విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లు టైటిల్ పోరుకు చేరువయ్యాయి. గ్రామ/వార్డు స్థాయి జట్లు ఐదు దశల్లో కొనసాగుతూ చివరిదైన రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విశాఖ వేదికగా ఈ పోటీలు జరుగుతుండగా 26 జిల్లాల జట్లు తలపడుతున్నాయి. ఒక్క మెన్ క్రికెట్ టైటిల్ పోరు మినహా మిగిలిన వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారం జరగనున్నాయి. మహిళల కేటగిరీలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారమే నిర్వహించనున్నారు. విశాఖలోని ఆరు వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి.
వైఎస్సార్ బీ గ్రౌండ్‌తో పాటు ఏఎంసీ, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్, కేవీకే గ్రౌండ్లలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ఏయూ, బ్యాడ్మింటన్ పోటీలకు జీవీఎంసీ ఇండోర్ ఎన్‌క్లేవ్‌లు వేదికలుగా నిలిచాయి. ఖోఖో పురుష, మహిళా విభాగాల్లో ఆదివారం ప్రీక్వార్టర్ ఫైనల్స్ ముగియగా విజయం సాధించిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన అన్ని పోటీలూ సోమవారం పూర్తికానున్నాయి. మహిళా క్రికెట్‌లో తొలి సెమీస్ ముగియగా రెండో సెమీస్ జరగనుంది.
విజయం సాధించిన జట్లు ఫైనల్స్ సోమవారం ఆడనున్నాయి. పురుషుల క్రికెట్ విభాగంలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకోగా మరో రెండు క్వార్టర్‌ఫైనల్స్ జరగాల్సి ఉంది. గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన జట్లతో తలపడనున్నాయి. అనంతరం ఫైనల్స్ ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. బ్యాడ్మింటన్ పురుష, మహిళా విభాగాల్లో సెమీస్‌లో విజయం సాధించిన జట్లు సోమవారం ఫైనల్స్ ఆడనున్నాయి.
వాలీబాల్ మహిళా, పురుష విభాగాల్లోనూ రెండేసి జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా విజయం సాధించినవి ఫైనల్స్‌లో తలపడనున్నాయి. మొత్తమ్మీద పురుష క్రికెట్ మినహా.. మిగతా అన్ని క్రీడాంశాలను సోమవారంతో ముగించాలని నిర్వాహకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఐదు క్రీడాంశాల్లో విజేతలతోపాటు రన్నరప్, సెకండ్ రన్నరప్ జట్లు ట్రోఫీలతోపాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment