్: ని«దీశ్ 15–3–48–1; జలజ్ సక్సేనా 50–11–109–1; అధన్ టామ్ 14–0–57–1; ఆదిత్య సర్వతే 44.5–12–96–4; బాసిల్ 7–2–18–1; అక్షయ్ చంద్రన్ 13–2–33–1.వీసీఏ నజరానా రూ. 3 కోట్లు మూడోసారి రంజీ టైటిల్ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన యశ్ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్ కోచ్ ఉస్మాన్ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్ కోచ్ అతుల్ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నితిన్ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ యువరాజ్ సింగ్ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్ అమిత్ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు. గతేడాది మేం ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని ముందే అనుకున్నాం. ప్రతి ఒక్కరు తమ ఆటతీరును మెరుగు పర్చుకున్నారు. దాని ఫలితమే ఈ విజయం. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి పది మందిలో నలుగురు విదర్భ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన హర్ష్, అత్యధిక పరుగులు చేసిన యశ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హోదాలో ఈసారి రంజీ ట్రోఫీ అందుకున్న క్షణాలు అద్భుతంగా అనిపించాయి. –అక్షయ్ వాడ్కర్, విదర్భ కెప్టెన్ -
దేశవాళీ టోర్నీలు పెంచాలి
టెన్నిస్ క్రీడకు మరింత ఆదరణ లభించాలంటే... దేశవాళీ టోర్నీలు విరివిగా నిర్వహించాలని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న 44 ఏళ్ల బోపన్న... భారత్‌లో టెన్నిస్ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ముందున్న సవాళ్లు, తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో విడిపోయి కొత్త భాగస్వామితో కలిసి ఆడనుండటం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాడు. బోపన్న పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...» మన దేశంలో టెన్నిస్ భవిష్యత్తు కోసం మొదట అఖిల భారత టెన్నిస్ సంఘాన్ని క్రమబద్దీకరించాలి. దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా టోర్నమెంట్లు నిర్వహించాలి. దేశవాళీ సర్క్యూట్‌ను బలంగా నిర్మించాలి. ‘ఫ్యూచర్స్’, ‘చాలెంజర్స్’ వంటి టోర్నీలు అవసరమే అయినా... వాటితో పాటు దేశవాళీ టోర్నీలు కూడా చాలా ముఖ్యం. » జూనియర్ స్థాయిలో రాణించిన ఎందరో ప్లేయర్లు 18 ఏళ్ల తర్వాత ఏ టోర్నీల్లో పాల్గొనాలో తెలియక ఆటకు స్వస్తి చెబుతున్నారు. తదుపరి స్థాయిలో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు. పెద్ద టోర్నీల కోసం ప్రయాణాలు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రతిభావంతులు ఆటకు దూరం అవుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా నగదు ప్రోత్సాహకాలు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే దీన్ని మరింత బలోపేతం చేసి ఒక వ్యవస్థగా మార్చాలి. » గత రెండేళ్లుగా అందరూ నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే అదే సమయంలో రెండేళ్లుగా నేను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీలకు అర్హత సాధించాను. అంటే, సీజన్ ఆసాంతం బాగా ఆడాననే కదా అర్థం. మరి అలాంటప్పుడు వీడ్కోలు ఆలోచనలు ఎందుకు వస్తాయి. » ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా.. శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఆలోచన కూడా దరిచేరనివ్వను. » కెరీర్ చరమాంకంలో ఉన్నాననే విషయాన్ని పట్టించుకోను. గత 12 నెలల కాలంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాను. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. » సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నాడో ఎబ్డెన్కే తెలియాలి. అతడి కారణాలు అతడికి ఉంటాయి. గత ఏడాది యూఎస్ ఓపెన్ సమయంలో అతను వేరే ఆటగాడితో కలిసి ఆడనున్నట్లు మొదట చెప్పాడు. ఆ తర్వాత తిరిగి నాతో కలిసి కోర్టులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు. » ఎబ్డెన్ తన నిర్ణయం ఆలస్యంగా వెల్లడించడంతో నికోలస్ బారియెంటాస్ (కొలంబియా)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నా. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో సీడింగ్ లభించనుంది. గతంలో నికోలస్‌తో ప్రత్యరి్థగా తలపడ్డాను. అతడి బేస్‌లైన్ గేమ్ బలంగా ఉంటుంది. » బారియోంటాస్తో కలిసి ప్రస్తుతానికి రెండు టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నా. అడిలైడ్ ఓపెన్‌తో పాటు, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కలిసి ఆడుతాం. ఈ రెండు టోర్నీల తర్వాత ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు కాపాడుకోకపోతే మాస్టర్స్ టోర్నీ ‘డ్రా’లలో అవకాశం లభించదు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. -
ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం
దేశవాలీ టోర్నీల విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశీయ టోర్నీల్లో విజేతలతో పాటు అన్ని జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్లో అధికారికంగా ప్రకటించారు. దేశవాలీ టోర్నీల ప్రైజ్‌మనీ పెంచుతున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని జై షా తెలిపారు. రంజీ ట్రోఫీ సహా మహిళల దేశవాలీ వన్డే, టి20 టోర్నీల్లో ఇచ్చే ప్రైజ్‌మనీలో భారీ పెంపుదల తెచ్చింది. రంజీ ట్రోఫీ విజేత జట్టకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీని రూ. 5కోట్లకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ. కోటి అందించనున్నారు. ఇక దులీప్ ట్రోఫీ విజేతకు రూ. కోటి, రన్నరప్‌కు రూ 50 లక్షలు, విజయ్ హజారే ట్రోఫీ విజేతకు రూ. కోటి.. రన్నరప్‌కు రూ.50 లక్షలు, దేవదర్ ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతకు రూ. 80 లక్షలు.. రన్నరప్‌కు రూ.40 లక్షలు అందించనున్నారు. ఇక దేశవాలీ మహిళల వన్డే ట్రోఫీ(సీనియర్) విజేతకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 లక్షల ప్రైజ్‌మనీని రూ.50 లక్షలకు పెంచింది. అలాగే రన్నరప్‌కు రూ. 25 లక్షలు ఇవ్వనుంది. ఇక మహిళల టి20 ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు.. రన్నరప్‌కు రూ. 20 లక్షలు ఇవ్వనుంది. I’m pleased to announce an increase in prize money for all @BCCI Domestic Tournaments. We will continue our efforts to invest in Domestic Cricket – which is the backbone of Indian Cricket. Ranji winners to get ₹5 crores (from 2 cr), Sr Women winners ₹50 lacs (from 6 lacs)🇮🇳 pic.twitter.com/Cgpw47z98q — Jay Shah (@JayShah) April 16, 2023 -
40 ఓవర్లు... 497 పరుగులు
- టి20ల్లో అత్యధిక స్కోరు - కివీస్ టోర్నీలో ప్రపంచ రికార్డు న్యూప్లైమౌత్ (న్యూజిలాండ్): టి20 క్రికెట్లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక పరుగుల కొత్త రికార్డు నమోదైంది. న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో జట్ల మధ్య బుధవారం జరిగిన టి20 మ్యాచ్‌లో 40 ఓవర్లలో మొత్తం 497 పరుగులు నమోదయ్యాయి. గత ఆగస్టులో భారత్, వెస్టిండీస్ మధ్య లాడర్‌హిల్‌లో జరిగిన మ్యాచ్‌లో చేసిన 489 పరుగుల రికార్డు దీంతో కనుమరుగైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఒటాగో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హామిష్ రూథర్‌ఫర్డ్ (50 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా, అనారు కిచెన్ (33 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (56 బంతుల్లో 116; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, టామ్ బ్రూస్ (29 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
సైనా నెహ్వాల్‌పై కోర్టుకెళతాం: పున్నయ్య
విజయవాడ స్పోర్ట్స్: భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై కోర్టుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పున్నయ్య చౌదరి తెలిపారు. భారత్‌కు చెందిన అంతర్జాతీయస్థాయి క్రీడాకారులందరూ దేశవాళీ టోర్నీల్లో ఆడాలనే నిబంధన ఉన్నప్పటికీ... సైనా దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పున్నయ్య విమర్శించారు. ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని సైనాకు నాలుగుసార్లు మెయిల్ పంపించినా ఆమె నుంచి కనీస స్పందన రాలేదన్నారు. స్టార్ ప్లేయర్లు పాల్గొనకపోతే స్పాన్సర్లు రాకుండా పోతారని... ఆటకు ఆదరణ కూడా తగ్గుతుందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి దేశవాళీ టోర్నీలకు దూరంగా ఉండే క్రీడాకారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి సూచించేలా కోర్టుకెళ్లనున్నట్లు తెలిపారు.