40 ఓవర్లు... 497 పరుగులు
- టి20ల్లో అత్యధిక స్కోరు
- కివీస్ టోర్నీలో ప్రపంచ రికార్డు
న్యూప్లైమౌత్ (న్యూజిలాండ్): టి20 క్రికెట్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక పరుగుల కొత్త రికార్డు నమోదైంది. న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో జట్ల మధ్య బుధవారం జరిగిన టి20 మ్యాచ్‌లో 40 ఓవర్లలో మొత్తం 497 పరుగులు నమోదయ్యాయి. గత ఆగస్టులో భారత్, వెస్టిండీస్ మధ్య లాడర్‌హిల్‌లో జరిగిన మ్యాచ్‌లో చేసిన 489 పరుగుల రికార్డు దీంతో కనుమరుగైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఒటాగో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హామిష్ రూథర్‌ఫర్డ్ (50 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా, అనారు కిచెన్ (33 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (56 బంతుల్లో 116; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, టామ్ బ్రూస్ (29 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.