ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్‌లో ఇది 26 డబుల్స్ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం.
44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment