మార్చి మొదటి వారంలోనే 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికం
కోస్తాంధ్రలోనూ ఉష్ణతాపం
వచ్చే వారం నుంచి మరింత హీట్
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది.
సెగలకు ఇదీ కారణం
కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
వారంలో మరింత భగభగ
రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment