రంజీ ట్రోఫీ ఫైనల్‌.. విదర్భ భారీ స్కోర్‌.. పోరాడుతున్న కేరళ | Ranji Trophy Final: Kerala Trail By 248 Runs At Day 2 Stumps | Sakshi
Sakshi News home page

రంజీ ట్రోఫీ ఫైనల్‌.. విదర్భ భారీ స్కోర్‌.. పోరాడుతున్న కేరళ

Published Thu, Feb 27 2025 5:34 PM | Last Updated on Thu, Feb 27 2025 5:50 PM

Ranji Trophy Final: Kerala Trail By 248 Runs At Day 2 Stumps

రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) ఎడిషన్‌ ఫైనల్లో గతేడాది రన్నరప్‌ విదర్భ (Vidarbha), తొలిసారి ఫైనల్‌కు చేరిన కేరళ (Kerala) తలపడుతున్నాయి. విదర్భలోని నాగ్‌పూర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కేరళ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (379) చేసింది. 

యువ ఆటగాడు దనిశ్‌ మలేవార్‌ (153) సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ (86) అతనికి సహకరించాడు. దురదృష్టవశాత్తు కరుణ్‌ సెంచరీకి ముందు రనౌటయ్యాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 11వ నంబర్‌ ఆటగాడు నచికేత్‌ భూటే (32) మలేవార్‌, కరుణ్‌ నాయర్‌ తర్వాత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ధృవ్‌ షోరే (16), యశ్‌ ఠాకూర్‌ (25), కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (23), అక్షయ్‌ కర్నేవార్‌ (12), హర్ష్‌ దూబే (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. పార్థ్‌ రేఖడే (0), దర్శన్‌ నల్కండే (1), యశ్‌ రాథోడ్‌ (3) పూర్తిగా నిరాశపరిచారు. కేరళ బౌలర్లలో నిదీశ్‌, ఈడెన్‌ యాపిల్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బాసిల్‌ 2, జలజ్‌ సక్సేనా ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కేరళ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్‌ చంద్రన్‌ (14), రోహన్‌ కన్నుమ్మల్‌ (0) నిరాశపర్చగా.. ఆదిత్య సర్వటే (66 నాటౌట్‌), అహ్మద్‌ ఇమ్రాన్‌ (37) సాయంతో కేరళ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన సర్వటే.. కెప్టెన్‌ సచిన్‌ బేబితో (7) కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

విదర్భ బౌలర్లలో దర్శన్‌ నల్కండే అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 14 పరుగులకే ఇద్దరు కేరళ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. యశ్‌ ఠాకూర్‌ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇమ్రాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. కేరళ.. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 248 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, విదర్భ సెమీఫైనల్లో ముంబైను చిత్తు చేసి ఫైనల్‌కు చేరగా.. కేరళ గుజరాత్‌పై 2 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement