
నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్
ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్ రెండుసార్లూ ఫైనల్ మ్యాచ్‌లలో ఓడి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.
ఇప్పుడు తాజా సీజన్‌లో కూడా టాపర్‌గా ఫైనల్ చేరిన టీమ్ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. తాజా సీజన్ లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ గా ఉన్న మెగ్ లానింగ్ గత ఏడాది ఢిల్లీకి టైటిల్ అందించడంలో విఫలమైంది.
ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్‌లో ఏకంగా 157.89 స్ట్రయిక్ రేట్‌తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్‌కు కీలకం కానుంది.మెగ్ లానింగ్ కూడా 263 పరుగులతో టీమ్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది.
ఆల్‌రౌండర్‌గా జెస్ జొనాసెన్ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్ సదర్లాండ్ తమ బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్ సివర్ 156.50 స్ట్రయిక్‌రేట్‌తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది.
హేలీ మాథ్యూస్ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 156.29 స్ట్రయిక్ రేట్‌తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్‌లో హేలీ, అమెలియా కెర్ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment