అప్పుడే భారత్‌లో టెన్నిస్‌కు మరింత ఆదరణ
డబుల్స్ దిగ్గజం బోపన్న మనోగతం
టెన్నిస్ క్రీడకు మరింత ఆదరణ లభించాలంటే... దేశవాళీ టోర్నీలు విరివిగా నిర్వహించాలని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అభిప్రాయపడ్డాడు.
టెన్నిస్ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న 44 ఏళ్ల బోపన్న... భారత్‌లో టెన్నిస్ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ముందున్న సవాళ్లు, తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్‌తో విడిపోయి కొత్త భాగస్వామితో కలిసి ఆడనుండటం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాడు. బోపన్న పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...
» మన దేశంలో టెన్నిస్ భవిష్యత్తు కోసం మొదట అఖిల భారత టెన్నిస్ సంఘాన్ని క్రమబద్దీకరించాలి. దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా టోర్నమెంట్లు నిర్వహించాలి. దేశవాళీ సర్క్యూట్‌ను బలంగా నిర్మించాలి. ‘ఫ్యూచర్స్’, ‘చాలెంజర్స్’ వంటి టోర్నీలు అవసరమే అయినా... వాటితో పాటు దేశవాళీ టోర్నీలు కూడా చాలా ముఖ్యం.
» జూనియర్ స్థాయిలో రాణించిన ఎందరో ప్లేయర్లు 18 ఏళ్ల తర్వాత ఏ టోర్నీల్లో పాల్గొనాలో తెలియక ఆటకు స్వస్తి చెబుతున్నారు. తదుపరి స్థాయిలో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు. పెద్ద టోర్నీల కోసం ప్రయాణాలు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రతిభావంతులు ఆటకు దూరం అవుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా నగదు ప్రోత్సాహకాలు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే దీన్ని మరింత బలోపేతం చేసి ఒక వ్యవస్థగా మార్చాలి.
» గత రెండేళ్లుగా అందరూ నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే అదే సమయంలో రెండేళ్లుగా నేను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీలకు అర్హత సాధించాను. అంటే, సీజన్ ఆసాంతం బాగా ఆడాననే కదా అర్థం. మరి అలాంటప్పుడు వీడ్కోలు ఆలోచనలు ఎందుకు వస్తాయి.
» ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా.. శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఆలోచన కూడా దరిచేరనివ్వను.
» కెరీర్ చరమాంకంలో ఉన్నాననే విషయాన్ని పట్టించుకోను. గత 12 నెలల కాలంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాను. శారీరకంగా ఎలాంటి
ఇబ్బందులు లేవు.
» సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నాడో ఎబ్డెన్‌కే తెలియాలి. అతడి కారణాలు అతడికి ఉంటాయి. గత ఏడాది యూఎస్ ఓపెన్ సమయంలో అతను వేరే ఆటగాడితో కలిసి ఆడనున్నట్లు మొదట చెప్పాడు. ఆ తర్వాత తిరిగి నాతో కలిసి కోర్టులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు.
» ఎబ్డెన్ తన నిర్ణయం ఆలస్యంగా వెల్లడించడంతో నికోలస్ బారియెంటాస్ (కొలంబియా)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నా. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో సీడింగ్
లభించనుంది. గతంలో నికోలస్‌తో ప్రత్యరి్థగా తలపడ్డాను. అతడి బేస్‌లైన్ గేమ్ బలంగా ఉంటుంది.
» బారియోంటాస్‌తో కలిసి ప్రస్తుతానికి రెండు టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నా. అడిలైడ్ ఓపెన్‌తో పాటు, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కలిసి ఆడుతాం. ఈ రెండు టోర్నీల తర్వాత ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు కాపాడుకోకపోతే మాస్టర్స్ టోర్నీ ‘డ్రా’లలో అవకాశం లభించదు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment