
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy 2024-25) ఎడిషన్ ఛాంపియన్‌గా విదర్భ (Vidarbha) అవతరించింది. కేరళతో (Kerala) జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 37 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ స్కోర్‌ను క్రాస్ చేయలేకపోవడంతో తొలి సారి రంజీ ఫైనల్‌కు చేరిన కేరళ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
VIDARBHA LIFTS THE RANJI TROPHY. 🏆
- 3rd Ranji title in the last 7 years. 🔥pic.twitter.com/cKclAW94XJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025
విదర్భ రంజీల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. విదర్భ 2017-18, 2018-19 ఎడిషన్లలో వరుసగా రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన విదర్భ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్ ఫైనల్లో విదర్భ ముంబై చేతిలో ఓడింది.
VIDARBHA HAS WON 3 RANJI TROPHY TITLES IN JUST 7 YEARS 🤯
- New force of Indian Domestic Cricket. pic.twitter.com/grTjVqWxLd— Johns. (@CricCrazyJohns) March 2, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విదర్భ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయగా.. కేరళ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.
యువ ఆటగాడు దనిశ్ మలేవార్ (153) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (86) సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్ ఆటగాడు నచికేత్ భూటే (32) మలేవార్, కరుణ్ నాయర్ తర్వాత టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ధృవ్ షోరే (16), యశ్ ఠాకూర్ (25), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (23), అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్ రేఖడే (0), దర్శన్ నల్కండే (1), యశ్ రాథోడ్ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్, ఈడెన్ యాపిల్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ 2, జలజ్ సక్సేనా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కేరళ ఇన్నింగ్స్‌లో ఆదిత్య సర్వటే (79), సచిన్ బేబి (98) సత్తా చాటగా.. అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజాహరుద్దీన్ (34), సల్మాన్ నిజర్ (21), జలజ్ సక్సేనా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కన్నుమ్మల్ (0), ఏడెన్ యాపిల్ టామ్ (10), నిధీశ్ (1) నిరాశపరిచారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే, హర్ష్ దూబే తలో 3 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
సూపర్ సెంచరీతో మెరిసిన కరుణ్
37 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ అయిన కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో (135) మెరిశాడు. కరుణ్‌కు ఈ రంజీ సీజన్‌లో ఇది నాలుగో సెంచరీ. ఓవరాల్‌గా ఈ దేశవాలీ సీజన్‌లో 9వది. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు సెంచరీలు చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించిన మలేవార్
తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దనిశ్ మలేవార్ (73) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ద సెంచరీతో రాణించాడు. ఐదో రోజు ఆట చివరి సెషన్‌లో దర్శన నల్కండే (51 నాటౌట్) కేరళ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వటే 4 వికెట్లు తీయగా.. నిధీశ్, జలజ్, యాపిల్ టామ్, బాసిల్, అక్షయ్ చంద్రన్ తలో వికెట్ పడగొట్టారు.
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా హర్ష్ దూబే
ఈ రంజీ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబేకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీమెంట్ అవార్డు లభించింది. ఈ ప్రదర్శనతో హర్ష్ ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సీజన్‌లో హర్ష్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు.. 3 నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన దనిశ్ మలేవార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.